యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ)... ఆన్ లైన్ పేమెంట్ల విధానంలో ఇదో విప్లవం అనే చెప్పాలి. దేశంలో నగదు రహిత వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ యూపీఐ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం 50కిపైగా బ్యాంకులు ఇందులో భాగస్వాములయ్యాయి. ప్రస్తుతం ఒక్కో బ్యాంకు వారి యాప్‌లు, వ్యాలట్ యాప్ లలో ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.తొలుత బ్యాంకు యాప్ లోని యూపీఐని క్లిక్ చేస్తే వర్చువల్ అడ్రస్‌ను క్రియేట్ చేసుకోవాలి. బ్యాంకు ఖాతాను యాడ్ చేసుకోవాలి. ఎమ్‌పిన్‌ను క్రియేట్ చేసుకోవాలి. అంతే యూపీఐని ఉపయోగించుకోవడం అక్కడి నుంచి మొదలుపెట్టేయొచ్చు.
ఇలా చేయండి..
1. ఏదైనా బ్యాంకు కస్టమర్‌ను ఈమెయిల్ ఐడీ వంటి వర్చువల్ అడ్రస్‌తో గుర్తించే సదుపాయాన్ని యూపీఐ యాప్ కల్పిస్తుంది. ఇందులో ఎటువంటి బ్యాంకు వివరాలు ఉండవు కాబట్టి వినియోగదారుడు భయం లేకుండా దీన్ని ఇతరులతో పంచుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటే వినియోగదారులు తొలుత నమోదు చేసుకోవాలి.
2. ఎక్కువగా వినియోగదారులు పేరు, మొబైల్ నంబరు కలిసి వచ్చేలా పెట్టుకునేందుకు అవకాశం ఉంది. అక్కడ ఏ పేరు లేదా నంబరు పెట్టాలనుకునేది మీ ఇష్టం. ఉదాహరణకు అరుణ్ @ఐసీఐసీఐ లేదా కిరణ్@యాక్సిస్ అని పెట్టుకోవచ్చు. ఐసీఐసీఐ పాకెట్ వినియోగదారులు @పాకెట్ ఫార్మెట్‌లో యూపీఐ వర్చువల్ అడ్రస్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
3. వివిధ బ్యాంకు ఖాతాలకు ప్రత్యేక వర్చువల్ అడ్రస్‌లను పెట్టుకోవచ్చు. అంతే కాకుండా వేరే బ్యాంకులకు వేర్వేరు వర్చువల్ అడ్రస్‌లను సృష్టించుకోవచ్చు.
4. చెల్లింపుల కోసం సెక్యూర్ పిన్(ఓటీపీ)ను నమోదు చేస్తే లావాదేవీ ప్రక్రియ పూర్తవుతుంది.
5. ఈ విధానంలో లావాదేవీలకు వేళలంటూ ఉండవు. సెలవుల ప్రభావం కూడా ఉండదు. ఐఎంపీఎస్ విధానంలా 24 గంటలూ, 365 రోజులూ పనిచేస్తుంది. లావాదేవీ పూర్తయిందా లేదా అనే విషయం వెంటనే తెలిసిపోతుంది.
6. ఈ-కామర్స్ వెబ్‌సైట్ల కొన్న వస్తువులకు చేసే చెల్లింపులకు ఇది ప్రయోజనకారి. క్యాష్ ఆన్ డెలివరీకి బదులుగా యూపీఐను ఉపయోగించి సత్వరమే చెల్లింపులు చేయవచ్చు.
7. బిల్లుల చెల్లింపులు, పాఠశాల ఫీజులు, అనుమతించిన షాపింగ్ మాల్స్‌లో చెల్లింపులను చేయవచ్చు.
8. ఐఎమ్‌పీఎస్ కంటే అడ్వాన్స్‌డ్ వర్షన్ చెల్లింపు వ్యవస్థగా దీన్ని చెప్పుకోవచ్చు. మొబైల్; ల‌్యాప్‌ట్యాప్,ట్యాబ్‌ల వంటి పరికరాల్లో ఇంటర్నెట్ ఉంటే 24X7 లావాదేవీలను క్షణాల్లో జరపవచ్చు. ఏటీఎమ్‌ల్లో సైతం ఈ సేవ ఉంటుంది.
9. ప్రస్తుతం చాలా బ్యాంకులు దీనికి సంబంధించిన యాప్‌లను విడుదల చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఉన్న యాప్‌ల్లోనే దీన్ని అదనపు సౌకర్యంగా అందిస్తున్నాయి. ఆంధ్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, భారతీయ మహిళా బ్యాంకు, కెనరా బ్యాంకు, క్యాథలిక్ సిరియన్ బ్యాంకు, డీసీబీ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, టీజేఎస్‌బీ సహకారీ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, కర్ణాటక బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంకు, విజయా బ్యాంకు, యెస్ బ్యాంకు వంటివనవ్నీ యూపీఐ సౌకర్యం అందుబాటులోకి తెచ్చాయి.
"
"