ఇప్పటివరకు మన దగ్గరున్న పెద్ద నోట్లన్నీ రద్దయ్యాయి. కొత్త నోట్ల కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇంతా చేస్తే వచ్చే ఆ రెండు వేలు చిన్నాచితకా ఖర్చులకే సరిపోతున్నాయి. మరి నగదు కోసం ఈ ఇబ్బందులు ఇలా కొనసాగాల్సిందేనా. అందుకు క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ చేయమని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో మీరు బ్యాంకుకు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ పద్ధతిలో మనీ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. క్షణాల్లో అవతలి వ్యక్తికి డబ్బులు చేరిపోతాయి. ఆన్‌లైన్లో మనీ ట్రాన్స్‌ఫర్ సులభమే కాదు వేగంగా, సురక్షితంగా కూడా అందుతుంది. ఇందుకు మీకు ముందుగా కావలసింది మీ బ్యాంకు ఖాతా. దానికి నెట్ బ్యాంకింగ్ సౌకర్యం.
మీరు కార్పోరేషన్ బ్యాంక్ వినియోగదారులైతే మీ కోసమే ఈ వివరాలు
ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ కోసం ఎలా అప్లయ్ చేయాలి?
కార్పోరేషన్ బ్యాంక్ పర్సనల్, కార్పొరేట్ అనే రెండు రకాల ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలందిస్తోంది.
వ్యక్తిగత అవసరాలకు పర్సనల్ సరిపోతుంది. అదే సంస్థల ఖాతాలయితే కార్పొరేట్ సేవలు తీసుకోవాలి.
* మీ అకౌంట్ ఉన్న కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచికి వెళ్లి కార్పోరేషన్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ సేవలు కావాలని అడగాలి. బ్యాంకువారు
మీకు ఒక ఫాం ఇస్తారు. ఈ ఫాంలో మీరు కావలసిన యూజర్ నేమ్ రాయాలి. ఇది వేరొకరు గుర్తించడానికి వీల్లేకుండా ఉండడం మంచిది. వారం తర్వాత బ్యాంకు వారు మీకు నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇస్తారు. టెంపరరీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అయితే ఒక్క రోజులోనే ఇస్తారు. ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీరు పాస్‌వర్డ్‌ను మార్చుకోవచ్చు.
దీనిలో యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తోపాటు ఆథరైజేషన్ పాస్‌వర్డ్ కూడా ఉంటాయి. ఆథరైజేషన్ పాస్‌వర్డ్ తోనే మీరు మనీ ట్రాన్స్‌ఫర్ లేదా బిల్లులు పే చేయడం వంటివి చేయగలరు.
యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ వచ్చాక మీరు కార్పోరేషన్ బ్యాంక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి తర్వాత పాస్‌వర్డ్ ఫీల్డ్‌లో మీ పాస్‌వర్డ్ టైప్ చేయాలి. యా క్టివేషన్ ప్రొసీజర్ పూర్తయ్యాక అక్కడ మీకు కన్ఫర్మేషన్ ఇమేజ్ కనిపిస్తుంది. మీకు టెంపరరీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ కనుక ఇచ్చినట్లయితే వెబ్‌సైట్ మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్, ఆథరైజేషన్ పాస్‌వర్డ్ అడుగుతుంది. వీటన్నింటినీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన ప్రతిసారి మీరు కన్ఫర్మేషన్ ఇమేజ్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
అకౌంట్ డిటైల్స్ ఎలా చెక్ చేసుకోవాలి?
నెట్‌బ్యాంకింగ్ ద్వారా మీరు మీ డెబిట్ కార్డు, క్రెడిట్‌కార్డు డిటైల్డ్ స్టేట్ మెంట్‌ను తెలుసుకోవచ్చు.
1. కార్పోరేట్ బ్యాంక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నెట్‌బ్యాంకింగ్ విభాగంలోకి ఎంటరవ్వాలి. మీ యూజర్ నేమ్ టైప్ చేయాలి. దానికింద ఉన్న బాక్సులో టిక్ చేసి కంటిన్యూను క్లిక్ చేయాలి.
2. పాస్‌వర్డ్, కన్ఫర్మేషన్ ఇమేజ్‌ను ఇచ్చి లాగిన్ కావాలి. ఒక వేళ పాస్ వర్డ్ మర్చిపోతే అదే పేజీలో లాగిన్ కిందే ఫర్ గాట్ పాస్ వర్డ్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ సెల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీకి మెసేజ్ వస్తుంది. దాని ద్వారా పాస్ వర్డ్ ను రీసెట్ చేసుకోవచ్చు.
3. అక్కడి నుంచి మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మీ యూజర్ నేమ్ కింద మీ అకౌంట్ తాలూకు డిటైల్స్ (అకౌంట్ నెంబర్, బ్యాలెన్స్ ఎంత ఉంది వంటివి) రన్ అవుతూ కనిపిస్తాయి.
4. దానిలో కుడివైపుకు వెళితే మినీ/ డిటల్డ్ స్టేట్‌మెంట్ అని కనిపిస్తుంది. పూర్తి వివరాలు కావాలనుకుంటే డిటైల్డ్ ను క్లిక్ చేయాలి.
5. బ్రాంచ్ పేరు, అకౌంట్ నెంబర్ ఎంపిక చేసుకోవాలి. మీకు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు (మూడు నెలల్లోపు) వివరాలు కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. మూడు నెలల కిందటి వివరాలైతే మీకు కనిపించవు. తేదీ సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ కొట్టాలి. అప్పుడు మీకు క్రెడిట్ మరియు డెబిట్ వివరాలన్నీ కనిపిస్తాయి. మీరు మొత్తం ఎంత డిపాజిట్ చేశారు, ఎంత విత్‌డ్రా చేశారో పేజీ చివరిలో కనిపిస్తుంది.
మీ అకౌంట్ స్టేట్‌మెంట్ ఎలా చూడాలో తెలుసుకున్నారు కదా.. ఇక ఇప్పుడు ఫండ్ ట్రాన్స్‌ఫర్ ( మీ ఖాతా నుంచి వేరొకరికి డబ్బులు పంపడం) ఎలా అనేది తెలుసుకోవాలి.
నెఫ్ట్ పద్ధతిలో ఫండ్ ట్రాన్స్‌ఫర్ అనేది ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది బెనిఫిషరీని యాడ్ చేసుకోవడం, యాక్టివటే్ చేయడం, ట్రాన్స్‌ఫర్ అనే స్టెప్పుల్లో జరుగుతుంది. ఒక్కో స్టెప్‌ను ఎలా చేయాలో చూడండి.
కార్పోరేట్ బ్యాంక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నెట్‌బ్యాంకింగ్ విభాగంలోకి ఎంటరవ్వాలి. మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్, కన్ఫర్మేషన్ ఇమేజ్‌ను ఇవ్వాలి.
6. మీరు ఇప్పుడు హోంపేజీకి వస్తారు. అక్కడ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ను క్లిక్ చేయాలి.
7. ఫండ్ ట్రాన్స్‌ఫర్ అనే పేజీలో నెఫ్ట్ / ఆర్టీజీఎస్ – మెయింటెనెన్స్ పేయీఅని కనిపిస్తుంది. దానికింద ఉన్న యాడ్ పేయీ ఐకాన్‌ను క్లిక్ చేయాలి.
8. మీరు డబ్బు పంపాలనుకున్న వ్యక్తి వివరాలన్నీ నమోదు చేయాలి. పూర్తిపేరు, బ్యాంకు ఖాతా నెంబర్, బ్రాంచి పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, పూర్తి అడ్రస్ వంటివన్నీ జాగ్రత్తగా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
9. ఇప్పడు మీకు అదే పేజీలో యాక్టివేట్ పేయీ ఐకాన్‌ను క్లిక్ చేయాలి. పేయీని యాడ్ చేయగానే మీ సెల్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది.
10. ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ లోకి వెళ్లి మీ పేయీని సెలెక్ట్ చేయగానే అతని బ్యాంకు ఖాతా వివరాలు, పేరు వంటివన్నీ వస్తాయి. మీరు పంపాలనుకున్న అమౌంట్ ను అందులో నమోదు చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్ అని ఉన్న బాక్సులో టిక్ చేసి పేజీ చివరన ఉన్న సబ్మిట్ కొట్టాలి.
11. తర్వాత పేజీలో మీరు పే చేయబోతున్న వివరాలన్నీ కనిపిస్తాయి. ఓకే అనుకుంటే ఆథరైజేషన్ పాస్‌వర్డ్ కొట్టి కన్ ఫర్మ్ చేయాలి.
12. అప్పుడు మీ సెల్ నెంబర్ కు వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) నెంబర్ వస్తుంది. తర్వాత స్టెప్ లో ఆథరైజేషన్ పాస్‌వర్డ్ , ఓటీపీ నమోదు చేసి సబ్మిట్ కొడితే మీ ఫండ్ ట్రాన్స్‌ఫర్ పూర్తవుతుంది. వెంటనే మీకు తెరపై కూడా మెసేజ్ వస్తుంది. మీ సెల్ కు కూడా మెసేజ్ వస్తుంది.
ఈ జాగ్రత్తలు పాటించండి
* మీరు కార్పోరేషన్ బ్యాంక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నెట్‌బ్యాంకింగ్ చేయాలనుకుంటే మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ రహస్యంగా ఉంచాలి.
* ఆఫీసు లేదా ఇంటర్నెట్ సెంటర్లలో సాధ్యమైనంత వరకు వీటిని ఉపయోగించి ట్రాన్సాక్షన్ చేయకుండా ఉండడమే మంచిది. వీలుకాని పక్షంలో నేరుగా టైప్ చేయకుండా వర్చువల్ కీ బోర్డును వాడుకోవడం సురక్షితం.
* మీ ఓటీపీ నెంబర్‌ను కూడా ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే సాధారణంగా ఓటీపీ 15 నిముషాల వరకు పనికివస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత దాన్ని వాడుకోలేకపోతే ఈలోగా మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఎవరైనా తెలుసుకుంటే ఈ ఓటీపీని ఉపయోగించి మీ అకౌంట్‌ను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది.
* ఫండ్ ట్రాన్స్‌ఫర్, పేయీని యాడ్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు వివరాలన్నీ చెక్ చేసుకున్నాకే ట్రాన్సాక్షన్ చేసుకోవడం మంచిది.
* మీ సెల్‌నెంబర్ లేదా మెయిల్ ఐడీని మార్చితే వెంటనే బ్యాంకు అకౌంట్‌లో కూడా అప్‌డేట్ చేసుకోవాలి.