• తాజా వార్తలు

ఈ-కామర్స్ లో ఇక 100 శాతం ఎఫ్ డీఐలు...

-కామర్స్‌తోపాటు ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లోకి ఎఫ్‌డీఐల అనుమతికి సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేయబోతోంది. రిటైల్ ఈ-కామర్స్ వ్యాపారంలో మార్కెట్ ప్లేస్ ప్లాట్‌ఫాం మోడల్‌లోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించాలని కేంద్రం భావిస్తున్నట్లుగా సమాచారం. ఇటీవల డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్(డీఐపీపీ), కార్పొరేట్ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలతోపాటు ఇతర విభాగాల ఉన్నతాధికారులు ఈ రంగాల్లోకి ఎఫ్‌డీఐలను అనుమతించే విషయంపై చర్చలు జరిపారు. మార్కెట్ ప్లేస్ ఈ-కామర్స్ మోడల్‌లోకి వంద శాతం ఎఫ్‌డీఐలకు ఎంట్రీ ఇవ్వాలని సమావేశంలో డీఐపీపీ సూచించినట్లుగా సమాచారం. మార్కెట్ ప్లేస్ మోడల్‌లో ఈ-కామర్స్ కంపెనీలు విక్రయదారులకు, కొనుగోలుదారులకు ట్రేడింగ్ ప్లాట్‌ఫాంగా మాత్రమే వ్యవహరిస్తాయి. ప్రస్తుతం దేశీయ ఈ-కామర్స్ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న అమెజాన్,ఈబే వంటి అంతర్జాతీయ పోర్టళ్లు ఈ విభాగానికి చెందినవే.

ప్రస్తుతానికి ఈ-కామర్స్ రిటైల్ వ్యాపార మోడళ్లకు సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలేవీ లేనందున దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లో ఇప్పటికే పలు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. దేశీయ ఈ-కామర్స్ రిటైల్ విభాగంలో రెండు మోడళ్లలో సంస్థలు వ్యాపారం సాగిస్తున్నాయి. ఒకటి మార్కెట్ ప్లేస్ మోడల్ కాగా.. రెండోది వస్తువులను గిడ్డంగుల్లో నిల్వ చేసుకొని విక్రయించే మోడల్. అంటే ఈ-కామర్స్ సంస్థలే తమ తరఫున వేర్ హౌస్ లను నిర్వహిస్తూ అక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు ప్రొడక్ట్ డెలివరీ ఇస్తాయి. ఇంకో విధానంలో కేవలం విక్రేతకు, కొనుగోలుదారులకు మధ్య సంధానకర్తగా మాత్రమే ఉంటాయి. ఈ-కామర్స్ బిజినెస్ టు బిజినెస్(బీ2బీ) మోడల్‌లోకి ఇప్పటికే 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించారు.

ఈ-కామర్స్ రంగంలోకి పూర్తిస్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తే మరింత వృద్ధి నమోదు  కావడం ఖాయం. ఇండియాకు చెందిన స్టార్లప్ లలోనూ విదేశీ సంస్థలు పెట్టుబడులకు సిద్ధంగా ఉండడం... దిగ్గజ సంస్థలతో కలిసి వ్యాపారాలు చేయాలని అనుకోవడంతో విదేశీ పెట్టుబడులకు పూర్తిగా తెరతీస్తే వ్యాపారం, సంపద వృద్ధి చెందుతాయని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు.

 

జన రంజకమైన వార్తలు