• తాజా వార్తలు

2020 నాటిక‌ల్లా ఇ-కామ‌ర్స్ ఆదాయం 120 బిలియ‌న్ డాల‌ర్లు

భార‌త్‌లో ఇ-కామ‌ర్స్ శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతోంది.  ఆన్‌లైన్ వ్యాపారం కోట్ల‌లో జ‌రుగుతోంది. ఆన్‌లైన్ స్టోర్ల మ‌ధ్య విప‌రీత‌మైన పోటీ ఉంది. వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డానికి ఈ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్ విప‌రీతంగా ఆఫ‌ర్లు గుప్పిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త్‌లో ఇ-కామ‌ర్స్ ఆదాయం గ‌ణ‌నీయంగా పెరుగుతోంద‌ట‌.  ఆన్‌లైన్ స్టోర్లు ఇబ్బుడిముబ్బుడిగా పెర‌గ‌డంతో 2020 నాటిక‌ల్లా భార‌త్‌లో  ఇ-కామ‌ర్స్ ఆదాయం 120 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకునే అవ‌కాశం ఉంద‌ని అసోసియేటెడ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచాం) అధ్యాయ‌నంలో తేలింది.  ఈ ఏడాది ఆఖ‌రికి భార‌త్‌లో ఇ-కామ‌ర్స్ ఆదాయం 30 బిలియ‌న్‌లుగా ఉంటుంద‌ని.. ఇది ఏడాది ఏడాదికి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అసోచాం పేర్కొంది. 

భార‌త్‌లో యువత ఎక్కువ‌గా ఇ-కామ‌ర్స్‌పై దృష్టి సారించ‌డంతో ఈ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని.. ఈ సెక్టార్‌లో మ‌రింత అభివృద్ధి ఖాయ‌మ‌ని స‌ర్వేలో తేలింది. ఐతే సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల‌తో పోలిస్తే భార‌త్‌లో ఇ-కామ‌ర్స్ ఎంతో ఎన్నో రెట్లు మెరుగుప‌డాల్సి ఉన్నా వ్యాపార విష‌యంలో మాత్రం మ‌న దేశానిదే పైచేయిగా ఉంది. అందుకే జ‌పాన్, చైనా లాంటి ఇ-కామ‌ర్స్ దిగ్గ‌జ దేశాల‌తో పోలిస్తే భార‌త ఆదాయం వేగంగా పెరుగుతోంద‌ట‌. భార‌త్‌లో ఇ-కామ‌ర్స్ వృద్ధి శాతం 51 ఉంటే.. చైనాలో 18 శాతం, జ‌పాన్‌లో 11 శాతం, ద‌క్షిణ కొరియాలో 10 శాతం ఉంది. భార‌త్‌లో ఇంట‌ర్నెట్ వాడ‌కం విప‌రీతంగా పెర‌గ‌డం కూడా ఇ-కామ‌ర్స్ విప్ల‌వానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ట‌.  2016 లెక్క‌ల ప్ర‌కారం భార‌త్‌లో ఇంట‌ర్నెట్ వాడ‌కందారులు 400 మిలియ‌న్ల మంది ఉన్నార‌ట‌. భార‌త్ త‌ర్వాత అత్య‌ధికంగా బ్రెజిల్‌లో 210 మిలియ‌న్ల మంది ఇంట‌ర్నెట్ వినియోగ‌దారులు ఉన్నారు.  ర‌ష్యాలో ఈ సంఖ్య 130 మిలియ‌న్లుగా ఉంది. 

భార‌త్‌లో ఇంట‌ర్నెట్‌ను వాడుతున్న వాళ్ల‌లో 15 నుంచి 34 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్కులే ఉన్నారు. ఈ ఏజ్  గ్రూప్‌లో ఎక్కువ‌మంది ఇంట‌ర్నెట్ వాడుతున్న తొలి దేశం భార‌త్ మాత్రమే.  ముఖ్యంగా ఇంట‌ర్నెట్ వాడుతున్న ప్ర‌తి ఐదుగురిలో ఒక‌రు భార‌త రైల్వే శాఖ సైట్‌ను చూస్తున్నార‌ట‌. అంతేకాక 60 నుంచి 65 శాతం ఇ-కామ‌ర్స్ అమ్మ‌కాలు స్మార్టుఫోన్ల ద్వారానే జ‌రుగుతున్నాయ‌ని ఈ స‌ర్వేలో తేలింది.  బ్రాండెడ్ దుస్తులు, ఎక్స‌స‌రీస్‌, జ్యుయిల‌రీ, గిఫ్ట్స్‌, ఫుట్‌వేర్‌ల‌ను వినియోగ‌దారులు అధిక సంఖ్య‌లో కొనుగోలు చేస్తున్నార‌ట‌.

 

జన రంజకమైన వార్తలు