అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఆన్‌లైన్ అమ్మకాల్లో భారతీయుల నమ్మకాన్ని చూరగొన్న వెబ్‌సైట్లు. డిస్కౌంట్లు,ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ లతో మొబైల్ ఫోన్ స్టోర్ల యజమానులకు చెమటలు పట్టించేలా భారీ స్థాయిలో ఆన్‌లైన్‌లో వ్యాపారం చేస్తున్న ఈ దిగ్గజ కంపెనీలు ఇప్పుడు ఆఫ్‌లైన్ (బయట స్టోర్స్ ద్వారా)లోనూ అమ్మకాలకు సిద్ధమయ్యాయి. దీంతో రిటైల్ మార్కెట్‌లో ఎలాంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
జులై 1నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీని అమల్లోకి తేవాలని ప్రయత్నిస్తోంది. జీఎస్టీ వస్తే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ల్లో ధరల్లో పెద్ద తేడా ఉండదు. ఇలాంటప్పుడు కస్టమర్లు ఆఫ్‌లైన్ మార్కెట్‌వైపే వెళతారు. ఇండియా లాంటి పెద్ద జనాభా కలిగిన దేశాన్ని, పర్చేజింగ్ కెపాసిటీ పెరుగుతున్న మధ్య తరగతి ఉన్న దేశాన్ని వదులుకోవడానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లు సిద్ధంగా లేవు. అదీకాక ప్రత్యేకంగా ఇండియాలో విక్రయించడానికి కొన్ని మోడళ్లను కంపెనీలకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్లు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో విక్రయాలు తగ్గితే నష్టపోతాం కాబట్టి ఆఫ్‌లైన్లో అయినా అమ్ముకోవడానికి రడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
అమెజాన్ బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో సెల్‌ఫోన్లు అమ్మడానికి రంగం సిద్ధం చేసింది. కూల్ ప్యాడ్, మోటోరోలా, లెనోవా, హువావే, వన్ ప్లస్ కంపెనీల సెల్‌ఫోన్లను అమెజాన్ తమ ఆఫ్‌లైన్ స్టోర్‌లో అమ్మకానికి పెట్టబోతోంది. కొరియన్ సెల్‌ఫోన్ దిగ్గజం శ్యామ్‌సంగ్‌తోపాటు చైనీస్ కంపెనీ రెడ్‌మీతోనూ చర్చలు జరుపుతోంది. డీమానిటైజేషన్ నేపథ్యంలో నిలిచిపోయిన స్టాక్‌ను క్లియర్ చేసుకోవడానికి స్మార్ట్‌ఫోన్లను ఆఫ్‌లైన్‌లో డిస్ట్రిబ్యూట్ చేసిన అమెజాన్ ఈసారి దాన్ని వ్యవస్థీకృతం చేయడానికి రంగం సిద్ధం చేసింది. అమెజాన్. కామ్ కు ఇండియాలో క్యాష్ అండ్ క్యారీ వ్యవహారాలు నిర్వహించే అమెజాన్ హోల్‌సేల్ ఇండియా దీన్నిపర్యవేక్షించబోతోంది. ఇక డిస్ట్రిబ్యూటర్లను అపాయింట్ చేయడాన్నిఅమెజాన్ సొంతంగా చేపట్టబోతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, హర్యాణా, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో డిస్ట్రిబ్యూటర్లను నియమించింది.
ఫ్లిప్‌కార్ట్ మాటేమిటి?
ఫ్లిప్‌కార్ట్ కూడా ఆఫ్‌లైన్‌లో అమ్మకాలకు సిద్ధమవుతోంది. అయితే ప్లాన్‌లు ఇంకా పూర్తికాలేదు. అయితే సెల్‌ఫోన్లు ఆన్ లైన్ డిస్ట్రిబ్యూషన్‌తోపాటు సేల్స్ కూడా చేస్తామని కంపెనీలకు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే సిగ్నల్స్ ఇచ్చింది. స్మార్ట్‌ఫోన్లపై ఆన్‌లైన్‌లో 5 శాతం నుంచి వ్యాట్ పడుతోంది. బెంగళూరు, హైదరాబాద్ వంటి మార్కెట్లలో మొబైల్ స్టోర్స్‌లోనూ వ్యాట్ ఇదే స్థాయిలో ఉంటుంది. అదే దేశవ్యాప్తంగా చూస్తే 10 నుంచి 12 శాతం వరకు వ్యాట్ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి మార్కెట్లలో తక్కువ వ్యాట్‌కు విక్రయించగలిగితే ఆఫ్‌లైన్ స్టోర్లకు కూడా మంచి డిమాండ్ గ్యారంటీ. ఆఫ్‌లైన్ మార్కెట్లోకి రావడానికి ఆసక్తి ఉన్నా పెద్దగా లాభాలుండవని వెనకడుగు వేస్తున్న కొన్ని కంపెనీలు ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతో ఆన్‌లైన్‌లో రిలేషన్ ఉండడంతో ఇప్పుడు వాటి ద్వారానే మార్కెట్లలోకి అడుగుపెట్టడానికి దీన్ని మంచి అవకాశంగా భావిస్తున్నాయి.