రాజకీయ నాయకులు, ప్రత్యర్థి జట్ల క్రీడాకారులు తరచూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం... ఒక్కోసారి తీవ్రస్థాయి కామెంట్లు చేసుకోవడం తెలిసిందే. వ్యాపార వర్గాల్లో ఎంత పోటీ ఉన్నా ఇలాంటివి బహిర్గతం కావు. కానీ.. ఈ కామర్సు వ్యాపారం భారీ ఎత్తున సాగుతున్న దశలో రెండు ప్రధాన సంస్థలు ఫ్లిప్ కార్టు, స్నాప్ డీల్ లు కత్తులు దూసుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాలే వేదికలుగా ఏకంగా ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. సాక్షాత్తు సంస్థల సీఈఓలే మాటలు విసురుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సామాజిక వెబ్‌సైట్ ట్విటర్ వేదికగా ఆన్‌లైన్ దిగ్గజ సంస్థలు స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్టు సీఈవోలు వాగ్వివాదానికి దిగారు. చైనా ఆన్‌లైన్ దిగ్గజ సంస్థ అలీబాబా నేరుగా త్వరలో భారత్‌లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఫ్లిప్‌కార్టు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సంజయ్ బన్సాల్ స్పందించారు. ‘అలీబాబా భారత్‌లోకి నేరుగా అడుగుపెడుతోందంటే.. ఇక్కడ ఆ సంస్థ పెట్టుబడులు పెట్టిన సంస్థలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో అర్థమవుతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు. అలీబాబాకు స్నాప్‌డీల్‌లో దాదాపు 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి స్నాప్‌డీల్ సీఈవో కునాల్ బాల్ ఘాటుగా స్పందించారు. 5 బిలియన్ డాలర్ల ఫ్లిప్‌కార్టు మార్కెట్ క్యాపిటెల్‌ను మోర్గాన్ స్టాన్లీ ముంచేయలేదా..? అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, కామెంట్ చేయడం మాని.. ఎవరి విషయాలు వారు చూసుకోవాలంటూ ట్విట్టర్ ద్వారా చురక అంటించారు. ఇలా ఆన్ లైన్ వ్యాపారులు ఒకరినొకరు తిట్టుకుంటుండడంతో జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఎంత సీఈఓలైనా తిట్టుకోవడానికి వస్తే సాధారణ జనంలాగే మారిపోతారని నవ్వుకుంటున్నారు. ఈ-కామర్సు యుద్ధాలు పీక్ స్టేజికి చేరాయనడానకి ఇదే నిదర్శనమంటున్నారు. |