ప్రస్తుతం ట్రెండ్ మొత్తం ఆన్‌లైన్ మీదే నడుస్తోంది. ఈ కంపెనీ అయినా ఆన్‌లైన్‌లోనే తమ కార్యకలాపాలు సాగించాలని కోరుకుంటోంది. దీనికి తగ్గట్టే ఆన్‌లైన్ సంస్థలు ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను మారుస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అలాంటి సంస్థల్లో ముందు వరుసలో ఉండేది ఫ్లిప్‌కార్ట్. భారత్‌లో ఎక్కువ యూజర్ బేస్ ఉన్న ఈ ఆన్‌లైన్ స్టోర్ తమ యూజర్లను మరింత ఆకట్టుకోవడానికి గేమింగ్ మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌లలో ఆన్‌లైన్ గేమింగ్ ఒకటి. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ గేమింగ్ ఛాంపియన్‌షిప్‌ను మొదలుపెట్టింది. నెలరోజుల పాటు సాగే ఆన్‌లైన్ గేమింగ్ టోర్నమెంట్‌ను ప్రారంభించబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ సంస్థ ప్రకటించింది. ఈ ఆన్‌లైన్ గేమింగ్ టోర్నమెంట్ ద్వారా ప్రధానంగా ఫుట్‌బాల్‌పై ఈ ఆన్‌లైన్ స్టోర్ దృష్టి సారించింది. దీనిలో భాగంగానే ఫిఫా, కౌంటర్ స్ర్టక్, గ్లోబల్ అఫెన్సివ్, లీగ్ ఆఫ్ లెజెండ్స్, డోటా-2 లాంటి వాటిని ఈ టోర్నమెంట్లో భాగం చేసింది ఫ్లిప్‌కార్ట్. జూన్ 3 నుంచి జులై 11 వరకు ఈ గేమింగ్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇంటర్నెట్ ఎకానమీకి గేమింగ్ ఎంతగా దోహదపడుతుందో గమనించాకే తాము ఈ విభాగాన్ని ప్రారంభించినట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. గేమింగ్ బ్రాండ్‌లతో పాటు గేమర్స్‌కు కూడా తమ ఆన్‌లైన్ స్టోర్ వేదికగా నిలవాలని ఆశిస్తున్నట్లు ఈ సంస్థ తెలిపింది. మరో ఆరు నెలల్లో గేమింగ్‌లో మరింత ప్రగతి సాధిస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్రతివారం ఒక గేమ్‌ను ఆడతారు. ఈ టోర్నీలో మూడు జట్లు ఉంటాయి. ప్రతి జట్టులో ఐదేసి ఆటగాళ్లు ఉంటారు. వ్యక్తిగత గేమర్స్‌కు ఒక్కో గేమ్‌ను కేటాయించారు. ఈ ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమింగ్ మరియు స్ట్రీమింగ్ వీడియో ఫ్లాట్‌ఫాం ద్వారా చూడొచ్చని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఫిఫా-16 గేమ్‌తో టోర్నమెంట్ ప్రారంభం కానుంది. విజేతకు రూ.20,000 ప్రైజ్‌మనీగా లభిస్తాయి. రన్నరప్‌కు రూ.15,000, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.10,000 ప్రైజ్‌మనీ దక్కుతుంది. ఆసక్తిగల వారు తమ ఫేస్‌బుక్ గేమింగ్ పేజీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. |