మొబైల్ వ్యాలెట్లకు పోటీగా గూగుల్ కంపెనీ ప్రవేశపెట్టిన గూగుల్ పే.. ఇండియన్ ఎకానమీలోనే ఓ సంచలనం. కేవలం బ్యాంక్ అకౌంట్‌తో కనెక్ట్ అయి ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఉంటే చాలు ఎలాంటి చికాకులు లేకుండా నేరుగా క్షణాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోగలడం గూగుల్ పేతోనే ప్రారంభమైంది. అయితే గూగుల్ పేని ఉపయోగించుకుని మోసాలు చేసేవాళ్లు ఇటీవల బాగా పెరిగిపోయారు. గూగుల్ పేలో ఉన్న పెద్ద ప్రమాదం ఏంటంటే అది నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌కు కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఏ మాత్రం అవకాశం చిక్కినా సైబర్ క్రిమినల్స్ మీ అకౌంట్ ఖాళీ చేయడం పక్కా. అందుకే గూగుల్ తన వినియోగదారులను అప్రమత్తం చేస్తూ ఫ్రాడ్ అలర్ట్ ఇచ్చింది. ఈ సూచనలు ఫాలో అయి మీ అకౌంట్లోని సొమ్మును జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించింది.
ఇవిగో గూగుల్ చెప్పిన జాగ్రత్తలు
* గూగుల్ పే యూజర్లకు గూగుల్ ఇప్పుడు రెండంచెల రక్షణ కల్పించింది. దీని ప్రకారం పేమెంట్ యాప్ ఓపెన్ చేయడానికి ఒక పిన్, పేమెంట్స్ చేయడానికి యూపీఐ పిన్ రెండూ ఉండాలి.
* యూపీఐ పిన్ నెంబర్‌ను రహస్యంగా ఉంచుకోండి. ఏటీఎం పిన్ నెంబర్ ఎలాగైతే ఎవరికీ చెప్పరో అలాగే దీన్ని కూడా దాచుకోండి అని గూగుల్ తన ప్రకటనల్లో కోరుతోంది.
* గూగుల్ పే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఫలానా లింక్ క్లిక్ చేయండి వంటి మెసేజ్‌లను పట్టించుకోకండి. మీకు యాప్ కావాలంటే ప్లే స్టోర్‌లోకి వెళ్లి గూగుల్ పే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఉత్తమం.
* ఏదైనా అనుమానం వస్తే వెంటనే కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి.
కాల్ వస్తే కట్ చేయండి
* గూగుల్ పేకి సంబంధించి ఏదైనా తెలియని నంబర్ల నుంచి కాల్ వస్తే వెంటనే జాగ్రత్త పడండి.
* కాల్ చేసిన వ్యక్తుల మీ బ్యాంకు, ఇన్సూరెన్స్, గూగుల్ పే ఇలా ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పినా వాళ్లను గుర్తు పట్టకపోతే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి.
* మీ పర్సనల్ డేటా, పిన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, పాన్ నెంబర్ ఇలాంటివి ఏవి అడిగినా నో చెప్పేసి వెంటనే కాల్ కట్ చేసేయండి.
* అవతలి వాళ్లు మీకు ఎంత కన్విన్సింగ్ చెప్పినా ఈ డిటెయిల్స్ ఏవీ ఇవ్వద్దు
కాల్‌లో ఉండగా ఇవేవీ చెయ్యొద్దు
* మేం లైన్లో ఉంటాం. మీకు వచ్చిన ఎస్ఎంఎస్ లేదా మెయిల్‌లో ఓ లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేయమని అడిగితే స్పందించకండి
* ఎలాంటి యాప్ లేదా ఫైల్ ఇన్‌స్టాల్ లేదా డౌన్‌లోడ్ చేయకండి.
* మీ ల్యాప్‌టాప్ లేదా ఫోన్ స్క్రీన్‌ను షేర్ చేయమని అడిగితే షేర్ చేయకండి
* యూపీఐ ఐడీ, పిన్, మీ గవర్నమెంట్ ఐడీ కార్డ్ నెంబర్, బ్యాంక్ డిటెయిల్స్ వంటివేవీ ఫోన్‌లో అడిగితే చెప్పొద్దు
* ఆన్‌లైన్ ఫారాలను ఫిల్ చేయమని అడిగితా నో చెప్పండి. నేరగాళ్లు ఫేక్ వెబ్ పేజీలు క్రియేట్ చేసి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. అచ్చంగా ఒరిజినల్‌లాగే ఉండే నకిలీ వెబ్‌సైట్ లేదా యాప్ క్రియేట్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు.
ఇవి బాగా గుర్తు పెట్టుకోండి
* గూగుల్ పేలో డబ్బులు సెండ్ చేయడానికి మాత్రమే యూపీఐ పిన్ అవసరం. రిసీవ్ చేయడానికి అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా మీకు డబ్బులు పంపడానికి యూపీఐ పిన్ అడిగితే అది కచ్చితంగా మోసం అనే గుర్తించండి
* ఎవరైనా తెలియని వ్యక్తులు మిమ్మల్ని ఫోన్‌లో తొందరపెట్టి రీఛార్జి, బిల్ పేమెంట్ లేదా ఎవరికైనా డబ్బులు పంపడం వంటి వాటి గురించి చెబితే అస్సలు పట్టించుకోకండి.
* గూగుల్ పే వాడేటప్పుడు స్పష్టమైన మైండ్‌తో ఒకటికి రెండుసార్లు నెంబర్ చెక్ చేసుకుని ట్రాన్సాక్షన్ చేయండి
అని గూగుల్ చెబుతోంది.