పర్సు మర్చిపోయేవారికి... పర్సు పోగొట్టుకునేవారికి... ఒక్కోసారికి జేబులో ఉన్న డబ్బు కంటే ఎక్కువగా షాపింగ్ చేసేవారికి గూగుల్ సంస్థ కొత్త వరం ప్రకటించింది. జేబులో పైసా లేకపోయినా పేమెంట్ చేసేసేలా కొత్త అవకాశాన్ని తీసుకొచ్చింది. డబ్బులు లేకపోయిన గూగుల్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు.. గూగుల్ సంస్థ రీసెంటుగా రెడీ చేస్తున్న 'హ్యాండ్స్ ఫ్రీ పేమెంట్" యాప్ సహాయంతో ఇది సాధ్యమవుతుంది. అప్పుడప్పుడు షాప్ లో వస్తువును కొన్న తరువాత జేబులో డబ్బులు లేవని గుర్తిస్తాం.. కార్డులు కూడా లేవు... అలాంటి సందర్భాలను గమనించి గూగుల్ సంస్థ ఈ యాప్‌ను రూపొందించింది. ప్రస్తుతం అమరికాలోని శాన్‌ఫ్రానిస్కోలో దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ ఉంటే బ్లూటూత్, వైఫై, జిపిఎస్ ద్వారా మీకు దగ్గర్లోని 'హ్యాండ్స్ ఫ్రీ పేమెంట్" యాప్‌తో యాక్సెస్ ఉన్న స్టోర్ల లిస్టు కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి కొనుగోలు చేసిన తర్వాత గూగుల్ ద్వారా చెల్లిస్తామని చెప్తే చాలు.. వెంటనే అక్కడ కంప్యూటర్ సిస్టమ్‌కు అనుసంధానమైన కెమెరాతో మీ ఫోటో తీసి హ్యాండ్స్ ఫ్రీ ప్రొఫైల్ పిక్‌తో ఐడెంటిటీ సరిపోయిందో లేదో చూస్తారు. డబ్బులు స్టోర్ ఖాతాలోకి చేరగానే మీకు సందేశం వస్తుంది ఐడెంటిటీ కోసం తీసుకున్న ఫోటో వెంటనే డిలీట్ అవడంతో భద్రతకు ఢోకా ఉండదు. ఈ ప్రక్రియలో మీరు అస్సలు ఫోన్ టచ్ చేసే పని కూడా ఉండదు. శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని మెక్ డొనాల్డ్, పాపా జాన్స్ తదితర స్టోర్స్‌లో ఈ పైలట్ యాప్‌ను పరీక్షిస్తున్నారు. హ్యాండ్స్‌ఫ్రీ ద్వారా చేసే తొలి కొనుగోలుపై 5 డాలర్ల డిస్కౌంట్ కూడా ఇస్తుండటం విశేషం. యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే మాత్రం కాస్త సమయం పడుతుందట. అయితే... ఇక్కడో సందేహం రావొచ్చు. చెల్లిస్తామని చెప్పి చెల్లించకపోతేనో అని. క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టకపోతే బ్యాంకులు ఊరుకుంటున్నాయా? ఇది కూడా అలాగే. అన్ని వివరాలు తీసకుని, అన్నీ చెక్ చేసుకునే ఈ యాప్ లో అరువు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు మరి. |