కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా దాదాపు 19 వస్తువులపై కస్టమ్స్ సుంకం పెంచింది. ఆ వస్తువుల జాబితాలో విమాన ఇంధనం, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు కూడా ఉన్నాయి. నిత్యావసరేతర వస్తువుల దిగుమతిని అరికట్టే ఉద్దేశంతో బుధవారం అర్ధరాత్రినుంచే అమలులోకి వచ్చేలా కస్టమ్స్ సుంకాలను ప్రభుత్వం పెంచేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి వస్తువుల మొత్తం దిగుమతుల విలువ రూ.86,000 కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ఆర్థికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు సుంకాలు పెంచిన వస్తువుల జాబితాలో వాషింగ్ మెషీన్లు, స్పీకర్లు, రేడియల్ కార్ టైర్లు, ఆభరణాలు, కిచెన్-టేబుల్ వేర్, కొన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులు, సూట్‌కేసులు కూడా ఉన్నాయి. ‘‘ప్రాథమిక కస్టమ్స్ సుంకాల పెంపుద్వారా కేంద్ర ప్రభుత్వం పన్నుల సవరణ చర్యలు చేపట్టింది. కొన్ని వస్తువుల దిగుమతిని నియంత్రించడమే ఈ చర్యల లక్ష్యం. వర్తమాన ఖాతా లోటు (CAD)ను తగ్గించేందుకే ఈ మార్పులు చేయాల్సి వచ్చింది. తదనుగుణంగా మొత్తం 19 వస్తువులపై కస్టమ్స్ సుంకాలను పెంచాం’’ అని ఆర్థికశాఖ వివరించింది.
పెరుగుదల ఎంతెంత... ఎప్పటినుంచి?
ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు (10 కిలోల లోపు సామర్థ్యంగలవి)పై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేస్తూ ప్రభుత్వం 20 శాతానికి పెంచింది. ప్రాథమిక కస్టమ్స్ సుంకంలో ఈ పెంపుదల సెప్టెంబర్ 26-27 అర్ధరాత్రినుంచే అమలులోకి వచ్చింది. విస్తరిస్తున్న వర్తమాన ఖాతా లోటును, దేశంనుంచి వెలుపలకు పెట్టుబడుల ప్రవాహాన్ని అదుపు చేయడం కోసం ప్రభుత్వం ప్రకటించిన ఐదు దశల చర్యలలో నిత్యావసరేతర వస్తువుల దిగుమతి నియంత్రణ కూడా ఒక భాగం. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో విదేశీ మారక ద్రవ్యం రాక-పోకల మధ్య వ్యత్యాసం (వర్తమాన ఖాతా లోటు-CAD) స్థూల దేశీయోత్పత్తి (GDP)లో 2.4 శాతానికి విస్తరించడం ఈ సందర్భంగా గమనార్హం.