దేశ జనాభాకు బ్యాంకింగ్, ఆర్థిక సేవలు మరింతగా అందుబాటులోకి వచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ‘‘ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్’’ (IPPB)ను ప్రారంభించింది. ఇది తపాలా సేవల శాఖకు అనుబంధ సంస్‌గా పనిచేస్తుంది తప్ప పూర్తిస్థాయి బ్యాంకు కాదు. అయితే- సేవింగ్స్ ఖాతా, కరెంట్ ఖాతా, నగదు బదిలీ వంటి ఇతర బ్యాంకులు అందించే ప్రాథమిక సేవలన్నిటినీ ప్రజలకు అందిస్తుంది. కానీ, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా, పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు పూర్తిగా భిన్నం. ఈ రెండు ఖాతాల పేర్లు ఒకేవిధంగా ఉన్నందువల్ల ప్రజలు తికమకపడే ప్రమాదం ఉంది. అందుకే వీటిమధ్య ముఖ్యమైన తేడాలేమిటో తెలుసుకుందాం:-
రిజర్వు బ్యాంకు ఆదేశాల ప్రకారం IPPB ప్రజలకు కేవలం సాధారణ సేవింగ్స్ ఖాతా తెరిచే సదుపాయం కల్పిస్తుంది. దేశంలోని లక్షన్నర తపాలా కార్యాలయాల అనుసంధానమే IPPB ఏర్పాటులోని ఆంతర్యం. ఇలా ఖాతా తెరవడంతోపాటు ప్రజలు ఈ బ్యాంకుద్వారా బిల్లులు చెల్లించుకోవచ్చు... డబ్బు పంపించుకోవచ్చు. భవిష్యత్తులో పెన్షన్ పథకాలు, మ్యూచ్యువల్ ఫండ్స్, బీమా పథకాలవంటి ఇతర ఆర్థిక సేవలను కూడా IPPB అందించనుంది.
పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీ
ఈ కొత్త ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ భారత తపాలా సేవల విభాగం కింద పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలోనే నడుస్తుంది. దేశవ్యాప్తంగా 650 IPPB శాఖలను, వీటికి అదనంగా బ్యాంకింగ్ సేవలందించే 3,250 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రజలు ఈ బ్యాంకులో మూడు రకాల ఖాతాలను తెరవవచ్చు. వీటిలో ఒకటి ఇతర బ్యాంకుల తరహాలోనే మన నగదు నిల్వపై ఏడాదికి 4 శాతం వంతున వడ్డీ ఇచ్చే సేవింగ్స్ బ్యాంక్ ఖాతా. అయితే, ఈ ఖాతాల నుంచి నగదు తీసుకునేందుకు IPPB ఎలాంటి ATM కార్డులూ ఇవ్వదు. దీనికిబదులుగా డబ్బు బదిలీకి QR కార్డును జారీచేస్తుంది. దీనికింద QR కోడ్‌ను తనిఖీ చేసుకున్న అనంతరం పోస్ట్‌మ్యాన్ నగదును ఇంటికే తెచ్చి ఇస్తాడు. ఇలాంటి ప్రతి నగదు లావాదేవీకి రూ.25 వంతున సేవా రుసుము వసూలు చేస్తారు.
ఖాతాలో కనీస నిల్వ నిబంధన లేదు
వాణిజ్య బ్యాంకుల తరహాలో IPPB సేవింగ్స్ ఖాతాకు కనీస నగదు నిల్వ నిబంధనేదీ లేదు. అంటే- పైసా కూడా జమ చేయకుండానే IPPBలో ఖాతా తెరుచుకోవచ్చు. అయితే, గరిష్ఠంగా మాత్రం రూ.లక్షకు మించి ఈ ఖాతాలో ఉంచే వీల్లేదు. ఒకవేళ డిపాజిట్ సొమ్ము రూ.లక్షకు మించితే ఖాతాదారులు ఆ మొత్తాన్ని పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే IPPB ఖాతాలకు చెక్‌బుక్ ఉండదు. వినియోగదారులు తమ లావాదేవీలకు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదుగానీ, డిజిటల్ చెల్లింపులు... ఇంటికి నగదు బట్వాడా చేసినప్పుడు మాత్రం రూ.15, రూ.25 వంతున సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాగా, IPPB సేవింగ్స్ ఖాతాతో పోలిస్తే పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వ పరిమితి రూ.20గానూ, చెక్‌బుక్ పొందాలంటే రూ.500గానూ ఉంటుంది. ఈ ఖాతాలోని నగదుపైన కూడా IPPB తరహాలో 4 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తారు.