భారత రైల్వేశాఖ ఎట్టకేలకు మంచి నిర్ణయం తీసుకుని, వివాదాస్పద డైనమిక్ ప్రైసింగ్ లేదా ఫ్లెక్సీ-ఫేర్ విధానానికి స్వస్తి చెప్పనుంది. రైల్వేలను లాభాల బాటపట్టించే లక్ష్యంతో 2016లో ప్రవేశపెట్టిన ఈ పద్ధతిని 140 ప్రీమియం రైళ్లకు అమలు చేశారు. ఈ విధానంలో డిమాండ్‌నుబట్టి టికెట్ ధర పెరుగుతుంది. ఆ మేరకు 44 రాజధాని, 46 శతాబ్ది, 52 దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని 10 శాతం బెర్తులు నిండినప్పుడల్లా టికెట్ ధర 10 శాతం వంతున పెరిగేదన్న మాట! దీనిపై ప్రయాణికుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో 40కిపైగా రైళ్లలో ఈ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. తదనుగుణంగా మొత్తం సీట్లలో 50 శాతం మాత్రమే నిండుతున్న రైళ్లలో ఈ పద్ధతి రద్దవుతుంది. మొట్టమొదట చైన్నై-మైసూర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా డైనమిక్ ప్రైసింగ్‌ను అధికారులు రద్దు చేశారు. ఆ తర్వాత ఈ రైల్లో టికెట్ల బుకింగ్ గణనీయంగా పెరిగింది. సదరు ‘‘అనుభవంతో తత్త్వం బోధపడి’’ రైల్వేశాఖ తాజా నిర్ణయం తీసుకుంది.
టికెట్లపై అదనపు డిస్కౌంట్ కూడా!
సీట్లు పూర్తిగా నిండని 40 రైళ్లలో డైనమిక్ ప్రైసింగ్‌ను రద్దు చేయడమేకాకుండా సరికొత్త డిస్కౌంట్ పద్ధతిని కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇది అమలులోకి వస్తే సుమారు 102 రైళ్లలో అవి బయల్దేరే రోజుకు ముందు నాలుగు రోజులవరకూ టికెట్ ధరలో 50 శాతందాకా డిస్కౌంట్ లభిస్తుంది. రైళ్లు ఖాళీగా వెళ్లకుండా చూడటం, రైలు ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తేవడం లక్ష్యంగా ఈ ‘చివరి నిమిషం డిస్కౌంట్ల’ను ప్రవేశపెడుతున్నారు. కానీ, ‘డైనమిక్ ప్రైసింగ్ రద్దుచేసిన... డిస్కౌంట్ అమలు చేయబోతున్న’ రైళ్ల జాబితాను మాత్రం అధికారులు ఇంకా ప్రకటించలేదు. అయితే, మీడియా కథనాల మేరకు 60 శాతంకన్నా తక్కువ సీట్లు నిండుతున్న రైళ్లలో తొలుత డిస్కౌంట్ పద్ధతిని అమలు చేస్తారని సమాచారం.
డైనమిక్ ప్రైసింగ్ రద్దు ఎందుకు?
ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన నాటినుంచే దీనిపై ప్రయాణికులు తీవ్ర విమర్శలు, ఖండనలు గుప్పిస్తూ వస్తున్నారు. పది శాతం సీట్లు నిండినప్పుడల్లా 10 శాతం వంతున టికెట్ ధర పెంచడమంటే చివరి 10 శాతం టికెట్ల ధర విమానం టికెట్ స్థాయికి చేరిపోతుండటమే ఇందుకు కారణం. ఏసీ 3 టయర్ టికెట్లకు 140 శాతం, ఇతర తరగతి టికెట్లకు 150 శాతం వరకూ మాత్రమే ధర పెరుగుదలను పరిమితం చేసినా దీనికి జనామోదం లభించలేదు. ఫలితంగా ఈ పద్ధతిని అమలులోకి తెచ్చిన కొన్ని నెలల తర్వాత సమీక్షించినప్పుడు ఒక్క అక్టోబరు నెలలోనే రైల్వేశాఖ రూ.232 కోట్లదాకా నష్టపోయినట్లు తేలింది. రైలు టికెట్‌కన్నా విమానం టికెట్ ధర తక్కువగా ఉండే పరిస్థితి రావడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిందని కూడా స్పష్టమైంది. దీంతో డైనమిక్ ప్రైసింగ్ విధానం ఎదురుతన్నిందని రైల్వే ఉన్నతాధికారులు అప్పట్లోనే వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం.