• తాజా వార్తలు

మీ మొబైల్ ఫోనే మీకు పెట్టుబడిదారు...

మొబైల్ ఫోన్లు భారతీయ ఆర్థిక రంగ ముఖచిత్రాన్నే మార్చేసే స్థాయికి చేరుతున్నాయి. కేవలం మాట్లాడడానికే అనుకున్న ఫోన్లు ఇప్పుడు ఏ పనిచేయడానికైనా సిద్ధం అన్నట్లుగా అనేక సేవలందిస్తున్నాయి. ఇప్పటికే చెల్లింపులు, బ్యాంకింగ్ రంగ సేవల్లో సాధనంగా ఉపయోగపడుతున్న మొబైల్ ఫోన్లు వచ్చే రెండేళ్లలో మరింతగా ఉపయోగపడబోతున్నాయి. అవును.... అంతా అనుకున్నట్లుగా జరిగితే రెండేళ్లలో మొబైల్ నుంచే అప్పు తీసుకోవచ్చు... దాన్నుంచే చెల్లించొచ్చు. మార్కెట్లో పండ్లు అమ్ముకునేవారికో... కూరగాయలు విక్రయించేవారికో బ్యాంకులు పొద్దున్నే ఫోన్ ఆధారిత లోన్ ఇస్తాయి... దాంతో సరకు కొని వచ్చిన డబ్బుపై వడ్డీ కలిపి సాయంత్రం ఆ రుణాన్ని తిరిగి చెల్లించేయొచ్చు.ఇలాంటి సదుపాయం కానీ వస్తే పరిస్థితి ఇప్పటిలా ఉండదు.  అప్పు ఎవరు ఇస్తారా బ్యాంకుల చుట్టూ తిరగనవసరం లేదు... బ్యాంకులే మన చుట్టూ తిరుగుతాయి.. రోజువారీ లోన్ల ఆఫర్ల సమాచారం మన ఫోన్లోనే కనిపిస్తుంది.. అందులో ఏది నచ్చితే ఆ బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు.

ఈ తరహా సేవలకోసం బ్యాంకులు, రుణాలిచ్చే ఇతర సంస్థలు, మొబైల్ వ్యాలట్ సేవలందించే సంస్థలు అన్నీ ప్రణాళికలు రచిస్తున్నాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ అనే విధానంలో ఈ తరహా సేవలు పొందొచ్చు. దీనివల్ల బ్యాంకు నుంచి బ్యాంకుకు... బ్యాంకు నుంచి మొబైల్ వ్యాలట్ కు... వ్యాలట్ నుంచి వ్యాలట్ కు కూడా నగదు బదిలీ చేసుకోవచ్చు. ఇప్పటికే ఇలాంటి సేవలున్నా ఇవి ఇంకా విస్తారం కావాల్సి ఉంది. 

పేటీఎం, మొబిక్విక్ వంటి వ్యాలట్ సర్వీసుల్లో ఆయా సంస్థల వ్యాలట్ టు వ్యాలట్ మనీ ట్రాన్సఫర్.. వ్యాలట్ టు బ్యాంక్ మనీ ట్రాన్సఫర్ సదుపాయాలున్నాయి. అయితే... వ్యాలట్ టు బ్యాంక్ ట్రాన్సఫర్ కు 4 శాతం కమీషన్ పోతుండడంతో ఆదరణ ఎక్కువగా లేదు. అయితే.... చిన్నచిన్న రిటైలర్లతో కూడా అనుసంధానమవుతూ పేటీఎం వంటి సంస్థలు వ్యాలట్ పేమెంట్ కు అవకాశం కల్పిస్తున్నాయి. ఇది పూర్తిస్థాయిలో పూర్తయితే గల్లీలో దుకాణంలో కూడా వ్యాలట్ పేమెంట్ చేసుకోవచ్చు. ఫ్రీచార్జి, నోవోపే వంటివీ భారీ ఎత్తున విస్తరిస్తున్నాయి.

అయితే... వందలకొద్దీ వ్యాలట్ సర్వీసులు వస్తుండడంతో బ్యాంకుల క్రెడిట్ కార్డు పేమెంట్లకు దెబ్బపడే అవకాశాలున్నాయి. దీంతో బ్యాంకులు  కూడా వ్యాలట్ సర్వీసుల బాట పట్టనున్నాయి. ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన పోకెట్స్ వంటివి ఉన్నా కూడా మొబైల్ వ్యాలట్ల మాదిరి శరవేగంగా విస్తరించలేదు. ఇకపై అన్ని బ్యాంకులూ వ్యాలట్ సర్వీసులు అందించడం ప్రారంభిస్తే రెండేళ్లలో మొత్తం పరిస్థితి మారిపోతుంది.

 

జన రంజకమైన వార్తలు