జియోతో టెలికం రంగంలో పెనుమార్పులు సృష్టించిన రిలయన్స్ గ్రూప్ ఇప్పుడు ఈ-కామర్స్‌పై కన్నేసింది. ఇండియాలో ఈ-కామర్స్ బిజినెస్ భారీగా పెరగడంతో రిలయన్స్ దీనిపైనా ఆధిపత్యం కోసం దూసుకొస్తోంది. ఇప్పటికే ఈ రంగంలో టాప్‌లో ఉన్న ఇండియన్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్, విదేశీ కంపెనీ అమెజాన్ ఆధిపత్యానికి రిలయన్స్ తన జియో మార్ట్‌తో చెక్ పెట్టబోతుందా? అనేది ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో నడుస్తున్న చర్చ.
జనవరి 26 నుంచి
రిలయన్స్ కంపెనీ ఇటీవలే ఆన్‌లైన్ గ్రాసరీ ఫ్లాట్‌ఫామ్ మై జియో మార్ట్‌ను ప్రారంభించింది. ప్రారంభంలో ఇది పప్పులు, ఉప్పులు మాత్రమే అమ్మే యాప్. అయితే త్వరలో ఈ ఫ్లాట్‌ఫాంపై ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్ కూడా అమ్మబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 26 నుంచి ఈ ప్రొడక్ట్స్ కూడా జియో మార్ట్‌లో ఉంబోతున్నాయి.
నవీ ముంబయిలో షురూ
3 కోట్ల మంది చిరువ్యాపారులు, తయారీదారులను ఒకే వేదికపైకి తీసుకొస్తామంటూ రిలయన్స్.. జియో మార్ట్ పేరిట ఒక హైపర్ లోకల్ కిరాణా సామగ్రిని ఇంటికే చేర్చే ప్రాజెక్టును ప్రారంభించింది. స్టోర్‌లతో కూడిన ఈ ఈ-కామర్స్ మోడల్‌ను ప్రయోగాత్మకంగా మహారాష్ట్రలోని నవీ ముంబయి, థానేల్లో ప్రారంభించింది. త్వరలో ఇలాంటివి లక్షకు పైగా స్టోర్లు యాడ్ అవుతున్నాయని రిలయన్స్ వర్గాలు చెబుతున్నాయి.
దేశ్ కీ నయా దుకాణ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కి పోటీయేనా?
ఇటీవలే రిలయన్స్ తన జియో మార్ట్ యాడ్స్‌లో కొత్త మార్పు తీసుకొచ్చింది. దేశ్ కీ నయా దుకాణ్ ట్యాగ్‌లైన్‌తో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్‌ఫోన్స్‌ను కూడా జనవరి 26 నుంచి ప్రారంభించబోతోంది. కిరాణా సరకులు అమ్మే దశలో బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ వంటి ఈ-కామర్స్ సంస్థలను కంగారుపెట్టింది జియో మార్ట్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ అమ్ముతామని ప్రకటించడంతో ఈ-కామర్స్ పేరుతో వేల కోట్ల బిజినెస్ చేస్తున్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు కంగారు పడక తప్పని పరిస్థితి. ఇంకా చాలా ఈ-కామర్స్ కంపెనీలున్నా అవేవీ ఈ రెండు సంస్థల ముందు నిలబడలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రిలయన్స్ లాంటి బిగ్ ప్లేయర్ రంగంలోకి దిగితే మాత్రం లెక్కలు మారిపోతాయి అంటున్నారు మార్కెట్ ఎక్స్‌పర్ట్‌లు.. చూద్దాం రిలయన్స్ జియో మార్ట్ ఏం చేస్తుందో?