• తాజా వార్తలు

రెండు రూపాయల వడ్డీకి మొబిక్విక్ అప్పులు...

 

రూ.500 నుంచి రూ.5 వేల వరకు తక్షణ రుణం

 

ఆన్ లైన్, ఆఫ్ లైన్ చెల్లింపుల్లో అండగా ఉంటున్న మొబైల్ వ్యాలెట్లు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఆఫర్లు, క్యాష్ పికప్ లతో అగ్రస్థానంలో ఉన్న మొబైల్ వ్యాలట్ మొబిక్విక్ మరో ఫీచర్ ను తీసుకొస్తోంది. నెలాఖరులో జేబులు ఖాళీ అయి చేతులు ముడుచుకు కూర్చునే పరిస్థితి లేకుండా చిన్నపాటి చేబదుళ్లు ఇవ్వడానికి మొబిక్విక్ ముందుకొస్తోంది. రూ.500 నుంచి రూ.5 వేల వరకు రుణం ఇచ్చేలా ఈ యాప్ లో కొత్త సర్వీసును తీసుకొస్తున్నారు.

మొబిక్విక్ వినియోగదారుల ఖర్చు తీరు ఆధారంగా ఈ రుణాలు పొందొచ్చు. మార్చి 31 నుంచి అందుబాటులోకి రానున్న ఈ సేవలో రూ.500 నుంచి రూ.5 వేల వరకు తక్షణ రుణంగా మొబి క్విక్ నుంచి తీసుకోవచ్చు.

ఇందుకోసం మొబిక్విక్ మూడు ప్రైవేటు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది. ఇలా తీసుకున్న రుణాలను 14 రోజుల నుంచి 30 రోజుల మధ్య తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. తీసుకున్న రుణం బట్టి ఈ తిరిగి చెల్లింపు వ్యవధి నిర్ణయిస్తారు. అయితే... వడ్డీ అన్న పేరు ఉపయోగించకపోయినా ఛార్జీల రూపంలో ఈ రుణాలకు కొంత కట్టాల్సి ఉంటుంది. రూ.వెయ్యి రుణంగా తీసుకుంటే రూ.20 చెల్లించాల్సి వస్తుంది.  అంటే నూటి రూ.2 వడ్డీ అన్న మాట.  మొబిక్విక్ కు ఇప్పటికే రెండున్నర కోట్ల మంది వినియోగదారులున్నారు. రోజుకు 2 కోట్ల సంఖ్యలో లావాదేవీలు మొబిక్విక్ ఆధారంగా జరుగుతుంటాయి. ఇలా వ్యాలట్లలో క్రెడిట్ కూడా దొరికితే భవిష్యత్ కాలంలో స్వల్ప క్యాష్ లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డులకు కాలం చెల్లడం ఖాయం.

అమెజాన్, స్నాప్ డీల్, పేటీఎం వంటివి ఇప్పటికే  సెల్లర్లకు రుణాలిచ్చే వ్యవస్థను ప్రారంభించాయి. సెల్లర్లను ఆకట్టుకోవడానికి ఆయా ఈ-కామర్స్ సైట్లు ఈ సేవలు అందిస్తుండగా ఇప్పుడ మొబిక్విక్ మాత్రం వినియోగదారులను మరింత గా ఆకట్టుకునేందుకు ఈ సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే అత్యవసర సమయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది.

 

జన రంజకమైన వార్తలు