బ్యాంకు అకౌంట్ ఉన్న వాళ్లందరికీ సుపరిచితమైన పేరు నెఫ్ట్. నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌ను నెఫ్ట్ అని షార్ట్‌కట్‌లో పిలుస్తారు. ఆన్‌లైన్‌లో ఎవరికైనా, ఎంత మనీ అయినా క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఇది బెస్ట్ పద్ధతి. అయితే దీనికి కొన్ని పరిమితులున్నాయి. దాదాపు బ్యాంకింగ్ పనివేళల్లోనే ఇది కూడా పని చేస్తుంది. ఈ ఇబ్బందిని కూడా తొలగిస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు నెఫ్ట్ సర్వీసును వాడుకునే అవకాశాన్ని కల్పించింది ఆర్‌బీఐ. డిసెంబర్ 16 నుంచి ఈ పద్ధతి అమల్లోకి వచ్చింది.
ఇవీ నెఫ్ట్ పని వేళలు
* మొన్నటి వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకే నెఫ్ట్ పని చేసేది. ఇప్పడు అర్ధరాత్రి 12.30 గంటల నుంచి మళ్లీ రాత్రి 11.30 గంటల వరకు రోజులో 23 గంటలు పని చేస్తుంది. ఆ గంట కూడా మెయింటనెన్స్ కోసమే సర్వీస్‌ను నిలిపివేస్తున్నారు.
* బ్యాంకు సెలవుదినాల్లో నెఫ్ట్ పని చేసేది కాదు. ఇప్పుడు ఈ రోజుల్లోనూ నెఫ్ట్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
* గతంలో 1,2 శనివారాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే నెఫ్ట్ నడిచేది. ఇప్పుడు ఆ రోజుల్లోనూ 23 గంటలు పని చేస్తుంది.
నెఫ్ట్ ఛార్జీలు
ఆర్‌బీఐ సూచనల ప్రకారం నెఫ్ట్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు.
* ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాంటి పెద్ద బ్యాంకులు ఇప్పటికే నెఫ్ట్ ఉచితంగా అందిస్తున్నాయి.
* కొన్ని చిన్న బ్యాంకులు అది కూడా సేవింగ్స్ అకౌంట్ల వారికే నెఫ్ట్‌కి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇవి కూడా త్వరలోనే ఫ్రీ సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే జనవరి నుంచి సేవింగ్స్ అకౌంట్‌వాళ్లకు కూడా నెఫ్ట్‌కి ఛార్జీలు వసూలు చేయవద్దని ఆర్‌బీఐ ఇప్పటికే సూచనలు చేసింది.
ఎంత ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు?
ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో 24 గంటలూ సర్వీస్ అందించే ఐఎంపీఎస్ ఇప్పటికే అందుబాటులో ఉంది. అయితే ఇందులో రోజుకు మ్యాగ్జిమం 2 లక్షల రూపాయలు మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయగలం.
* అదే నెఫ్ట్‌లో అయితే ఎంత సొమ్మయినా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. లిమిట్ లేదు.
* నెఫ్ట్‌లో ఒక ట్రాన్సాక్షన్‌కు 10 లక్షల రూపాయలు మించి ట్రాన్స్‌ఫర్ చేయలేం.