ప్రస్తుతం దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న ట్యాక్సీ సర్వీసులు ఓలా, ఉబర్ అనే చెప్పాలి. మన కాల్ చేసిన వెంటనే స్పందించి వీలైనంత త్వరగా మన గమ్య స్థానాలకు చేర్చడానికి ఓలా, ఉబర్‌లు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ డ్రైవర్లకు కూడా ఇవీ పోటీని పెడుతున్నాయి. బిజీ సమయాల్లో ఎవకు ఎక్కువ ట్రిప్స్ వేస్తే వారికి ఎక్కువ మొత్తాలు ఇవ్వడం, ఎవరు మంచి రేటింగ్ సాధిస్తే వారికి ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వడం లాంటి ఆఫర్లతో వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఐతే ఈ క్యాబ్ కంపెనీలు పెట్టిన నిబంధనలు మరీ కఠినంగా ఉండడం, తాము నష్టపోవాల్సి వస్తుండటంతో ఓలా, ఉబర్ ట్యాక్సీ డ్రైవర్లు ఏక కాలంలో సమ్మెకు దిగారు. చెన్నై, బెంగళూరు నగరాల్లో ఓలా, ఉబెర్ డ్రైవర్లు రెండు రోజులు విధులకు హాజరు కాకుండా నిరసన తెలియజేశారు. ఈ నిరసనలతో ఈ రెండు క్యాబ్ కంపెనీలు దిగొచ్చాయి. డ్రైవర్లకు నిబంధనలను సడలించాలని నిర్ణయించాయి. డ్రైవర్లకు లక్ష్యాలు నిర్దేశించకూడదని నిర్ణయం తీసుకున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ఎక్కువ రైడ్లు చేయాలన్న నియమాన్ని కూడా ఈ రెండు కంపెనీలు సడలించాయి. అంతేకాదు పీక్ అవర్ టైమ్ స్లాట్‌ను కూడా ఓలా పెంచినట్లు దీని వల్ల ఎలాంటి గబారా లేకుండా రోజుకు తాము నిర్దేశించిన రైడ్లను పూర్తి చేయగలుగుతున్నామని డ్రైవర్లు చెబుతున్నారు. ఐతే రోజుకు ఎక్కువ మొత్తాన్ని డ్రైవర్లు పొందాలంటే కనీసం 15 రైడ్‌లు చేయాల్సి ఉందనే నిబంధనలో మాత్రం రెండు కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. ఐతే నగరాలను బట్టి, కార్ల బట్టి, పరిస్థితులను బట్టి తమకు రైడ్స్ వస్తున్నాయని, ప్రతి రోజూ 15 రైడ్లే చేయలనడం కూడా సరైన నియమం కాదని వారు చెబుతున్నారు. ప్రతిరోజూ నిర్దేశించిన లక్ష్యాలతో పాటు మంచి రేటింగ్ ఉంటేనే డ్రైవర్లకు మంచి వేతనం లభిస్తుంది. ఎలాగోలా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసినా... రేటింగ్ విషయమే డ్రైవర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ కారణంగా కస్టమర్ల దగ్గరకు ఆలస్యంగా వెళ్లడం, వారిని లేట్‌గా గమ్య స్థానాలకు చేర్చడంతో వారి రేటింగ్ కూడా పడిపోతుంది. దీంతో తమ ఇబ్బందులను తెలియజేస్తూ 20 డిమాండ్లతో డ్రైవర్లు ఈ ఆందోళనలకు దిగారు. |