అసోచామ్-పీడబ్ల్యూసీ తాజా నివేదికలో వెల్లడి 2015లో 55 మిలియన్ల మంది ఈ ఏడాది 80 మిలియన్ల మంది కొనుగోళ్ళు దేశం ఎలాంటి ఆర్థిక పరిస్థితిలో ఉన్నా కూడా ఆన్ లైన్ సేల్స్ మాత్రం తగ్గడం లేదట.. ఈ ఏడాది ఆన్ లైన్ కొనుగోళ్లు 78 శాతం వృద్ధి చెందుతాయని అసోచామ్-పీడబ్ల్యూసీ తన తాజా నివేదికలో వెల్లడించింది. గత ఏడాది ఆన్ లైన్ కొనుగోళ్లు 66 శాతం ఉన్నాయి. ఈ ఏడాది అదనంగా మరో 12 శాతం వృద్ధి ఉంటుందని అంచనా. కాగా ఆన్ లైన్ వ్యాపారం ఈ స్థాయిలో పుంజుకోవడానికి అసోచామ్ తన అధ్యయనంలో పలు కారణాలు గుర్తించింది. కంపెనీలు వినూత్నంగా మార్కెట్ చేయడం.. పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తుండడం కారణమని తేల్చింది. ఈ కామర్స్ పోర్టళ్లలో దుస్తుల నుంచి నగల వరకు.. ఎలక్ర్టానిక్ వస్తువుల నుంచి పుస్తకాల వరకు ప్రతిదీ ఆకర్షణీయమైన ధరలకు ఇస్తుండడం.. రిటర్న్ అవకాశాలు మెరుగ్గా ఉండడం... ఎంపికకు ఎక్కువ విస్తృతి ఉండడం... నచ్చకపోతే మన చేతికి వస్తువు అందేలోపు ఏ క్షణంలోనైనా ఆర్డర్ కాన్సిల్ చేసే వీలుండడం వంటి కారణాలతో చాలామంది దీనికి మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఇవి 24 గంటలు, 365 రోజులు పనిచేసే సంస్థలు కావడంతో ఏ రోజైనా, ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా షాపింగ్ చేసే వీలుంటుంది. ఇలాటి అన్ని కారణాలు ఆన్ లైన్ సేల్స్ ను స్పీడప్ చేస్తున్నాయని అసోచామ్ చెప్పింది. అసోచామ్ నివేదిక ప్రకారం 2015లో 55 మిలియన్ల మంది ఆన్ లైన్లో వస్తువులను కొనుగోలు చేయగా ఈ ఏడాది ఈ సంఖ్య 80 మిలియన్లకు చేరుతుందని అంచనా. ఇంటర్నెట్ విస్తరణ, రవాణా సౌకర్యాలు మెరుగవడం దీనికి కారణమవుతున్నాయి. ఈ కామర్స్ సంస్థలు ఫ్లాష్ సేల్స్, రోజువారీ డీల్స్, లాయల్టీ ప్రోగ్రాంలు వంటివాటితో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. మరోవైపు స్మార్లఫోన్ల వినియోగం పెరుగుతుండడం.. ఈ కామర్స్ సంస్థలన్నీ యాప్స్ రూపంలోకి మారడం కూడా విక్రయాల వృద్ధికి కారణమవుతోంది. ఈ కామర్స్ విక్రయాల్లో 11 శాతం స్మార్ట్ ఫోన్ల ఆధారంగా జరుగుతున్నదే. 2017 నాటికి ఇది 25 శాతం వాటా ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ-కామర్స్ పరిశ్రమ విలువ 25 బిలియన్ డాలర్లు ఏటా ఈ రంగంలో 35 శాతానికి పైగా వృద్ధి ఉంటోంది. వచ్చే అయిదేళ్లలో ఇది 100 బిలియన్ డాలర్లకు చేరనుందని అంచనా. కాగా కంప్యూటర్లు, కంజ్యూమర్ ఎలక్ర్టానిక్స్ ఈ-కామర్స్ సైట్లలో ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని నివేదిక పేర్కొంది. 40 శాతం విక్రయాలు వీటివేనట. దీంతో పాటు సినిమా టిక్కెట్లు, మ్యూజిక్, గేమ్స్, క్రీడా పరికరాలు, బీమా ఉత్పత్తులు, గృహ పరికరాలు, ఫర్నిచర్ కూడా బాగా సేలవుతోందని అసోచామ్ నివేదిక వెల్లడించింది. |