ఈ-కామర్స్ రంగంలో దిగ్గజ సంస్థల మధ్య పోటీ ఓ మొబైల్ ఫోన్ కంపెనీని నడి బజారులో నిలబెట్టేసింది. తమ ప్రోడక్ట్ కు హైప్ క్రియేట్ చేస్తూ ఎక్స్లూజివ్ గా ఓ ఈ-కామర్సు వెబ్ సైట్లో ఫ్లాష్ సేల్ కు పెట్టడం... మరో వెబ్ సైట్ అంతకంటే భారీగా ధర తగ్గించి విక్రయిస్తామని ప్రకటించడం ఆన్ లైన్ మార్కెట్లో వివాదాలకు, కొత్త యుద్ధాలకు తెరతీసింది. అంతేకాదు... ఆన్ లైన్లో కొంటున్నవన్నీ అసలైన ఉత్పత్తులేనా అన్న అనుమానం కలిగేలా చేసింది. ఇంతకీ... ఈ వివాదమేంటి... ఆ మొబైల్ ఫోనేంటి... ఈ-కామర్సు సైట్లేంటి అన్నది తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు.
1. ఆన్ లైన్ షాపింగ్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేర్లలో ఫ్లిప్ కార్ట్, అమెజాన్లదే అగ్రస్థానం. ఇప్పుడు ఆ రెండింటి మధ్య కొత్త వివాదం నెలకొంది. ‘వన్ ప్లస్ 3’ అనే మొబైల్ ఫోన్ విక్రయాల విషయంలో ఈ రెండిటి మధ్య పోరు షురూ అయింది. నిజానికి వన్ ప్లస్ 3, అమెజాన్ ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు అమెజాన్లో ఆ ఉత్పత్తిని విక్రయించాలి. కానీ... అంతలోనే ఫ్లిప్ కార్డ్ బిగ్ షాపింగ్ డేస్ పేరుతో డిస్కౌంట్ సేల్ ప్రకటించి అందులో ఈ వన్ ప్లస్ 3ని రూ.18,999కి విక్రయిస్తామని ప్రకటించింది. ఈ ధర అమెజాన్ లో విక్రయ ధర కంటే రూ.9 వేలు తక్కువ. ఇంకేముంది... ఫ్లిప్ కార్డు ప్రకటనతో అమెజాన్ కు , వన్ ప్లస్ 3కి.. రెండింటికీ దిమ్మ తిరిగిపోయింది. బయటపడకపోయినా అమెజాన్.. వన్ ప్లస్ 3ని అనుమానించింది. తమతో డీల్ కుదుర్చుకుని ఫ్లిప్ కార్టుతోనూ బేరం చేసుకుందా అని డౌట్ పడింది. మరోవైపు వన్ ప్లస్ 3కి కూడా కంగారు పడింది. ఇదెలా సాధ్యమని షాక్ అయింది.
2. తాము ఫ్లిప్ కార్ట్ తో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని, ఇదెక్కడి గోలని వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ తన ట్విట్టర్ ఖాతాలో ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు... ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ను ట్యాగ్ చేస్తూ, "బ్రదర్, వాట్ ఈజ్ దిస్?" అని ఆయన ప్రశ్నించారు. తాము వన్ ప్లస్ 3 అమ్మకాల కోసం అమెజాన్ తో ప్రత్యేక డీల్ కుదుర్చుకున్నట్టు తెలిపారు. అయితే.. ఈ ట్వీట్ పై సచిన్ బన్సాల్ స్పందించలేదు. అయితే, ఫ్లిప కార్ట్ మాత్రం ఓ ప్రకటన రిలీజ్ చేసింది... "దేశవ్యాప్తంగా ఏ అమ్మకందారుడైనా మా వెబ్ సైట్లో అతని ప్రొడక్టులను విక్రయించుకోవచ్చు. అయితే, వారు కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సి వుంటుంది. ఉత్పత్తులపై ఇచ్చే డిస్కౌంట్లు, వాటి ధరలు అమ్మకందారుల ఇష్టానుసారమే ఉంటాయి" అని అందులో మెన్షన్ చేసింది.
3. కాగా అమెజాన్ లో వన్ ప్లస్ 3 ధరను రూ. 27,999గా నిర్ణయించారు. ఇదే సమయంలో ఈ ఫోన్ ను రూ. 20 వేల కన్నా తక్కువకు అందిస్తామని ఫ్లిప్ కార్ట్ లో ప్రకటన రావడాన్ని అటు వన్ ప్లస్, ఇటు అమెజాన్ తప్పుబట్టాయి. తాము ప్రత్యేకంగా అమెజాన్ తో డీల్ కుదుర్చుకుని ఈ ఫోన్ విక్రయిస్తున్నామని, అనధికారికంగా జరిగే లావాదేవీల్లో తమకు ఎలాంటి సంబంధం లేదని, కస్టమర్లు మోసపోవద్దని వన్ ప్లస్ 3 సహవ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ కోరారు.
4. ఇంతవరకు బాగానే ఉన్నా.. అమెజాన్ లో మాత్రమే దొరికేలా రిలీజ్ చేసిన ఈ ఫోన్ ఫ్లిప్ కార్డు ఎలా విక్రయించగలదన్నది ప్రశ్న. అంతేకాదు.. అమెజాన్ లో అఫీషియల్ విక్రయాల్లో వన్ ప్లస్ 3కి వారంటీ ఉండగా.. ఫ్లిప్ కార్టులో వారంటీ లేదు. దీంతో ఫ్లిప్ కార్ట్ గ్రే మార్కెట్ వెబ్ సైట్ గా ముద్ర వేయించుకుంది.
గ్రే మార్కెట్ అంటే ఏంటి..?
ఏ వస్తువునైనా తయారుచేసే వ్యక్తి నుంచి నేరుగా కాకుండా ఇతర మార్గాల్లో దాన్ని సంపాదించి విక్రయించే వేదికను గ్రే మార్కెట్ అంటారు. అసలు వస్తువు తయారైన చోటే అది తయారుకావొచ్చు.. వేరే చోట కావొచ్చు.. తయారీదారే దాన్ని ఇవ్వొచ్చు.. వేరే మార్గాల్లో సంపాదించొచ్చు.. కానీ, దానికి తయారీదారు మార్కెట్లోకి రిలీజ్ చేసే అధికారిక ఉత్పత్తికి ఇచ్చే హామీలు, గ్యారంటీలు, సర్వీసింగ్ సేవలు ఉండవు. అంటే... తయారీదారు కానీ, ఇతరులు కానీ అనధికారికంగా విక్రయించిన ఉత్పత్తన్నమాట. ఇప్పుడు ఫ్లిప్ కార్టు ఎలా సంపాదించిందన్నది పక్కనపెడితే ఇందులో ఏదో మతలబు ఉందన్నది మాత్రం అర్థమవుతోంది.
అందరూ కలిసే చేశారా..?
ఈ వ్యవహారంలో ముఖ్యంగా రెండు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
1. అమెజాన్ తో డీల్ కుదుర్చుకున్నాక ఫ్లిప్ కార్టు దాన్ని విక్రయిస్తానని ముందే ప్రకటించినప్పుడు వన్ ప్లస్ 3 సంస్థ న్యాయపరంగా దాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. కానీ.. అలా చేయ లేదు. కేవలం ట్వీట్లలో ఆవేదన వ్యక్తంచేసి ఊరుకున్నారు.
2. అమెజాన్ కూడా దీనిపై ఫ్లిప్ కార్టుపై కానీ, వన్ ప్లస్ 3పై కానీ చర్యలు తీసుకునే ప్రయత్నం చేయలేదు. ... సో.. ఇదంతా వన్ ప్లస్ 3కి పబ్లిసిటీ కోసం పన్నిన వ్యూహమని.. ఆథరైజ్డ్ గా, అనాథరైజ్డ్ గా విక్రయాలు చేయడానికి వేసిన ప్లానని కూడా పలువురు అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ఈ ఇష్యూలో ఫ్లిప్ కార్టు అమ్మకాలతో డబ్బులు సంపాదించుకున్నా ఇంతకుముందు సంపాదించుకున్న ప్రతిష్ఠను మాత్రం అమ్ముకున్నట్లయింది.
..మరోవైపు ఇటీవల కాలంలో ఇలాంటి గ్రేమార్కెట్ సంస్కృతిని పలు ఇండైరెక్ట్ కామర్స్ వెబ్ సైట్లూ ప్రోత్సహిస్తున్నాయి. అఫిలియేట్ మార్కెటింగ్ పేరుతో ఉత్పత్తుల గురించి రివ్యూలు రాస్తూ.. అక్కడే కొనుగోలు లింకులను అందిస్తున్న వెబ్ సైట్లు ఉంటున్నాయి. ఇంగ్లీష్ లోనే కాకుండా ఇటీవల కొన్ని తెలుగు వెబ్ సైట్లూ(కంప్యూటర్ విజ్హానం కాదు) ఇదే పని చేస్తున్నాయి. అవన్నీ కమీషన్లకు ఆశపడి గ్రేమార్కెట్ ను ప్రోత్సహిస్తున్నాయి. వినియోగదారులను ఈకామర్సు సంస్థలు మోసగిస్తుంటే వాటితో కలిసి ఈ ఇండైరెక్టు కామర్స్ జరుపుతున్న సోకాల్డ్ వెబ్ సైట్లు టెక్ పాఠకులను మోసగిస్తున్నాయి.
ఇంతకీ వన్ ప్లస్ 3లో ఏముంది..?
- 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
- 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
- వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్, వైఫై డైరెక్ట్
- బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఫింగర్‌ఫ్రింట్ సెన్సార్, కంపాస్
- యూఎస్‌బీ టైప్-సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, అడ్రినో 530 గ్రాఫిక్స్