ప్రపంచవ్యాప్తంగా కొనుగోళ్ల ట్రెండులో గత కొన్నేళ్లుగా భారీ మార్పులు వచ్చేశాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలన్న తేడాలు లేకుండా జనం ఆన్ లైన్లోనే షాపింగ్ చేసేస్తున్నారు. డయాపర్ల నుంచి డైమండ్ జ్యూయలరీ వరకు అన్నీ ఆన్ లైన్లో కొనేస్తున్నారు. అయితే.. ఆన్ లైన్ షాపింగ్ లో ఎవరు టాప్ అన్నది పరిశీలిస్తే అన్నిట్లో దూసుకెళ్తున్న చైనాయే అందులోనూ ప్రథమ స్థానం కొట్టేసిందని తేలింది. ఉత్తర అమెరికా, ఆసియా–పసిఫిక్, యూరప్‌లోని 26 మార్కెట్ల నుంచి సేకరించిన గణాంకాలను విశ్లేషించి బ్రస్సెల్స్‌కు చెందిన ‘ఇంటర్నేషనల్ పోస్ట్ కార్పోరేషన్ ’ సంస్థ నిర్వహించిన రెండో వార్షిక సర్వేలో ఈ విషయం తేలింది.
ఐపీసీ సర్వే ప్రకారం చైనాలో 36శాతం మంది తక్కువలో తక్కువ వారానికి ఒకసారైనా ఆన్ లైన్ షాపింగ్ చేస్తారట. అమెరికాలో ఈ కొనుగోళ్లు 16శాతం కాగా, జర్మనీ, బ్రిటన్ లో 15శాతంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ , ఈబే, అలీబాబా గ్రూప్‌ల నుంచి కొనేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని ఈ సర్వేలో తేలింది.
కాగా మరో సర్వేలో ఇంకో లవ్లీ న్యూస్ బయటకొచ్చింది. 41 శాతం మంది మగవారు, 30 శాతం మంది మగువలు తమ ప్రేమికుల రోజు బహుమతిని ఆన్ లైన్ షాపింగ్ సైట్ ల ద్వారా పంపాలనుకొంటున్నారట. బయట దుకాణాల్లో కంటే ఆన్ లైన్లో అయితే స్పెషల్ గిఫ్టులు దొరుకుతాయని చాలామంది భావిస్తున్నారట.