రైల్వే టిక్కెట్లు కావాలంటే మనం వెంటనే ఓపెన్ చేసే సైట్ ఐఆర్‌సీటీసీ. దీనిపై ప్రయాణీకులు ఎంతగా ఆధారపడ్డారంటే ప్రయాణాలు ఎక్కువగా ఉండే సీజన్లలో ఈ సైట్ హాంగ్ కూడా అయిపోతుంది. అంత బిజీగా ఉంటుంది ఐఆర్‌సీటీసీ సైట్. అయితే రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణాల దృష్ట్యా జర్నీని మరింత సులభతరం చేసేందుకు ఈ భారతీయ రైల్వే సైట్ ఒక కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఒకప్పుడు రైల్వే టిక్కెట్ కావాలంటే అదో పెద్ద యుద్ధమే. సీజన్లో రైల్వే టిక్కెట్ కొనాలంటే చాంతాడంత క్యూలలో నిల్చోక తప్పదు. ఐఆర్‌సీటీసీ వచ్చాక ఆ బాధలు చాలా వరకు తగ్గాయి. ఇంటర్నెట్ అందుబాటులో లేనివాళ్లు, హడావుడిగా, అత్యవసరంగా టిక్కెట్ అవసరం అయిన వాళ్లు స్టేషన్లలోని కౌంటర్లలో టిక్కెట్లు కొంటున్నారు. ఐతే ముందుగా ప్రయాణాలను ప్లాన్ చేసుకునే వాళ్లు మాత్రమే ఐఆర్‌సీటీసీ ద్వారా నెలల ముందుగానే టిక్కెట్లు రిజర్వ్ చేసుకుంటున్నారు. అలా రిజర్వ్ చేసుకునే ప్రయాణీకుల కోసం ఐఆర్‌సీటీసీ పే ఆన్ డెలివరీ టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది. దీని వల్ల మీరు జస్ట్ ఆన్‌లైన్‌లో మనీ పే చేయకపోయినా ఇంటికి టిక్కెట్లు వచ్చిన తర్వాత మనీ పే చేయచ్చు.
బుకింగ్ సులభతరం చేయడానికి
రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతమైన టిక్కెట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకే ఐఆర్‌సీటీసీ పే ఆన్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. మీ టిక్కెట్ బుక్ చేసేందుకు ఈ సైట్‌లోకి వెళితే అందులో ఈ పే ఆన్ డెలివరీ అనేది అదనపు ఆప్షన్‌లా కనిపిస్తుంది. మీ బుకింగ్ పూర్తయిన తర్వాత ఈ ఆప్షన్‌న్ క్లిక్ చేస్తే మీ ఇంటికే నేరుగా టిక్కెట్లు వచ్చేస్తాయి. ఐతే మీరు ముందుగా ఈ సౌకర్యం కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రైల్వే టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసేటప్పుడు పేమెంట్ విషయంలోనే చాలామంది ఇబ్బందిపడతారు. ఎలా పేమెంట్ చేయాలో కూడా తెలియక మధ్యలోనే వదిలేస్తారు. కొంతమంది పేమెంట్ చేసినా ఆ ట్రాన్సాక్షన్లు ఫెయిల్ కావడంతో ఒకవైపు టిక్కెట్ బుక్ కాక.. మరోవైపు మనీ కట్ అయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారి కోసం పే ఆన్ డెలివరీ విధానం ఉపయోగపడనుంది. టిక్కెట్లు ఇంటికి వచ్చాక కార్డ్, వాలెట్, నెట్ బ్యాంకింగ్, మనీ లాంటి చెల్లింపు విధానాల ద్వారా ఏజెంట్‌కు పే చేయచ్చు.
ఎలా రిజిస్టర్ చేసుకోవాలి
పే ఆన్ డెలివరీ సిస్టమ్‌ను ప్రస్తుతం భారత్‌లో 600 పట్టణాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. మనం జర్నీ చేసే ఐదు రోజుల వ్యవధి వరకు ఈ ఆప్షన్ ద్వారా టిక్కెట్లు పొందే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రయాణీకులు ఈ ఆప్షన్ ఉపయోగించుకోలేరు. పే ఆన్ డెలివరీకి రిజిస్టర్ చేసుకోవాలంటే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఐఆర్‌సీటీసీ సైట్‌కు వెళ్లి ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు వివరాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. పే ఆన్ డెలివరీ ఉపయోగించుకుంటే సాధారణ టిక్కెట్ ఛార్జీలకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మీ టిక్కెట్ ధరకు అదనంగా రూ.90 మరియు సర్వీస్ టాక్స్ చెల్లించాలి. ఐతే పే ఆన్ డెలివరీ ఆప్షన్‌తో బుక్ చేసి టిక్కెట్లను కాన్సిల్ చేయాలనుకుంటే కాన్సిలేషన్ ఛార్జీలతో పాటు డెలివరీ ఛార్జీలు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఒకటికి రెండుసార్లు ఇలా కాన్సిల్ చేస్తే యూజర్ ఐడీని డీయాక్టివేట్ చేసే అవకాశం ఉందని రైల్వే శాఖ తెలిపింది.