డిజిటల్ వాలెట్‌గా ఇండియన్ ఎకానమీలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న పేటీఎం ఇప్పుడు ఓ పెద్ద వివాదంలో చిక్కుకుంది. పేటీఎంలో ఉన్న యూజర్ల సమాచారాన్నిప్రధానమంత్రి కార్యాలయం (పీవోఎం) అడిగిందని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సోదరుడు, సంస్థ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజయ్‌శర్మ ఓ స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పడం కలకలం సృష్టించింది. స్టింగ్ ఆపరేషన్స్ చేయడంలో దిట్ట అయిన కోబ్రా పోస్ట్ అనే ఇన్వెస్టిగేటివ్ వెబ్‌సైట్ ఈ విషయాన్ని బయటపెట్టింది. కోబ్రాపోస్ట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పుష్పశర్మ తాను శ్రీమద్భగవద్గీత ప్రచార సమితి ప్రతినిధిని అని చెప్పి పేటీఎం సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజయ శేఖర్ శర్మ, వైస్ ప్రెసిడెంట్ సుధాన్షు గుప్తలను కలిశాడు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో మిమ్మల్ని కలిసినట్లు పుష్ప్‌శర్మ చెప్పాడు. ఈ సందర్భంలో అజయ్, సుధాన్షు ఇద్దరూ కూడా తాము ఆరెస్సెస్ (భాజపా అనుబంధ సంస్థ)తో దగ్గర సంబంధాలున్న వ్యక్తులమని చెప్పుకున్నారు. అంతేకాదుతాము ప్రభుత్వంతో కూడా దగ్గర సంబంధాలు నడుపుతుంటామనిచెప్పారు. ప్రధాని మోడీ స్కూల్ పిల్లలను ఉత్తేజపరుస్తూ రాసిన ఎగ్జామ్ వారియర్స్ బుక్‌ను తామే ప్రమోట్ చేశామని చెప్పుకొచ్చారు. అంతేకాదు కాశ్మీర్‌లో రాళ్లు విసిరి సైన్యాన్ని, భద్రతాదళాలను రెచ్చగొట్టి కల్లోలం సృష్టించే వారిని పట్టుకోవడం కోసమంటూ పేటీఎం యూజర్ల వివరాలివ్వమని ప్రధానమంత్రి కార్యాలయం అడిగిందని కూడా అన్నారు. ఈ వీడియోను కోబ్రా పోస్ట్ Operation-136 II, Paytm అనే పేరుతో తన ఫేస్‌బుక్ పేజీలో, యూట్యూబ్ ఛానల్‌లో పెట్టాక దాదాపురెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది పేటీఎం యాప్ డిలీట్ చేయమని ప్రచారం కూడా మొదలుపెట్టారు. పేటీఎం అంటే పే టూ మోడీ అనే కొత్త స్లోగన్ కూడా వైరల్ చేస్తున్నారు.
పేటీఎం ఏమంటోంది?
కోబ్రాపోస్ట్ చెబుతున్నవాటిలో నిజాల్లేవని పేటీఎం అంటోంది. తమ దగ్గరున్న యూజర్ల డేటా పూర్తిగా వారి వ్యక్తిగతమని, 100 శాతం సురక్షితంగా ఉన్నదని చెప్పింది. దాన్ని తాము గానీ థర్డ్ పార్టీ యాప్స్‌గానీ తీసుకోలేదని చెప్పారు. ఎవరు అడిగినా ఇవ్వలేదన్నారు. కేవలం శాంతిభద్రతలు పర్యవేక్షించే సంస్థలు కోరినప్పుడు మాత్రమే ఇచ్చామన్నారు.అయితే ఆ సంస్థలేమిటో చెప్పకపోవడం అనుమానాలకు దారితీసింది.
డీమానిటైజేషన్‌తోనే ఎదిగింది
2010లో యుటిలిటీ పేమెంట్స్ ఫెసిలిటేటర్ యాప్‌గా ప్రయాణం మొదలుపెట్టిన పేటీఎం 2016 వరకు ఓ అనామక కంపెనీ. 2016 నవంబర్ 8న డీమానిటైజేషన్ అంటూ కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడం పేటీఎంకు వరమైంది. చేతిలో నగదు లేని పరిస్థితుల్లో జనమందరూ డిజిటల్ బాటపట్టారు. డబ్బులు, కార్డులతోపాటు పేటీఎం అనేది కూడా కరెన్సీ అన్నంతగా మారిపోయింది. పాలబూత్ నుంచి సూపర్ మార్కెట్ వరకు అన్నిచోట్లా పేటీఎం హవా సాగుతోంది. అందుకే ఇప్పుడు 20 కోట్ల మంది యూజర్లున్నారు. పేటీఎం మా దగ్గర పనిచేస్తుందని రిజిస్టర్ చేసుకున్న వ్యాపారులే 70 లక్షల మంది ఉన్నారంటే పేటీఎం బిజినెస్ ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు. తమకు అంత సాయం చేసిన మోడీ గవర్నమెంట్‌కు పేటీఎం తన యూజర్ల డేటా సమర్పించి కృతజ్ఞత ప్రదర్శించదా అనే విమర్శలు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. నిజానిజాలేమిటో తేలాలి మరి..