పోస్టాఫీసులు... గత వైభవం తాలూకు చిహ్నాలుగా కనిపిస్తాయి. భారత వ్యాప్తంగా పోస్టాఫీసులు ఉన్నా గతంలో వాటికి ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు లేదు. వేలాది పోస్టాఫీసులు కార్యకలాపాలు లేక మూలబడుతున్నాయి. కొన్ని పోస్టాఫీసుల్లో ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించేస్తున్నారు. ముఖ్యంగా ఇంటింటికి లెటర్లు, మనీ ఆర్డర్లు ఇచ్చే పోస్ట్‌మ్యాన్‌లు కనిపించట్లేదు. ఒకవేళ ఉన్నా... వారి సంఖ్య తగ్గిపోయింది. ఇంటర్నెట్ విప్లవం వచ్చిన తర్వాత, సెల్‌ఫోన్‌లు సునామీలా ప్రపంచ మీద పడిన తర్వాత పోస్ట్.... అనే మాట వినిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఇ-కామర్స్ పోస్టల్ శాఖకు మళ్లీ జవసత్వాలు పోసే దిశగా అడుగులు వేస్తోంది. ఇ-కామర్స్ సంస్థలు తమ కార్యకలాపాల కోసం పోస్టల్ సేవలను ఉపయోగించుకుంటున్నాయి. దీంతో పోస్టల్‌కు ఆదాయం పెరగడమే కాదు... పోస్టమ్యాన్‌లకు మళ్లీ చేతి నిండా పని దొరికింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ లాంటి ఆన్‌లైన్ దిగ్గజ సంస్థలు తమకు వేలాదిగా వచ్చిపడుతున్న ఆర్డర్లను డెలివరీ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థలు తమ సొంత డెలివరీ సంస్థలను ఏర్పాటు చేసుకున్నా.. కొన్ని సంస్థలు మాత్రం ప్రైయివేటు డెలివరీ సంస్థలపైనే ఆధారపడుతున్నాయి. దీంతో బ్లూడార్ట్, డెలివరీ లాంటి సంస్థలు బాగా లాభపడ్డాయి. అయితే భారీ సేల్స్ ఉన్న సమయాల్లో ఆన్‌లైన్ స్టోర్లకు లెక్కకు మించి ఆర్డర్లు వస్తున్నాయి. ముఖ్యంగా కొత్త ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చినప్పుడు లక్షల్లో ఆర్డర్లు వస్తున్నాయి. ఈ స్థితిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఈ ఆన్‌లైన్ స్టోర్లు పోస్టాఫీసులపై దృష్టి సారించాయి. పోస్టాఫీసులకు ఆర్డర్లను మళ్లిస్తే డెలివరీ సులభంగా ఉండటం, అడ్రస్‌లను కనుక్కోవడం ఈజీ కావడం, మిగిలిన డెలివరీ సంస్థలతో పోలిస్తే ఛార్జీలు కూడా తక్కువగా ఉండటంతో ఇ-కామర్స్ సంస్థలు పోస్టాఫీసులను నమ్మకుంటున్నాయి. 2014-15 ఏడాది కాలంలో ఇ-కామర్స్ వ్యాపారం ద్వారా కర్ణాటక పోస్టల్ సర్కిల్ రూ.269 కోట్ల ఆదాయం సంపాదించిందట. 2010-11 ఏడాదికి రూ.60 కోట్లుగా ఉన్న ఆ సర్కిల్ ఆదాయం ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి ఇ-కామర్సే కారణమని ఆ సంస్థ తెలిపింది. ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా పోస్టల్ శాఖకు రోజుకు 2000 నుంచి 5000 పార్సిల్స్ దాకా డెలివరీకి వస్తున్నాయట. మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి డెలివరీ చేసే అవకాశం ఉండటం కూడా ఆన్‌లైన్ స్టోర్లు పోస్టల్ వైపు మళ్లడానికి ప్రధానం కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. |