ఇండియాలో ఈ-కామర్స్ బిజినెస్ బాగానే డెవలప్ అయింది. మెట్రో సిటీస్ నుంచి ఓ మాదిరి పట్టణాల వరకు కూడా ఈ-కామర్స్‌లో ఆర్డర్ చేసి వస్తువులు తెప్పించుకుంటున్నారు. అయితే మెట్రో నగరాల్లో మాదిరిగా ఆన్‌లైన్ (క్రెడిట్ / డెబిట్ కార్డ్‌లు, నెట్ బ్యాంకింగ్‌లతో) పేమెంట్‌లు పెద్దగా తెలియని, తెలిసినా వాటిని పెద్దగా వాడని పట్టణాల ప్రజలు ఇప్పటికీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. కంపెనీలు కూడా ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీకి మంచి ప్రిఫరెన్సే ఇస్తున్నాయి. కానీ ఈ క్యాష్ ఆన్ డెలివరీలు ఆథరైజ్డ్ కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోంది. దీనికి కారణమేంటి?
సగానికిపైగా సీవోడీలే
ఈ-కామర్స్ బిజినెస్ ఇండియాలో క్లిక్కవడానికి ప్రధాన కారణాల్లో క్యాష్ ఆన్ డెలివరీ (CoD) ఆప్షన్ కూడా ఒకటి. కార్డ్‌లో డబ్బుల్లేకపోయినా వస్తువు ఆర్డర్ చేసి ఇంటికి వచ్చాక దాన్ని తీసుకొచ్చిన వ్యక్తికి డబ్బులు చెల్లించి తీసుకోవడమే సీవోడీ. ఇలాంటి సీవోడీ ఆర్డర్లు ఈ-కామర్స్ ఆర్డర్లలో సగానికిపైగా ఉంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తోపాటు దాదాపు అన్ని ఈ-కామర్స్ కంపెనీలూ దీన్ని ఫాలో అవుతున్నాయి. అయితే పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్స్ సిస్టమ్స్ యాక్ట్ 2007 ప్రకారం ఇలా థర్డ్ పార్టీ వెండర్లను పెట్టుకుని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లాంటి సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీ బిజినెస్ చేయడం ఆథరైజ్డ్ కాదని ఆర్‌బీఐ చెబుతోంది. ఇలాంటి క్యాష్ ఆన్ డెలివరీ బిజినెస్ ఆథరైజ్డా కాదా చెప్పాలని సమాచార హక్కు చట్టం కింద ఫైల్ అయిన ఓ ప్రశ్నకు ఇది ఆథరైజ్డ్ కాదని ఆర్‌బీఐ సమాధానం చెప్పింది.
వారం, పది రోజులు పడుతుంది
క్యాష్ ఆన్ డెలివరీలో కస్టమర్ ఇచ్చిన డబ్బును కొరియర్ పర్సన్ తీసుకుని దాన్ని ఆఫీస్‌లో చెల్లిస్తాడు. అక్కడి నుంచి వాళ్లు ఈకామర్స సైట్‌కు చెల్లించాలి. ఆ మనీ వచ్చాక సైట్.. వస్తువు అమ్మిన సెల్లర్‌కు డబ్బులిస్తుంది. ఆన్‌లైన్ పేమెంట్ అయితే క్షణాల్లో డబ్బులు ఈకామర్స్ సైట్‌కు వచ్చేస్తాయి. త్వరగా సెల్లర్‌కు ఇస్తారు. సీవోడీలో దీనికి వారం పది రోజులుపైనే పడుతుంది.
ఇంతకీ ఏం తేల్చారు?
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి అగ్రిగేటర్లు లేదా పేమెంట్ ఇంటర్మీడియరీస్.. పీఎస్ఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 8 కింద ఇలా క్యాష్ ఆన్ డెలివరీ చేయడం ఆథరైజ్డ్ కాదని ఆర్‌బీఐ తేల్చిచెప్పింది. కొంత మంది న్యాయనిపుణులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఈ చట్టం ఎలక్ట్రానిక్, ఆన్‌లైన్ పేమెంట్స్ గురించి మాత్రమే చెప్పిందని, క్యాష్ ఆన్ డెలివరీ గురించి ఏమీ చెప్పలేదని, కాబట్టి ఈ సెక్షన్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే ఆర్బీఐ కూడా ఈ విషయంలో ఏమీ స్పష్టమైన సూచనలివ్వలేదు. ఈ చట్టం వల్ల క్యాష్ ఆన్ డెలివరీ అనేది తప్పు అయిపోదని, క్యాష్ ఆన్ డెలివరీ చేసినప్పుడు డబ్బు చెల్లించిన వ్యక్తికి, వస్తువు అమ్మిన వ్యక్తికి ఎలాంటి నష్టం జరగకుండా వ్యవస్థను కరెక్ట్‌గా ఉంచుకుంటే సరిపోతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.