• తాజా వార్తలు

మ‌నోళ్లు లేటెస్ట్ గాడ్జెట్స్ కంటే పాత మోడ‌ల్స్ కొన‌డానికి కారణాలేంటి?

మార్కెట్‌లోకి ఏటా కంపెనీలు త‌మ‌ హైఎండ్‌ ఫ్లాగ్‌షిప్ ఫోన్లను విడుద‌ల చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు నెల‌నెల‌కూ వీటిని రిలీజ్ చేస్తున్నాయి. ఎన్ని హైఎండ్‌ ఫోన్లు వ‌చ్చినా పాత ఫ్లాగ్‌షిప్ మోడ‌ల్స్‌కి ఏమాత్రం డిమాండ్‌ త‌గ్గ‌లేదు. మ‌రీ ముఖ్యంగా మ‌న దేశంలో పాత మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లు మ‌రింత ఎక్కువ‌గా ఉన్నాయంటున్నాయి నివేదిక‌లు. అయితే దీని వెనుక ఉన్న ఆస‌లు కార‌ణాలేమిటో తెలుసుకుందాం!
 
మిడ్ రేంజ్ కంటే బెట‌ర్‌
పాత మోడ‌ల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గిరాకీ ఏర్ప‌డ‌టానికి రెండు కార‌ణాలు ఉండొచ్చంటున్నారు మార్కెట్ అన‌లిస్టులు. ఒక‌టి ఆ డివైజ్ ఘోరంగా విఫ‌ల‌మ‌వ్వాలి. లేదా  అది విడుద‌లై మార్కెట్‌లో ఎక్కువ శాతం అమ్మ‌కాలు జ‌రిగిన ఫోన్ అయినా అయి ఉండాలి. పాత ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌లోనూ హైఎండ్ స్పెషిఫికేష‌న్లు ఉంటాయి. వీటితో పోల్చుకుంటే ధ‌ర చాలా త‌క్కువ కావ‌డంతో మ‌న దేశంలో వినియోగ‌దారులు ఈ పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్ల వైపు ఆకర్షితుల‌వుతున్నారు. గ‌త కొన్నేళ్లుగా పోల్చుకుంటే మిడ్ రేంజ్ మొబైల్స్‌నే ఫ్లాగ్‌షిప్ ఫోన్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ మిడ్ రేంజ్ ఫోన్ల‌ను కొనే కంటే పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్లను కొంటేనే మంచిద‌ని చాలా మంది వినియోగ‌దారులు అభిప్రాయ‌ప‌డుతున్నారని నివేదిక‌లు చెబుతు న్నాయి. 
 
ధ‌ర‌లు ఎంత‌లా ప‌డిపోయాయంటే..
మార్కెట్‌లోని విడుద‌లైన కొద్ది రోజుల‌కే పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధ‌ర‌లు కూడా క్ర‌మ‌క్ర‌మంగా ప‌డిపోతున్నాయి. గ‌త ఏడాది శాంసంగ్ విడుద‌ల చేసిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌8 ధ‌ర రూ. 64,990 ఉంటే, ఇప్పుడు ఇది రూ.45 వేల కంటే త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తోంది. ఇక శామ్‌సంగ్ గెలాక్సీ S9 Plus ధ‌ర రూ. 59,800 ఉంది. ఇక నోకియా 8 ధ‌ర రూ.36, 999 ఉంటే.. ఇప్పుడు రిటైల్‌గా రూ.27వేల కంటే త‌క్కువ‌గా అందుబాటులో ఉంది. బ‌డ్జెట్‌కు అనుగుణంగా, వినియోగ‌దారుల ఆకాంక్ష‌లకు బ‌ట్టి, వ్య‌క్తికీ వ్య‌క్తికీ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలులో అభిప్రాయాలు ఉంటాయ‌ని ప్ర‌ముఖ అన‌లిస్ట్ ప్ర‌భు రామ్ తెలిపారు. కొంతమంది ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌ను కొనేంత స్థాయిలో ఉండ‌క‌పోవ‌చ్చని, అలాగే కొత్త ఫీచ‌ర్లను అంత‌గా ప‌ట్టించుకోక‌పోవ‌చ్చు కానీ త‌మకు వ‌చ్చిన దానితోనే తృప్తిపడ‌తార‌ని వివ‌రిస్తున్నారు అన‌లిస్టులు. 
 
యాపిల్ ఓల్డ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌కు డిమాండ్‌ 
యాపిల్ ఓల్డ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయినా ప‌ర్లేదు వాడేస్తాం అంటున్నారు మ‌నోళ్లు. యాపిల్ ఓల్డ్ జ‌న‌రేష‌న్ ఐఫోన్ల‌కు మ‌న దేశంలో భారీ డిమాండ్ ఉంది.  ఫోన్ కొనేవారి బ‌డ్జెట్ కంటే వీటి ధ‌ర‌ ఎక్కువ‌గా ఉన్నా.. పాత మోడ‌ళ్లు మాత్రం భారీ మొత్తంలోనే అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయి. 2018 రెండో క్వార్ట‌ర్‌లో ఐఫోన్6- 1,30,916 యూనిట్లు, ఐఫోన్ ఎస్ఈ- 89,438 యూనిట్లు, ఐఫోన్ 6ఎస్‌-82,280 యూనిట్ల అమ్మ‌కాలు జ‌రిగాయని సైబ‌ర్ మీడియా రీసెర్చి(సీఎంఆర్‌) నివేదిక తెలిపింది. 
ఐఫోన్ ఎక్స్ లేదా ఐఫోన్ 8 సిరీస్ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లను కొన‌గ‌లిగేంత బ‌డ్జెట్ లేక‌పోవ‌డంతోనే.. ఎక్కువ మంది పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్లు అయిన‌ ఐఫోన్ 6 లేదా ఎస్ఈని ఎంచుకున్నారు. దేశీయ మార్కెట్‌లో ఐఫోన్ 6ఎస్‌(32 జీబీ) ధ‌ర రూ.23, 696, ఐఫోన్ ఎస్ఈ(32 జీబీ) ధ‌ర రూ.20, 419, అలాగే ఐఫోన్ 6ఎస్ ప్ల‌స్ ధ‌ర రూ.36,625గా ఉండ‌గా.. ఐఫోన్‌ X ధ‌ర రూ. 92,430, ఐఫోన్ 8 ధ‌ర రూ.62,999గా ఉంది. 
 
వ‌న‌రులే కీల‌కం
ఐఫోన్‌ను స్టాట‌స్ సింబ‌ల్‌గా భావించే వారు ఎక్కువ‌. అలాంటి వారు త‌మ కోరిక‌, అందుబాటులో ఉన్న వ‌న‌రుల‌ను బట్టి పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయినా కొనేస్తారని ప్ర‌భు వివ‌రించారు. ఆండ్రాయిడ్ విష‌యంలో మాత్రం బ్రాండ్ వాల్యూ అనేది వినియోగ‌దారులు పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్ల వైపు మొగ్గుచూపేలా చేస్తోంద‌ట‌. వీటితో పాటు ప్ర‌తి నెల కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తుండ‌టం కూడా మ‌రో కార‌ణ‌మ‌ట. అయితే త‌మ కోరిక‌ల‌కు అనుగుణంగా ఫోన్ కొనుగోలు చేస్తే.. స్పెసిఫికేష‌న్లు, ఇత‌ర ఫీచర్ల గురించి బాధ‌ప‌డ‌రని ప్ర‌భు వివరించారు.  
 
టాప్ ఫీచ‌ర్లు ఎన్ని ఉన్నా.. 
ప్ర‌స్తుతం కొత్తకొత్త ఫీచ‌ర్ల‌తో స్మార్ట్‌ఫోన్ల‌ను రూపొందించ‌డం మొబైల్‌ కంపెనీల‌కు స‌వాలుగా మారింది. మెరుగైన స్పెసిఫికేష‌న్లు, కెమెరా, స్క్రీన్ సైజ్ ఇలా.. ప్ర‌తి విష‌యంలోనూ అప్‌గ్రెడేష‌న్ జ‌రుగుతూ ఉంటుంది. దీంతో ప్ర‌తిసారీ కొత్త స్పెసిఫికేషన్లు గ‌ల స్మార్ట్‌ఫోన్‌కి మారడం కంటే పాత ఫోన్‌ను లేదా పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఎక్కువ కాలం వినియోగిం చేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. బెజ‌ల్ లెస్ స్క్రీన్‌, స్లో మోష‌న్ వీడియ‌లు రికార్డు చేయ‌గ‌ల కెమెరా, ఇత‌ర టాప్ ఫీచ‌ర్లు ఉన్నా.. ఇవేమీ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ అయ్యేందుకు కార‌ణాలు కావు. ఈ ఫీచ‌ర్లు లేక‌పోయినా సులువుగా ఫోన్ ఉప‌యోగిం చ‌వ‌చ్చు. కొంద‌రు మాత్రం వేగం, బ్రాండ్‌ను అస్స‌లు ప‌ట్టించుకోరు. ఎక్కువ‌గా ఫోన్ ఉప‌యోగించ‌ని వారు, త‌క్కువ స్పెసిఫికేషన్లు ఉన్నా ప‌ర్లేదు అనుకుంటారు. ఇది కూడా పాత మోడ‌ల్ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు కార‌ణం. 
 
ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై పెట్టుబ‌డి వృథా
వివో నెక్స్ ఫోన్ తీసుకుంటే.. ఇందులో ఇన్ డిస్ల్పే ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్, పాప్ అప్ కెమెరా ఉన్నాయి. వీటిని సాధార‌ణ యూజ‌ర్లు ప‌ట్టించుకుంటారా అంటే స‌మాధానం దొర‌క‌దు. దీని ధ‌ర రూ.44,990. ఈ ఫీచ‌ర్లు లేకుండా వివో ఎక్స్ 21 మోడ‌ల్ ఫోన్ రూ.35,990కే అందుబాటులో ఉంది. గ‌త ఏడాది విడుద‌లైనా షియామీ ఎంఐ మిక్స్‌2 ఫోన్ ఇప్ప‌టికీ మంచి మోడ‌ల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. బెజ‌ల్ లెస్ స్క్రీన్‌, స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ గ‌ల ఈ ఫోన్ రూ.24,999కే మార్కెట్‌లో ల‌భిస్తోంది. మ‌రి ఇలాంట‌ప్పుడు అప్‌గ్రేడ్ అవ్వాల్సిన అవ‌సరం ఇంకే ముంది! ఆశలు త‌క్కువ‌గా ఉండి, బ‌డ్జెట్ క‌నుక ప్ర‌థ‌మ ఆప్ష‌న్ అయితే ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌పై పెట్టుబ‌డి పెట్ట‌డం వృథా అని, దీని బ‌దులు మామూలు స్మార్ట్‌ఫోన్ తీసుకుంటే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఇది పూర్తిగా వినియోగదారు డిపైనే ఆధార‌ప‌డి ఉంటుందని చెబుతున్నారు.

జన రంజకమైన వార్తలు