ఈ-కామర్స్ కంపెనేలు ఒకరిపై ఒకరి దుష్ప్రచారం అబద్రతా భావనలో ఉద్యోగులు
ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ తన ఉద్యోగులను తీసేస్తోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సంస్థకు చెందిన 600 మందికి ఇప్పటికే పింక్ కార్డులు ఇష్యూ చేసిందన్న సమాచారం పొక్కడంతో మిగతా ఉద్యోగులు నిరసన బాట పడుతున్నారు. గుర్గావ్ లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. రోజంతా మండుటెండలో నిల్చుని ఆందోళన చేశారు. అయితే.. కంపెనీ వర్గాలు మాత్రం సిబ్బందిని తొలగించామనడం అవాస్తమంటూ కొట్టిపారేస్తున్నాయి. ఈ-కామర్స్ లో దూసుకుపోతున్న స్నాప్ డీల్ తమ కస్టమర్ కేర్ విభాగ సిబ్బంది పనితీరుపై ఇటీవల మైక్రో లెవల్ లో అధ్యయనం చేసిందట. సుమారు 1000 మంది పనితీరును నిశితంగా పరిశీలించి వారంతా సంస్థ లక్ష్యాల ప్రకారం ఆశించిన పనితీరు కనబరచడం లేదని తేల్చిందట. పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్ కిందట వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి రెడీ అయింది. అందులో భాగంగానే వారందరినీ ప్రత్యేక తరగతులకు రావాలని హుకుం జారీ చేసింది. ఆ తరగతులకు అటెండ్ కావడానికి చాలామంది నిరాకరించారు. మరోవైపు ఇలాంటి కారణాలతో 600 మందిని స్నాప్ డీల్ తొలగించిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వెంటనే ఉద్యోగుల నుంచి ఆందోళన మొదలైంది. దీంతో కంపెనీ వర్గాలు మీడియా ముందుకొచ్చి ఏం జరుగుతోందనేది చెప్పుకొచ్చాయి. పనితీరు మెరుగుపరుచుకోవడానికి కొందరికి శిక్షణ ఇవ్వాలనుకున్నామని... అందుకు కొందరు నిరాకరించారని... ఎవరినీ ఉద్యోగాల్లోంచి తీసేయలేదని ప్రకటించారు. సిబ్బంది తొలగింపు వార్తలన్నీ అసత్యాలని చెప్పారు. మరి కంపెనీ నిజాలను దాస్తోందా....? లేదంటే ఈ-కామర్స్ రంగంలో పోటీ కారణంగా ప్రత్యర్థి సంస్థలు ఇలా దుష్ర్పచారం చేస్తున్నాయా అన్నది తెలియాల్సి ఉంది. |