స్నాప్ చాట్ సీఈవో అప్పుడెప్పుడో రెండేళ్ల కిందట చేసిన భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు ఇప్పుడు బయటపడడం... భారతీయ నెటిజనులు, టెకిజనులు స్నాప్ చాట్ సీఈవో తీరుపై మండిపడుతూ ఆ యాప్ ను తమ ఫోన్ల నుంచి డిలీట్ చేస్తుండడం తెలిసిందే. యాప్ స్టోర్లలో స్నాప్ చాట్ కు నెగటివ్ రివ్యూలు రాస్తూ, స్టార్ రేటింగ్ తక్కువ ఇస్తూ తమ దేశభక్తి మిళితమైన ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. అయితే.... స్నాప్ చాట్ తో ఏమాత్రం సంబంధం లేని ఈ-కామర్స్ వెబ్ సైట్ స్నాప్ డీల్ పైనా కొందరు మండిపడుతున్నారు. స్నాప్ చాట్, స్నాప్ డీల్ రెండూ ఒకే సంస్థకు చెందినవిగా భావిస్తున్నవారు కొందరైతే... అసలు, స్నాప్ డీల్ తప్ప స్నాప్ చాట్ అన్నది కూడా ఒకటుందని తెలియకపోవడం మరో కారణం.మొత్తనికి కారణమేదైనా కానీ స్నాప్ డీల్ కు మాత్రం భారీ నష్టం కలుగుతోంది.
ఇండియాలో స్నాప్ చాట్ కు పెద్దగా ఆదరణ లేదు. నగరాల్లో మాత్రమే పరిమిత స్థాయిలో దీని వినియోగం ఉంది. అదేసమయంలో ఈ-కామర్స్ సైట్ అయిన స్నాప్ డీల్ కు మంచి ఆదరణ ఉంది. దీంతో భారతీయుల్లో అత్యధికులకు స్నాప్ డీల్ తెలిసినంతగా స్నాప్ చాట్ తెలియదు. ఈ వివాదం గురించి కూడా పూర్తిగా తెలుసుకోకుండా సోషల్ మీడియాలో అరకొరగా వచ్చే సమాచారం ఆధారంగా వారు రెస్పాండ్ అవుతూ స్నాప్ చాట్ పై కోపాన్ని స్నాప్ డీల్ పై చూపిస్తున్నారు. ఆ వేడిలో తమ ఫోన్ల నుంచి స్నాప్ డీల్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేస్తున్నారట. స్నాప్ చాట్ తో పాటు స్నాప్ డీల్ కు కూడా నెగటివ్ గా ప్లేస్టోర్లలో రివ్యూలు రాస్తున్నారు.
తాను చేయని తప్పులకు కూడా తీవ్ర మూల్యం చెల్లించుకోవడమన్నది స్నాప్ డీల్ కు ఇంతకుముందు కూడా అనుభవమే. ఇంతకుముందు స్నాప్ డీల్ కు ప్రచారకర్తగా వ్యవహరించిన ప్రసిద్ధ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అమీర్ ఖాన్ ప్రచారకర్తగా వ్యవహరించిన పాపానికి స్నాప్ డీల్ పై విపరీతమైన దుష్రప్రచారం జరిగింది. రేటింగులు దారుణంగా పడిపోయాయి. దాన్నుంచి కోలుకుని మళ్లీ విశ్వాసం సంపాదించుకోవడానికి స్నాప్ డీల్ కు చాలాకాలం పట్టింది. ఇంతలోనే స్నాప్ చాట్ రూపంలో మరోసారి స్నాప్ డీల్ కు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలో తీరని నష్టం జరుగుతోంది.