• తాజా వార్తలు

ఇకపై దేవుడికి ద‌క్షిణా పేటీఎంతోనే..

నోట్ల ర‌ద్దు పుణ్య‌మా అని ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌కు బాగానే ఊపొచ్చింది. డిజిట‌ల్ లావాదేవీల‌కు జనం అల‌వాటుప‌డ్డారు. చాలాచోట్ల పాల‌బూత్‌లు, కూర‌గాయ‌ల దుకాణ‌ల్లోనూ పేటీఎం, ఫ్రీఛార్జి లాంటి మొబైల్ వాలెట్ల‌తో ట్రాన్సాక్ష‌న్లు చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో న‌గ‌దు ల‌భ్య‌త బాగానే పెర‌గ‌డంతో డిజిటల్ ట్రాన్సాక్ష‌న్ల అవ‌స‌రం కొంత త‌గ్గినా ఇప్ప‌టికే అల‌వాటుప‌డిన‌వారు చాలా మంది వీటిని కంటిన్యూ చేస్తున్నారు. పెద్ద రద్దు సంద‌ర్భాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న‌ పేటీఎంతోపాటు ఫ్రీఛార్జి వంటి మొబైల్ వాలెట్లు మ‌రో అడుగు ముందుకేశాయి. లేటెస్ట్‌గా గుడిలో దేవుడికి వేసే కానుక‌లు కూడా త‌మ వాలెట్‌తో చెల్లించే సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. దేశంలోని 30 దేవాల‌యాల్లో ఇప్ప‌టికే పేటీఎంతో దేవుళ్ల‌కు కానుక‌లు చెల్లిస్తున్నారు. ముంబ‌యిలో పేరొందిన సిద్ధివినాయ‌క ఆల‌యం, ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్‌, కాన్పూర్‌లోని భ‌జ‌రంగ‌భ‌ళి మందిర్‌, జ‌లంధ‌ర్‌లోని గాడ్ ఈజ్ లైట్ చ‌ర్చిల్లో పేటీఎంతో కానుక‌లు చెల్లించే సౌక‌ర్యం అందుబాటులోకి తెచ్చారు.

ఫ్రీఛార్జితోనూ..

ఢిల్లీలోని హజ‌ర‌త్ నిజాముద్దీన్ ద‌ర్గాలో కానుక‌ల‌ను ఫ్రీఛార్జి ద్వారా చెల్లించే ఏర్పాటు చేశారు. కృష్ణుడి జ‌న్మ‌స్థాన‌మైన వృందావ‌న్ మ‌ధుర‌లోని దాదాపు 700 అడుగుల ఎత్తున నిర్మించ‌బోతున్న వృందావ‌న్ చంద్రోద‌య్ మందిర్‌లోనూ ఫ్రీచార్జితో దేవుడికి కానుక‌లు వేయొచ్చు. డిజిటల్ విప్ల‌వాన్ని, క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్ల అవ‌స‌రాన్ని మేం గుర్తించాం.. కాబ‌ట్టి అన్ని ఈ వాలెట్ ఫ్లాట్‌ఫార‌మ్స్ ద్వారా కానుక‌లు వేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నాం అని వృందావ‌న్ చంద్రోద‌య్ మందిర్ వైస్ ప్రెసిడెంట్ భ‌ర‌త్‌రిషబ్ దాస చెప్పారు.

టెక్నాల‌జీ ఇంత‌కు ముందే ఉంది..

కానుక‌లు ఈ వాలెట్ల ద్వారా వేయ‌డం కొత్తేమో కానీ దేవ‌స్థానాల్లో టెక్నాల‌జీ వినియోగం చాలాకాలంగానే ఉంది. ఆన్‌లైన్‌లో డ‌బ్బులు చెల్లిస్తే ఇంటికే ప్ర‌సాదం పంప‌డం, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆన్‌లైన్‌లోనే స్పెష‌ల్ ద‌ర్శ‌నం, సేవా టికెట్లు బుక్ చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించ‌డం వంటివి టెక్నాల‌జీలో భాగ‌మే.

2 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మార్కెట్

ఇండియాలో దేవుడి చుట్టూ అల్లుకున్న మార్కెట్ విలువ 2 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పైమాటే. దీనిలో అత్య‌ధిక భాగం భక్తులు దేవుడికి చెల్లించే కానుక‌లే. ఒక్క తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడికే ఏటా వెయ్యి కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు హుండీ ఆదాయం వ‌స్తుంది. వీధి చివ‌ర ఉన్న గుడి ద‌గ్గ‌ర నుంచి ప్ర‌సిద్ధ దేవ‌స్థానాల వ‌ర‌కు హుండీ ఆదాయం ల‌క్ష‌లు, కోట్ల‌లో ఉంటుంది. డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న నేప‌థ్యంలో ఆధ్యాత్మిక మార్కెట్‌లోనూ మొబైల్ వాలెట్లు చోటు ద‌క్కించుకుంటున్నాయి. దేవుడికి చెల్లించే కానుక‌ల‌ను పేటీఎం ద్వారా చెల్లించే ఏర్పాట్లు ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. గ‌డిచిన కొన్ని నెల‌లుగా చాలా దేవాల‌యాల్లో పేటీఎం వాలెట్ల ద్వారా కానుక‌లు స్వీక‌రిస్తున్నార‌ని పేటీఎం సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ కిర‌ణ్ వాసిరెడ్డి చెప్పారు. "ప్ర‌జ‌లు క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్ల‌కు ఎంత త్వ‌ర‌గా అల‌వాటు ప‌డ్డారో చెప్ప‌డానికి ఇదో ఉదాహ‌ర‌ణ‌. దేశవ్యాప్తంగా గుళ్లు, ప్రార్థ‌నా మందిరాల్లో క్యాష్‌లెస్ ప‌ద్ధ‌తిలో కానుకలు చెల్లించేందుకు పేటీఎం ఏర్పాట్లు చేస్తుంది అన్నారు. ప్ర‌స్తుతం మొబైల్ వాలెట్ల ద్వారా కానుక‌ల చెల్లింపు నామ‌మాత్రంగానే ఉండొచ్చు, కానీ రానున్న నాలుగైదేళ్ల‌లో డిజిట‌ల్ డొనేష‌న్లు బాగా పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నామ‌ని

రిటైల్ క‌న్సల్టెన్సీ టెక్నోపాక్ ఛైర్మ‌న్ అర్వింద్ సింఘాల్ చెప్పారు. ఎందుకంటే గుళ్లు, మ‌సీదులు వంటి ప్రార్థ‌నా మందిరాల్లో ఎక్కువ మంది 10 నుంచి 50 రూపాయ‌ల్లోపే కానుక‌లు వేస్తుంటారు. ఇవి చిన్న మొత్తాలే కాబ‌ట్టి పేటీఎం, ఫ్రీఛార్జి వంటి ఈ వాలెట్ల‌తో చెల్లించ‌డం సుల‌భ‌మ‌ని ఆయ‌న వివ‌రించారు.

జన రంజకమైన వార్తలు