ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ ఫ్లాట్‌ఫాం స్విగ్గి దూసుకెళుతోంది. ఇటీవలే మార్కెట్లో పుంజుకుంటున్న స్విగ్గి ఒక్క ఏప్రిల్‌లోనే రికార్డు స్థాయిలో ఆర్డర్లు సాధించింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే స్విగ్గి మిలియన్ ఆర్డర్లు సొంతం చేసుకుంది. 2014లో తమ సంస్థ నెలకొల్పాక ఈ మైలురాయి సాధించడం స్విగ్గికి ఇదే తొలిసారి. భారత్‌లో ఒక ఫుడ్ డెలివరీ వెంచర్ ఇన్ని ఆర్డర్లు సాధించడం కూడా ఇదే తొలిసారి. దేశ వ్యాప్తంగా స్విగ్గి ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంకి 5500 రెస్టారెంట్లు అనుసంధానమై ఉన్నాయి. ఒక్క ఏప్రిల్‌లోనే ఈ సంస్థ రోజుకు 35,500 ఆర్డర్లు సంపాదించింది. మార్చి నెలతో పోలిస్తే ఈ ఆర్డర్లు 25 శాతం ఎక్కువ. టెక్ బేస్డ్ డెలివరీ విధానం, ఆర్డర్స్ లైవ్ ట్రాకింగ్, 4200 మంది డెలివరీ బాయ్స్ సహకారంతో ఇది సాధ్యమైందని స్విగ్గి సగర్వంగా తెలిపింది. ఎక్కువ డిస్కౌంట్లు లేదా ఆఫర్లతో తాము వినియోగదారులను సంఖ్యను పెంచుకోలేదని, వీలైనంత నిజాయితీగా ఉండి ఈ ఘనత సాధించామని ఆ సంస్థ తెలిపింది. తమకు రిపీటెడ్ కస్టమర్ల సంఖ్య ఎక్కువగా ఉందని, ప్రతి నెల కనీసం ఒక కస్టమర్ దగ్గర నుంచి ఐదు ఆర్డర్లు వస్తున్నాయని ఆ సంస్థ పేర్కొంది. తమ సంస్థ నెలకొల్పిన ఎనిమిది నగరాల్లో బెంగళూరు, ఢిల్లీ, ముంబయి నగరాల్లో తమ సంస్థ లాభాల్లో నడుస్తోందని తెలిపింది. త్వరలో మిగిలిన నగరాల్లోనూ లాభాలు అందుకుంటామని తెలిపింది. ఇప్పటికే స్విగ్గి యాప్‌ను మిలియన్ మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. తమకు అందుతున్న ఆర్డర్లలో 70 శాతం ఆర్డర్లు యాప్ నుంచే వస్తున్నాయట. స్విగ్గి యాప్‌ను ఐఐటీ, బిట్స్ పిలానికి చెందిన శ్రీహర్ష, రాహుల్ తయారు చేశారు. ఆర్డర్ల కోసం టినీ ఓల్, జొమాటా, ఫుడ్ పాండా లాంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కష్టపడుతుంటే.. స్విగ్గి మాత్రం అలవోకగా ఒక్కో మెట్టూ ఎక్కుతోంది. స్విగ్గి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించింది. ఆ సంస్థ జనవరిలో 35 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించింది. ఆర్డర్లు ఎక్కువగా లేకపోవడంతో టినీ ఓల్ కంపెనీ ఈ నవంబర్‌లో 4 నగరాల్లో కార్యకలాపాలు నిలిపి వేసింది. అంతేకాదు 112 మంది ఉద్యోగులను తొలగించింది. అంతకుముందు కూడా ఈ సంస్థ 200 మంది ఉద్యోగులను తీసేసింది. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ సంస్థ డాజో ఇప్పటికే మూతపడింది. జొమటొ కూడా దాదాపు 300 మంది ఉద్యోగులను తీసేసింది. చాలా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ సంస్థలు ఎక్కువగా ఆఫర్లు ఇవ్వడంపైనే దృష్టి సారించాయని.. కానీ తాము క్వాలిటీ, సమయపాలనపై దృష్టి పెట్టామని స్విగ్గి తెలిపింది. |