ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్న ఫుడ్ డెలివరీ యాప్‌లలో స్విగ్గీ ఒకటి. గతేడాది అనుకున్నంతగా లాభాలు గడించలేకపోయిన ఈ సంస్థ.. 2020లోనూ కొత్త టార్గెట్లు పెట్టుకుంది. అయితే రెస్టారెంట్లకు రాయితీ ఇవ్వాలంటే డెలివరీ ఫీజులను పెంచి కస్టమర్లపై భారం వేస్తోందీ సంస్థ. తాజాగా స్విగ్గీ సూపర్‌లో ఫ్రీ డెలివరీ ఇకపై ఎక్స్‌పెన్సీవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
79 కాదు 149!
ఇకపై స్విగ్గి సూపర్ ప్లాన్ ఇప్పటిదాకా 79 రూపాయిలు ఉంటే.. ఈ ధరను డబుల్ పెంచేసింది స్విగ్గి. అంటే ఇకపై సూపర్ ప్లాన్ కావాలంటే 149 రూపాయిలు కట్టాల్సిందే. ఇదే కాదు మూడు నెలల ప్లాన్ 179 నుంచి ఏకంగా 349కి మారిపోనుంది. ఈ కొత్తగా వచ్చిన ప్లాన్లు ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు కూడా అమలు కానున్నాయి. మళ్లీ రెన్యువల్ చేసుకునే సమయంలో వారికి ఈ ధరలు వర్తిస్తాయి. జనవరి 8 నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.
ఫస్ట్ టైమ్ యూజర్‌కి?
తొలిసారి స్విగ్గి సూపర్ ప్లాన్‌ను ఉపయోగించుకునే సబ్‌స్కైబర్లకు మాత్రం స్విగ్గీ పాత ఛార్జ్ రూ.79 మాత్రమే వర్తింపజేయనుంది. మూడు నెలల ప్లాన్ తీసుకుంటే రూ.179 వసూలు చేయనుంది. అయితే ఇలా ధరలు పెంచినంత మాత్రన కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు చెల్లించే డబ్బులకు సరిపడా ఆఫర్లు, డిస్కౌంట్లు తాము రీబ్యాక్ చేస్తామని స్విగ్గీ ట్విటర్ ద్వారా తెలియజేసింది. గత ఏడాది 2367 కోట్లు నష్టపోయామని.. అంతకుముందు సంవత్సరం 385 కోట్లు నష్టం వచ్చిందని ఈ నష్టాలను పూడ్చుకోవడానికే తాము ప్రయత్నిస్తున్నట్లు ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది.