ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ గురించి తెలిసినవారందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు స్విగ్గీ. ఇండియాలో టాప్ మోస్ట్ యూజ్డ్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీనే. అయితే జొమాటోతో పోల్చితే స్విగ్గీలో ఆఫర్లు తక్కువే. ఛార్జీలు కూడా ఎక్కువే ఉంటాయని సగటు యూజర్ టాక్. దీనికితోడు ఇప్పుడు స్విగ్గీ రెస్టారెంట్ల దగ్గరా భారీగా కమీషన్ లాగేస్తోంది. మరోవైపు కస్టమర్లపైనా చార్జీల భారం పెంచుతోంది.
ఇలా పెంచేస్తోంది
సాధారణంగా ఒక రెస్టారెంట్ స్విగ్గీతో టై అప్ కావాలంటే 12 నుంచి 18 నెలల కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలి. ఈ పిరియడ్ పూర్తయ్యాక ఇద్దరికీ ఓకే అనుకుంటే మరో ఏడాది పెంచుతారు. అయితే మొదట కాంట్రాక్ట్ కుదుర్చకున్నప్పుడు ఆర్డర్ వాల్యూలో రెస్టారెంట్ 12 నుంచి 18 శాతం స్విగ్గీకి ఇవ్వాలి. కాంట్రాక్ట్ పెంచుకున్నప్పుడు మాత్రం ఈ అమౌంట్‌ను 18 నుంచి 23%కి స్విగ్గీ పెంచేసిందని బెంగళూరులోని ఓ రెస్టారెంట్ యజమాని చెప్పారు. కాదంటే కాంట్రాక్ట్ లేదని ఖరాకండీగా చెప్పేస్తున్నారని ఆవేదన తెలిపారు.
డిమాండ్ ఉంటే పండగే
ముఖ్యంగా ఏయే ప్రాంతాల్లో స్విగ్గీ సర్వీస్‌కు డిమాండ్ ఉందో అక్కడ రెస్టారెంట్ యజమానుల నుంచి భారీగా కమీషన్ రాబట్టాలన్నది స్విగ్గీ ప్లాన్. అంతేకాదు ఆయా రెస్టారెంట్ యజమానులను తమ ఫ్లాట్‌ఫాం పైన యాడ్స్ కూడా ఇచ్చుకోవాలని ఒత్తిడి తెస్తోంది. అక్కడితో ఆగలేదు కస్టమర్లక డెలివరీ ఛార్జీలు కూడా పెంచుకుంటూ పోతోంది. అంటే ఒకేసారి అటు రెస్టారెంట్ ఓనర్‌ను, ఇటు కస్టమర్‌ను ఇద్దరినీ బాదేస్తుందన్నమాట.
వ్యాపార సూత్రం అంటోన్న స్విగ్గీ
ఒక రెస్టారెంట్ మార్కెట్ మెచ్యూరిటీకి అంటే ఫస్ట్ కాంట్రాక్ట్ పూర్తయ్యాక కమీషన్ ఎక్కువ తీసుకుంటామని స్విగ్గీ చెబుతోంది. ఇది తమ వ్యాపారసూత్రమని చెబుతోంది. రెస్టారెంట్ స్థాయి, డిమాండ్, ఆ ఏరియాలో స్విగ్గీకున్న ఆదరణ ఇవన్నీ లెక్కగట్టి కమీషన్ నిర్ణయిస్తామంటోంది. గడిచిన అక్టోబర్‌లో స్విగ్గీ 50 కోట్ల ఫుడ్ డెలివరీలు చేసింది. దేశంలోని మిగిలిన అన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నీ కలిపి కూడా ఇంత చేయలేకపోయాయి. అందుకే స్విగ్గీ 60% మార్కెట్ షేర్‌తో ఈ రంగంలో ఆధిపత్యం చలాయిస్తోంది. ప్రస్తుతం స్విగ్గీ మార్కెట్ వాల్యూ 23,468 కోట్ల రూపాయలు. స్విగ్గీ త్వరలో మరిన్ని కొత్త సర్వీసులు తీసుకురాబోతోంది. అంతేకాదు ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి స్విగ్గీ మనీ పేరుతో వాలెట్‌ను కూడా తీసుకురాబోతోంది. అందుకే రెవెన్యూ పెంచుకోవడానికి ఛార్జీల భారం పెంచుతోంది అని మార్కెట్ వర్గాల టాక్.