నడుస్తున్నఎలక్ట్రానిక్ యుగంలో అన్ని పనులు ఆన్‌లైన్‌లోనే అయిపోతున్నాయి. మన చేతిలో డబ్బులు లేకపోయినా.. మొబైల్ ఈ-వాలెట్‌లోకి కార్డు నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకుని మనకు అవసరమైన కార్యకలాపాలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో చాలా ఈ-వాలెట్ సౌకర్యాన్ని అందించడానికి చాలా ఫ్లాట్‌ఫామ్స్ వచ్చేశాయి. రోజుకు కోట్ల రూపాయిల్లో ఈ-వాలెట్‌ల ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ ఈ-వాలెట్‌ల ద్వారా ఇక భవిష్యత్‌లో రుణాలు కూడా పొందొచ్చట. పేటీఎమ్, మొబిక్‌విక్, పేవరల్డ్ లాంటి ఈవాలెట్ సర్వీసును అందిస్తున్న ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్ ఇకపై తమ వినియోగదారులకు రుణాలు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రతిరోజూ రూ.49,000 కోట్ల రూపాయిల విలువ చేసే 39.49 మిలియన్ల ట్రాన్సాక్షన్లు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతున్నాయని ఒక సర్వేలో తేలింది. అలాగే రోజు రోజుకీ ఈ వాలెట్ కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయని, ప్రస్తుతానికి రోజుకు రూ.1200 కోట్ల వ్యాపారం వీటి మీదే నడుస్తోందని ఈ సర్వే తెలియజేసింది. ఐతే ఈ వాలెట్ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి పేటీఎమ్ లాంటి సంస్థలు కొత్త ఆలోచనలు చేస్తున్నాయి. అందులో కీలకమైంది ఈ-వాలెట్ ద్వారా వినియోగదారులకు లోన్లు ఇవ్వడం. మొదట్లో రూ.100 నుంచి 500 వరకు లోన్లు ఇస్తామని ఈ ఈ-వాలెట్ సంస్థలు తెలిపాయి. ఒకసారి ఈ ప్రయోగం విజయవంతం అయ్యాక ఈ లోన్లను రూ.5000 వరకు పెంచుతామని మొబిన్‌విక్ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు బిపిన్ ప్రీత్ సింగ్ చెప్పాడు. అర్హుడైన వినియోగదారులు అప్పటికప్పుడు ఈ లోన్ సదుపాయాన్ని పొందచ్చట. ఈ నేపథ్యంలో మొబైల్ ఈ వాలెట్ సౌకర్యాన్ని అందిస్తున్న సంస్థలు కమర్షియల్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఐతే ఒకసారి లోన్ ఇచ్చేముందు ఈ వాలెట్ సంస్థలు వినియోగదారుల ఆర్థిక చరిత్రను పరిశీలిస్తాయి. ఈ ఏడాది ఆఖరిలోగా పూర్తి స్థాయిలో ఈ వాలెట్ లోన్ సౌకర్యాన్ని అమలులోకి తేవాలని పేటీఎమ్, మొబిన్‌విక్ తదితర సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇలా తీసుకున్న లోన్లను 15 నుంచి 30 రోజులలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. |