మొబైల్ యాప్ అంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి. యాప్‌లో ఉన్న ఇబ్బందులను తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం, బగ్ ఫిక్స్ చేసి సెక్యూరిటీపరంగా మరింత మెరుగ్గా తయారుచేయడమే అప్‌డేట్ టార్గెట్. బ్యాంకు అకౌంట్ల మధ్య మనీ ట్రాన్స్‌ఫర్ కోసం తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) యాప్‌లకు మాత్రం అప్‌డేట్ భాగ్యమే కనిపించడం లేదు. 50 శాతానికి పైగా యాప్‌లను గడిచిన 50 రోజుల్లో ఒక్కసారి కూడా అప్‌డేట్ చేయలేదు. ఇది యూపీఐ యాప్ యూజర్లకు అసహనం తెప్పించడమేనంటున్నారు నిపుణులు. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై 38 యూపీఐ యాప్ లు ఉన్నాయి. జనవరి 25 నాటికి వీటిలో సగం యాప్ లు యాప్ వింటేజ్ లో ఉన్నాయని క్యాష్‌లెస్ కన్జ్యూమర్ అనే సంస్థ వెల్లడించింది. చాలా రోజులుగా యాప్ అప్‌డేట్ కాని పొజిషన్‌ను యాప్ వింటేజ్ అంటారు. 38 యాప్‌ల్లో సగం గత 50 రోజుల్లో ఒక్కసారి కూడా అప్‌డేట్ కాలేదు. ఇందులో ఆరు యాప్‌లు అప్‌డేట్ అయి 5 నెలలవుతుంది.
డీమానిటైజేషన్ నేపథ్యంలో అకౌంట్ టు అకౌంట్ మనీ ట్రాన్స్‌ఫర్ తోపాటు డిజిటల్ ట్రాన్సాక్షన్‌ను సులువుగా చేసుకోవడానికి దాదాపు అన్ని బ్యాంకులూ యూపీఐలను తీసుకొచ్చాయి. అయితే వీటిని ఎప్పటికప్పడు అప్‌డేట్ చేయకపోవడం కస్టమర్లను ఇరిటేట్ చేయడమేనని క్యాష్‌లెస్ కన్జ్యూమర్ చెప్పింది.
ఈ యాప్‌లు మరీనూ..
యూకో బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ లతోపాటు మరో నాలుగు బ్యాంకుల యూపీఐ యాప్‌లు 150 రోజులుగా అప్‌డేట్ కాలేదు. అంటే 5 నెలలన్నమాట. దీనివల్ల యాప్ యూజర్‌కి యాప్ సెక్యూరిటీ మీద, పనితీరు మీద కాన్ఫిడెన్స్ తగ్గుతుందని .. యాప్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఇది దేశంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్ల పై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతుందని క్యాష్‌లెస్ కన్జ్యూమర్ అభిప్రాయం.
భీమ్ కూడా..
కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన భీమ్ యాప్ కూడా యూపీఐదే. సెంట్రల్ గవర్నమెంట్ ఇనీషియేషన్‌తో లాంచ్ అయిన ఈ యాప్‌ను చాలా మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌కూడా జనవరి 25 నాటికి 20 రోజుల యాప్ వింటేజ్‌లో ఉందని క్యాష్‌లెస్ కన్జ్యూమర్ చెప్పింది. అయితే ఎన్‌పీసీఐ ఉన్నతాధికారి హోతా చెబుతూ డిసెంబర్ 30న భీమ్ లాంచింగ్ నుంచి ఇప్పటికి రెండుసార్లు అప్‌డేట్ చేశామని చెప్పారు. అపరిచిత వ్యక్తులు మనీ కావాలని రిక్వెస్ట్‌లు పంపడానికి వీల్లేకుండా స్పామ్ రిపోర్ట్ అనే కొత్త ఫీచర్‌ను కూడా యాడ్ చేశామన్నారు.
అలాగైతే కష్టమే..
పేటీఎం, మొబీక్విక్ లాంటి మొబైల్ వాలెట్ల నుంచి ఏదైనా అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా, ఏదైనా బిల్ పేమెంట్, పర్చేజ్ చేయాలన్నా ముందు వాలెట్‌ను వేరే అకౌంట్ నుంచి మనీ వేయాలి. యూపీఐ యాప్‌లతో అయితే నేరుగా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ లేదా అకౌంట్ టు మర్చంట్ పేమెంట్ చేసేసుకోవచ్చు. ఈ సౌలభ్యాన్ని ఉపయోగించి బ్యాంకు కస్టమర్లను ఆకట్టుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) యూపీఐ యాప్‌ల కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. అయితే ఈ యాప్‌లన్నీ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాం పై పనిచేసేవే. వీటిలో టెక్నాలజీ చాలా త్వరగా మారిపోతుంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు అప్‌డేట్ అనేది అత్యవసరం. కానీ బ్యాంకులు ఇంకా సాంప్రదాయ పద్ధతుల్లోనే ఉండి టెక్నాలజీ అప్‌డేట్ చేసుకోలేకపోతే యూపీఐ యాప్‌లు మొబైల్ వాలెట్ల మాదిరిగా కస్టమర్లను ఆకట్టుకోలేవని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇప్పటికే పెద్దగా ఆదరణ లేని యూపీఐ యాప్‌లు ఇక అప్‌డేట్ కూడా నెలల తరబడి ఉండదనే అభిప్రాయపడితే ఇంకా వెనకబడిపోతాయని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.