ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం.. ఇప్పుడు ఇది చాలా కామన్ విషయం. జొమాటో, స్విగ్గీ, ఉబర్ ఇట్స్ ఇలా చాలా యాప్‌లు జనాలకు నేరుగా ఫుడ్‌ని డోర్ డెలివరీ చేయడానికి వచ్చేశాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవి పోటీపడి మరి డిస్కౌంట్లు ఇవ్వడంతో జనం కూడా పోటీపడి మరి ఆర్డర్లు ఇస్తున్నారు. కానీ త్వరలోనే ఈ ఫుడ్ యాప్‌లన్నీ డిస్కౌంట్స్ ఆపేయబోతున్నాయా? ..రెస్టారెంట్లు ఈ డిస్కౌంట్లకు ఒప్పుకోవట్లేదా?
1200 రెస్టారెంట్లకుపైగా..
తాజాగా భారత్ వ్యాప్తంగా 1200 రెస్టారెంట్లు ఈ డైన్ ఇన్ ప్రొగ్రామ్ నుంచి తప్పుకున్నాయని వార్తలు వచ్చాయి. జొమాటో, స్విగ్గి లాంటి ఫుడ్ యాప్‌ల వల్ల చాలా రెస్టారెంట్లకు బాగా నష్టాలు రావడమే దీనికి కారణమని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లతో తెగదెంపులు చేసుకోవాలని చాలా రెస్టారెంట్లు నిర్ణయం తీసుకున్నాయట. జాతీయ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న రెస్టారెంట్లు లాగౌట్ కంపైన్ మొదలుపెట్టాయి. దీని ప్రకారం ఈ రెస్టారెంట్లన్నీ ఫుట్ డెలివరీ యాప్‌లతో కటీఫ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి.
నాన్ యూనిఫామ్ కమిషన్స్
ఫుడ్ డెలివరీ యాప్‌లు అనవసమైన కమిషన్‌లు వేసి తమపై భారం పెంచుతున్నాయని రెస్టారెంట్లు ఆరోపిస్తున్నాయి. పారదర్శకమైన వ్యవస్థ ఉండాలని జాతీయ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు విన్నవించాయి. బిజినెస్ ను బట్టి మాత్రమే పన్నులు వేయాలని, కమిషన్‌లు తీసుకోవాలని రెస్టారెంట్లు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో డైన్ అవుట్, ఈజీ డిన్నర్, నియర్ బై లాంటి యాప్‌లతో జాతీయ రెస్టారెంట్ అసోసియేషన్ ఒక ఒప్పందం చేసుకుంది. డిస్కౌంట్లను తగ్గించేందుకు ఈ యాప్‌లు అంగీకరించినట్లు ఈ సంస్థ తెలిపింది.