బ్యాంకులో డబ్బులు ఉంచుకోవడం లేదా...అయితే మీరు ఇకపై తప్పనిసరిగా బ్యాంకులో డబ్బులు ఉంచుకోవాలి. కేంద్రం నుంచి అందుకునే బెనిఫిట్స్ కోసం అకౌంట్లు మినిమం రూ.12 బ్యాలన్స్ ఉండేలా చూసుకోవాలి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అనేక రకాల స్కీములు మీకు అందాలంటే మీకు అకౌంట్లో రూ. 12 ఉండాలని చెబుతున్నారు. మే 31న మీ అకౌంట్‌లో కొంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. దీంతో మీకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పాలసీల ప్రీమియం మే 31న అకౌంట్ల నుంచి డెబిట్ అవుతుంది. బ్యాంకులు ఇప్పటికే కస్టమర్లకు దీనికి సంబంధించి అలర్టులు పంపాయి.
మే 31న డబ్బులు లేకపోతే
ఒకవేళ మీ అకౌంట్‌లో మే 31న డబ్బులు లేకపోతే మీరు ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) స్కీమ్స్ ప్రయోజనాలు పొందలేరు. పీఎంఎస్‌బీవై కింద పాలసీదారులకు రూ.2 లక్షల కవరేజ్ లభిస్తుంది. దీనికి సంవత్సరానికి రూ.12 ప్రీమియం చెల్లించాలి. పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు, అంగవైకల్యానికి రూ.1 లక్ష ఇన్సూరెన్స్ మొత్తం వస్తుంది. పీఎంజేజేబీవై అనేది జీవిత బీమా పాలసీ. పాలసీదారుడు చనిపోతే నామినీకి రూ.2 లక్షలు అందుతాయి. 55 ఏళ్ల వరకు పాలసీ వర్తిస్తుంది. దీనికి వార్షిక ప్రీమియం రూ.330గా ఉంది.
ప్రధాన్‌మంత్రి సురక్షాబీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకాన్ని మొదటిసారి 2015-16 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రతిపాదించారు. దేశంలో కేవలం 20శాతం మందికి మాత్రమే ప్రమాద బీమా ఉండటంతో ఈ పరిస్థితిని మార్చేసేందుకు ఈ కొత్త బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ 2015 మే 9న కోల్‌కతాలో ప్రారంభించారు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ బీమా, పింఛన్ పథకాలకు అర్హులు. ప్రధాన్‌మంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద బ్యాంకుల్లో తెరిచిన ఖాతాలను ఈ బీమా యోజన పథకానికి అనుసంధానించారు.వార్షిక చందా రూ.12తో ఈ పథకం ద్వారా లబ్ధిపొందొచ్చు. 2016 ఫిబ్రవరి నాటికి ఈ పథకంలో 12,47,38,419 మంది చేరారు.సమీపంలోని తపాలా కార్యాలయాల్లో సంప్రదించి పూర్తి సమాచారం పొందవచ్చు.
పీఎంజేజేబీవై
పీఎంజేజేబీవై(ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన) పథకానికి 18 నుంచి 50 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులు. ఈ పథకానికి ఏడాదికి రూ 330 ప్రీమియం చెల్లించాలి. ఈ పథకంలో చేరాలంటే ఏటా జూన్ 1 నుంచి మే 31లోగా ఏ కారణంలో మరణించినా బీమా వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా సంబంధిత నామినీకి రూ రెండు లక్షల రూపాయలు అందుతుంది.
పీఎంఎస్‌బీవై
పీఎంఎస్‌బీవై(ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన) పథకంలో 18 నుంచి 70 ఏళ్ల వయస్సు వారెవరైనా చేరొచ్చు. ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లించాలి. ఈ బీమా చేయించుకున్న వారు ప్రమాదవశాస్తు మరణించినా, శాశ్వతంగా అంగవైకల్యానికి గురైనా రూ.రెండు లక్షల పరిహార పొం దొచ్చు. పాక్షిక అంగవైకల్యానికి లక్ష రూపాయలు అందజేస్తారు.
అటల్ పింఛను యోజన
ఏపీవై (అటల్ పెన్షన్ యోజన) 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఆటో వర్కర్లు, చిరు వ్యాపారులు, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఈ స్కీములో చేరి నెల నెలా కొంత పింఛను పొందొచ్చు. నెలకు రూ.1000 నుంచి రూ.5వేల వరకు పింఛను పొందే అవకాశం ఈ స్కీములో ఉంది. రూ 1000 పెన్షన్ పొందాలంటే నెలకు రూ 42, రూ 5వేలు పొందాలంటే నెలకు రూ 210 ప్రీమియం చెల్లించాలి.