ప్రస్తుతం వాడకంలో ఉన్న డెబిట్/క‌్రెడిట్ కార్డులకు ఈ ఏడాది డిసెంబర్ 31కల్లా కాలం చెల్లిపోబోతోంది.. మరి మీ కార్డు సంగతేమిటి? దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2015లోనే Payment and Settlement Systems Act, 2007 (Act 51 of 2007)లోని సెక్షన్ 18 (సెక్షన్ 10(2)తో అనుబంధం)కింద ఒక నోటిఫికేషన్ జారీచేసింది. దీని ప్రకారం... ఆ ఏడాది సెప్టెంబరు1 నాటికే దేశంలోని డెబిట్/క‌్రెడిట్ కార్డులన్నీ చిప్ ఆధారితంగా పనిచేసే (EMV) కార్డులుగా మారి ఉండాలి. కానీ, అనివార్య కారణాలవల్ల ఆ గడువును పొడిగిస్తూ ఇప్పుడు 2018 డిసెంబర్ 31గా ఖరారు చేసింది.
ఏయే కార్డులు మార్చుకోవాలి?
నేడు వాడకంలో ఉన్న కార్డులలో అధికశాతం మాగ్నెటిక్ స్ట్రిప్‌తో కూడినవే కావడంతో వీటి భద్రతకు ముప్పు అధికమే. అంతేకాదు... RBI నోటిఫికేషన్ మేరకు డిసెంబర్ 31నాటికి అవన్నీ నిరుపయోగమైపోతాయి. కాబట్టి ఆ తేదీలోగా వాటిని EMV Chip కార్డులుగా మార్చుకోవాలి.
బ్యాంకులు ఈ సమాచారం ఇస్తున్నాయా?
దేశంలోని వివిధ బ్యాంకులు కొద్ది రోజులుగా ఈ సమాచారాన్ని తమ ఖాతాదారులకు తెలియజేయడం ప్రారంభించాయి. తదనుగుణంగా మీకు బ్యాంకులనుంచి SMS అంది ఉండవచ్చు. అయితే, కొందరు దీన్ని బూటకపు మెసేజ్‌గా పరిగణించి డిలీట్ చేసి ఉంటారేమో? కానీ, ఇది నిజమే! ఇక ఇప్పుడున్న సాధారణ కార్డులను ఎలాంటి రుసుము లేకుండానే EMV Chip కార్డులుగా మార్చేస్తామని చాలా బ్యాంకులు ప్రకటించాయి. మీరు చేయాల్సిందల్లా... మీ దగ్గరలోని మీ బ్యాంకు శాఖకు వెళ్లి మార్పిడి కోసం అభ్యర్థించడమే.
EMV కార్డులలో ప్రత్యేకత ఏమిటి?
ఈఎంవీ... యూరోపే-మాస్టర్‌కార్డ్-వీసా (Europay-Mastercard-Visa) కార్డులు చిప్ ఆధారంగా లావాదేవీలను అనుమతిస్తాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వీటికి ఆమోదం ఉంది. వీటిని ‘Chip n Pin’ కార్డులని కూడా వ్యవహరిస్తారు. ఈ చిప్‌లోనే మీ ఖాతాకు సంబంధించిన కీలక సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పటి మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులలో ఈ సమాచారం కేవలం ఒకేఒక అయస్కాంత పట్టికలో ఇమిడి ఉంటుంది. వివరాలన్నీ అందులో స్థిరంగా ఉంటాయిగనుక మోసగాళ్లు చాలా తేలికంగా నకిలీలను సృష్టించగలరు. అయితే, EMV ఆధారిత చిప్ కార్డులలో సమాచారం చలనశీలంగా ఉండటమేగాక లావాదేవీని అనుమతించే ప్రతిసారి పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి కాబట్టి దీనికి భద్రత అధికం. ఈ రెండు ఫీచర్లే EMV.కార్డులకు మరింత భద్రతనిస్తాయి... ఈ కారణంగానే కార్డులన్నీ EMV ఆధారిత చిప్ కార్డులుగా మారాలని RBI నిర్దేశిస్తోంది.