టెలీకాం రంగంలో ఎన్నో సంచలనాలు నమోదు చేస్తున్న జియో.. ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఎయిర్‌టెల్, పేమెంట్స్, తేజ్ వంటి సంస్థలకు పోటీగా పేమెంట్స్ బ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందు కోసం దేశ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. టెలీకాం దిగ్గజం, బ్యాంకింగ్ దిగ్గజం రెండూ చేతులు కలపడం వల్ల సామాన్యులకు ఎంత వరకూ ఉపయోగపడుతుంది? ఎలా ఉపయోగపడుతుంది? అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఈ ఒప్పందం వల్ల దాదాపు దేశంలోని 60 కోట్ల మంది ఎన్నో లాభాలు పొందబోతున్నారు. అవేంటో తెలుసుకుందాం!
మై జియోతో యోనో జోడీ
దేశంలో 20 కోట్ల మందికి పైగా జియోను ఉపయోగిస్తున్నారు. అలాగే దాదాపు 42 కోట్ల మంది ఎస్‌బీఐ ఖాతాదారులు ఉన్నారు. వీరందరికీ ఈ ఒప్పందం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు టెక్ విశ్లేషకులు. ఎస్‌బీఐ అందించే యోనో ఫ్లాట్‌ఫాం వేదికగా జియో మొబైల్‌లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మై జియో యాప్‌లో ఎస్‌బీఐ యోనోను జోడించనున్నారు.
* ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌తో పోల్చితే SBI YONOలో మరిన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ బ్యాంకింగ్, ఇన్యూరెన్స్, క్రెడిట్ కార్డులు, లోన్ సౌకర్యం కూడా ఉండటంతో భవిష్యత్‌లో దీని వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
* ప్రస్తుతం My Jio appతో అనుసంధానం కావడం వల్ల.. ఎస్‌బీఐ కస్టమర్లు జియో టెలీకాం ఇంటిగ్రేటెడ్, డిజిటల్ సర్వీసుల ద్వారా పైన చెప్పిన సర్వీసులన్నింటినీ పొందవచ్చు.
* మెరుగైన డిజిటల్ వ్యవస్థ అయిన MyJio సర్వీసెస్ ద్వారా.. ఎస్‌బీఐ కస్టమర్లు బిల్లులు పే చేయడం, మొబైల్ రీచార్జులతో పాటు ఇతర సౌకర్యాలకు ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు ఎస్‌బీఐ త్వరలోనే డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
* ఎస్‌బీఐ డెబిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్‌లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించినా.. కొన్ని రివార్డ్ పాయింట్లు వస్తూ ఉంటాయి. జియో ప్రైమ్‌తో ఈ SBI Rewardz ఇంటిగ్రేట్ అవడంతో.. రివార్డ్ పాయింట్లు మరింత పెరుగుతాయి.
* ప్రత్యేకంగా జియో, ఎస్‌బీఐ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేలా ఎన్నో ఆసక్తికరమైన డీల్స్ వినియోగదారుల కోసం ప్రవేశపెడతారు.
* వివిధ ప్రాంతాల్లో ఉండే రిలయన్స్ రిటైల్ స్టోర్లను ఎస్‌బీఐ యూజర్లు సులువుగా యాక్సెస్ చేయవచ్చు. ఇందులో లభ్యమయ్యే ఉత్పత్తులను నేరుగా ఆఫ్‌లైన్ విధానంలోగానీ, యోనో యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ద్వారానైనా కొనుగోలు చేయవచ్చు.
* ఆర్‌ఐఎల్-ఎస్‌బీఐ 70:30 భాగస్వామ్యంతో పనిచేయనున్నాయి. జియో డిజిటల్ చెల్లింపులకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఎస్‌బీఐ అందిస్తుంది.
* జియోతో భాగస్వామ్యంతో కొత్త డిజిటల్ ప్రపంచంలోకి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అడుగు పెడుతుంది.
* జియో సరికొత్తగా ప్రవేశపెట్టే ఈ కామర్స్ వెంచర్‌కు ఎస్‌బీఐ కస్టమర్లు నేరుగా సంప్రదించవచ్చు. దీని ద్వారా లాయల్టీ పాయింట్లు మరింత పెంచుకోవచ్చు.
* ఫలితంగా ఎస్‌బీఐ, జియో మధ్య బంధం మరింత బలోపేతం అవుతుంది.