• తాజా వార్తలు

ఇండియాలో డెబిట్ ,క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

ఇండియాలో డెబిట్ ,క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊహకందనంత వేగంగా దూసుకువెళుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయని ఓ రిపోర్ట్ తెలిపింది. భారత్‌లో ప్రస్తుతం 97.1 కోట్ల క్రెడిట్, డెబిట్‌ కార్డులు ఉన్నట్టు వీసా సంస్థ పేర్కొంది. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీటిలో చెప్పుకోతగ్గ భారీ సంఖ్య లో కార్డులు గత మూడేళ్ల కాలంలో జారీ అయినవేనని తెలిపింది. డెబిట్‌ కార్డుల వినియోగ పరిస్థితుల్లో మార్పులపై వీసా గ్రూపు భారత మేనేజర్‌ టీఆర్‌ రామచంద్రన్‌ మాట్లాడుతూ... ‘‘డిజిటల్‌ దేశంగా మారుతున్న భారత్‌లో డెబిట్‌ కార్డులు అసాధారణ స్థాయిలో ఉన్నా యి. గత 12 నెలల్లో డెబిట్‌ కార్డు లావాదేవీలు 23 శాతం పెరిగాయి. ప్రజలు తమ కార్డులను తరచుగా వినియోగిస్తుండడం ఉత్సాహాన్చిచ్చే సంకేతం. మరింత భద్రతతో కూడిన చెల్లింపుల అనుభవం దిశగా పనిచేసేందుకు మాకు ఇది ప్రోత్సాహాన్నిస్తుంది’’ అని పేర్కొన్నారు.

మార్చిలో డెబిట్‌ కార్డు ద్వారా 40.7 కోట్ల లావాదేవీలు జరగగా.. 89.1 కోట్ల ఏటీఎం విత్‌డ్రాయల్స్‌ నమోదయ్యాయి.2016 మార్చి నుంచి 2019 మార్చి కాలానికి డెబిట్‌ కార్డు ద్వారా వర్తకులకు చెల్లింపులు 250 శాతానికి పైగా పెరిగాయి. 2016, మార్చిలో 11.2 కోట్లుగా నమోదైన లావాదేవీల సంఖ్య 2019, మార్చిలో 40.7 కోట్ల స్థాయికి చేరుకుంది.

ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ లావాదేవీలు మాత్రం గత కొన్నేళ్లుగా ఎలాంటి వృద్ధి లేకుండా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. నెలవారీ విత్‌డ్రాయల్స్‌ లావాదేవీలు 80 కోట్ల స్థాయికి కాస్త అటు, ఇటుగా నమోదవుతున్నాయి. గత ఏడాది నవంబరులో 86.9 కోట్లుగా నమోదైన ఏటీఎం విత్‌డ్రాయల్‌ లావాదేవీలు.. ఈ మార్చిలో 89 కోట్లకు చేరుకున్నాయి.

2016, నవంబరు 8న మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత దేశంలో డిజిటల్‌ లావాదేవీలు, అందునా కార్డు ద్వారా చెల్లింపులు అనూహ్యంగా పుంజుకున్నాయి.మర్చంట్‌ పీఓఎస్‌ల వద్ద క్రెడిట్‌ కార్డు లావాదేవీలు 22 శాతం వృద్ధి చెందాయి. 2018 మార్చిలో 12.7 కోట్ల లావాదేవీలు జరగగా.. ఈ ఏడాది అదే నెలకు లావాదేవీలు 16.2 కోట్లు.

దేశంలో పీఓఎస్‌ల అందుబాటు గణనీయంగా పెరుగుతుండగా.. గత రెండేళ్లలో భారీ సంఖ్యలో ఏటీఎంలు మూతపడుతుండటం కూడా ఈ పరిణామానికి కొంత వరకు కారణమవుతోందని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని ఏటీఎంల సంఖ్య 2.2 లక్షల స్థాయిలోనే ఉండగా.. ఈ మార్చి నాటికి దేశంలో పీఓఎస్‌ టర్మినళ్లు 37 లక్షలకు పెరిగాయి. 

2017, మార్చిలో నమోదైన 25 లక్షల స్థాయితో పోలిస్తే దాదాపు 50 శాతం మేర వృద్ధి చెందింది. అయినా, దేశంలో పీఓఎ్‌సలు డిమాండ్‌కు తగిన స్థాయిలో లేవని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు.కేవలం వర్తకులకు చెల్లించే సందర్భాల్లోనే కాదు, ఇతరులతో ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడూ నగదుకు బదులు డిజిటల్‌ మార్గాన్ని ఎంచుకునే వారు గణనీయంగా పెరుగుతున్నారు.
 

జన రంజకమైన వార్తలు