రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు మరో నిర్ణయం తీసుకుంది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టీజీఎస్) లావాదేవీల గడువు మరింత పొడిగించింది. గంట పాటు సమయాన్ని ఎక్స్‌టెండ్ చేసింది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్ ఉదయం 8 గం.ల నుంచి అందుబాటులో ఉంటుండగా.. ఇకపై ఉదయం 7 గం.ల నుంచి అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 26 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది.
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టీజీఎస్) విధానంలో రూ. 2 లక్షల పైబడిన మొత్తాన్ని ఆన్‌లైన్‌లో బదిలీ చేయొచ్చు. దీని వేళలు ఇప్పుడు కస్టమర్ల లావాదేవీలకు సంబంధించి ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా, ఇంటర్‌బ్యాంక్ లావాదేవీల కోసం రాత్రి 7.45 దాకా ఉం టున్నాయి. ప్రస్తుతం రూ. 2 లక్షల లోపు నిధుల బదిలీ కోసం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) ఉపయోగిస్తున్నారు. దీని వేళలు ఉదయం 8 నుంచి రాత్రి 7 దాకా ఉంటున్నాయి.
వర్తకులు, వ్యాపార సంస్థలకు క్రెడిట్, డెబిట్ కార్డులు, వాలెట్స్ వంటివాటిద్వారా తరచూ చేసే చెల్లింపులకు కూడా ఈ–మాన్‌డేట్ విధానాన్ని వర్తింపచేసేందుకు ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. ఇ-మాండేట్ సదుపాయం కింద జరిపే ఒక్కో లావాదేవీకి గరిష్ఠ పరిమితిని రూ.2000గా ఆర్‌బీఐ నిర్ణయించింది. అదే సమయంలో కార్డుదారు నుంచి ఈ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరాదని కూడా స్పష్టం చేసింది. అన్ని కార్డులు(డెబిట్, క్రెడిట్), వాలెట్లతో పాటు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్(పీపీఐలు)లకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయి.
ప్రస్తుత విధానం ప్రకారం కార్డుల ద్వారా చిన్న మొత్తాలు చెల్లించినా కూడా ప్రత్యేకంగా వన్ టైమ్ పాస్‌వర్డ్ వంటివి ఉపయోగించాల్సి వస్తున్నందువల్ల లావాదేవీకి ఎక్కువ సమయం పడుతోంది. తాజా వెసులుబాటుతో చిన్న మొత్తాల చెల్లింపు సులభతరమవుతుంది.
కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇటీవలనే ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) లావాదేవీలపై చార్జీలను ఎత్తివేసింది. ఆగస్ట్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. బ్యాంకుకు వెళ్లి రూ.1,000 వరకు ఇతరుకుల ఎలాంటి చార్జీలు లేకుండానే డబ్బులు పంపొచ్చు.