నగదు రహిత విధానంలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన ఆధార్ బేస్డ్ పేమెంట్స్ నిలిచిపోనున్నాయి. కేవలం ఆధార్ నంబరు ఆధారంగా ఇప్పటివరకూ చెల్లింపులు చేస్తున్న విషయం తెలిసిందే! వివిధ బ్యాంకులు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్), ఐఎంపీఎస్(ఇమీడియెట్ పేమెంట్ సిస్టమ్) విధానంలో Pay to Aadhaar ఆప్షన్ ద్వారా లావాదేవీలు జరిపే సదుపాయాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే! ఈ ఏడాది ఆగస్టు 31 నుంచి ఈ సర్వీసును నిలిపివేయాలని అన్ని బ్యాంకులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఆదేశాలు జారీచేసింది. 18 బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెడ్‌డీఎఫ్‌సీ, సిటీబ్యాంక్, మహారాష్ట్ర గ్రామీణ బ్యాంక్, మెబిక్విక్ సిస్టమ్స్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వంటి సంస్థలతో కూడిన స్టీరింగ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
గోప్యతే అత్యంత కీలకం
Pay to Aadhaar విధానంలో.. తక్షణమే ఆధార్ నంబరుకి నగదు పంపించేయచ్చు. ఆ నంబరుకు లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్‌కు నగదు బదిలీ అవుతుంది. నగదు బదిలీ చేసేవారు, నగదు స్వీకరించే లబ్ధిదారుడి ప్రయోజనం కోసం ఈ ఆప్షన్‌ను తీసేయాలని బ్యాంకులను ఎన్‌పీసీఐ కోరింది. అంతేగాక యూపీఐ యాప్స్‌తో పాటు థర్డ్ పార్టీ యాప్స్‌లో కూడా దీనిని ఆగస్టు 31లోగా దీనిని తొలగించాలని సూచించింది. భద్రతాపరమైన కారణాల రీత్యా ఈ ఆదేశాలు జారీచేసిందని తెలుస్తోంది. ఆధార్ వివరాలు చాలా గోప్యంగా ఉంచాల్సిన అవసరముందని ఎన్‌పీసీఐ అభిప్రాయపడింది. త్వరలోనే మరింత మెరుగైన ఫ్రేమ్‌వర్క్‌ని రూపొందిస్తామని తెలిపింది.
నంబర్ లీక్ అయితే.. అకౌంట్ హ్యాక్
బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ కార్డు అనుసంధానమై ఉంటుంది. ఆధార్ కార్డు నంబరు, ఇతర వివరాలు సులువుగా ఆన్‌లైన్‌లో తెలుసుకునే సదుపాయం ఉంది. ఈ ఆధార్ పేమెంట్‌లో.. సంబంధిత బ్యాంకు వివరాలతో పాటు, ఆధార్ నంబరును ఒక కమ్యూనికేషన్ చానల్ తీసుకుంటుంది. ముందుగా మధ్యలో ఉండే ఒక చానల్‌కు వివరాలన్నీ పంపితే.. అక్కడి నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఈ వ్యవహారమంతా ఎన్‌పీసీఐ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సమయంలో ఆధార్ కార్డు నంబరు లీక్ అయితే.. బ్యాంకు వివరాలు కూడా హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ ఆధార్ ఆధారిత పేమెంట్స్‌ను ఎన్‌పీసీఐ నిలిపివేయాలని నిర్ణయించింది. ఆధార్ వివరాల గోప్యత, ఇతర అంశాలపై సుప్రీం కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే! దీనిపై అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించేవరకూ ఈ బ్యాన్‌ను ఎన్‌పీసీఐ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.