• తాజా వార్తలు

అప్లయి చేయకుండానే పాన్ కార్డు మీ ఇంటికి, ఇది నిజమేనా ?

ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసిన  వారికి  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ)  శుభవార్త అందించింది. పాన్ లేకుండా కేవలం ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి  ఆదాయపన్ను శాఖ ఆటోమేటిక్‌గా పాన్ కార్డును జారీ చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. CBDT నోటిఫికేషన్ ప్రకారం.. ‘ఎవరైనా ఒక వ్యక్తి.. తన ఆధార్ నెంబర్ ను పర్మినెంట్ అకౌంట్ నెంబర్ కింద ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారో వారికి సబ్ సెక్షన్ (5E)తో పాటు సెక్షన్ 139A కింద PAN కార్డు కేటాయించడం జరుగుతుంది. ఈ రూల్ కింద పాన్ కార్డు నెంబర్ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.. అలాగే ఎలాంటి పత్రాలు కూడా ఇవ్వాల్సిన పనిలేదు’ అని పేర్కొంది. 

ఈ నిబంధనలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని, త్వరలోనే పాన్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని సీబీడీ ఛైర్మన్‌ పీసీ మోడీ తెలిపారు.  ఆధార్ కార్డులో  వినియోగదారుడి పేరు, పుట్టిన తేదీ, జండర్, ఫోటో, అడ్రస్, తదితర వ్యక్తిగత వివరాలను యూఐడీఏఐ ద్వారా   ఆదాయ పన్ను శాఖ సేకరించి దాని ఆధారంగా 10 అంకెల  పాన్ కార్డును  జారీ చేస్తామన్నారు.  పాన్ కార్డులేని పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆధార్ కార్డును ఉపయోగించు కోవచ్చునని ఆదాయపన్ను చట్టం ప్రకారం పాన్‌కు ఆధార్ ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే

ప్రస్తుతం అందుబాటులో డేటా ప్రకారం దేశవ్యాప్తంగా 120 కోట్ల ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. ఇందులో 41కోట్ల పాన్ కార్డులు కేటాయించడం జరిగింది. వీటిలో 22 కోట్లకు పైగా PAN కార్డులు ఆధార్ నెంబర్‌తో అనుసంధానమై ఉన్నాయి. 

జన రంజకమైన వార్తలు