• తాజా వార్తలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్ రీబూటింగ్ అవుతుందా? అయితే ఈ రిపేర్ గైడ్ మీకోస‌మే..

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఒక్కోసారి దానిక‌దే ఆఫ్ అయిపోయి ఆన్ అవుతుంటాయి. ఇలా  ప‌దేప‌దే రీబూట్ అవుతుంటే దానికి కార‌ణాలేమిటో వెత‌కాల్సిందే. కంగారుప‌డి ఫోన్‌ను స‌ర్వీసింగ్ సెంట‌ర్‌కు ప‌ట్టుకెళితే బిల్లు వాయించేసే ప్ర‌మాద‌ముంది. అందుకే సాధార‌ణంగా ఇలా రీబూట్ కావ‌డానికి కార‌ణాలేమిటో, వాటిని ఎలా ప‌రిష్క‌రించుకోవాలో చెప్పే రిపేరింగ్ గైడ్ మీకోసం..

1. యాప్స్, విడ్జెట్స్ (APPS & WIDGETS)
ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం గూగుల్ ప్లేస్టోర్‌లో ల‌క్ష‌లాది యాప్స్ ఉన్నాయి. వాటిలో చాలా యాప్స్‌ను మ‌నం కేవ‌లం ఒక‌రోజుకో ఒక అవ‌స‌రానికో డౌన్‌లోడ్ చేసుకుంటాం. కానీ త‌ర్వాత వాటిని అన్ఇన్‌స్టాల్ చేయ‌డం మ‌ర్చిపోతుంటాం. దీంతో అవి డేటాను, ఫోన్‌లో స్పేస్‌ను అన్నింటినీ తినేస్తుంటాయి. అంతేకాదు ర్యామ్ మీద‌, సీపీయూ మీద భారం వేస్తుంటాయి. అందుకే రెండు నెల‌లుగా ( 60 రోజులుగా) వాడ‌ని యాప్స్ ఏవైనా ఉంటే అవి మ‌న‌కు ప‌నికిరానివ‌నే అర్ధం. వాటిని వెంట‌నే అన్ఇన్‌స్టాల్ చేయండి. మీరు రెగ్యుల‌ర్‌గా వాడే యాప్స్‌ను అట్టిపెట్టుకుని వాటిని అప్‌డేట్ చేసుకోండి. కొన్ని యాప్స్ ఫోన్‌తోనే డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేసి వ‌స్తాయి. అలాంటి వాటిలోనూ మీకు అవ‌స‌రం లేనివి ఉంటే వాటిని అన్ ఇన్‌స్టాల్ చేయ‌లేరు. కానీ వాటిని డిజేబుల్ చేయొచ్చు. అదిచేస్తే మీ ఫోన్ సీపీయూ భారం త‌గ్గి ఇలా రీబూట్ అయ్యే ఎఫెక్ట్ త‌గ్గుతుంది.
ఇక‌పోతే వాతావ‌ర‌ణం, వార్త‌లు, సోష‌ల్ మీడియా అప్‌డేట్స్ చూపించే విడ్జెట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తుంటాయి. మీరు ఫోన్ స్క్రీన్ గ‌ట్టిగా ప్రెస్ చేసి ప‌ట్టుకుంటే ఆ విడ్జెట్స్ క‌నిపిస్తాయి. వాటిలో అవ‌స‌రం లేనివ‌న్నీ డిలీట్ చేయండి. అప్పుడు డేటా యూసేజ్‌తోపాటు ఫోన్‌మీద బ‌ర్డెన్ కూడా త‌గ్గుతుంది. 

* వైఫై, బ్లూటూత్‌, జీపీఎస్‌లు కూడా చాలా సీపీయూని వాడుకుంటాయి. అందుకే వాటితో అవ‌స‌రం లేద‌నుకుంటే ఆఫ్‌లో పెట్టండి.  Tasker, IFTTT వంటి యాప్స్‌తో వీటిని ఆటోపైలెట్ చేసుకోవ‌చ్చు.

* ఫేస్‌బుక్, మెసెంజ‌ర్ యాప్స్ మీ ఫోన్‌ను బాగా స్లోచేసేస్తాయి. మీరు డెస్క్‌టాప్ మీద ఎక్కువ‌సేపు ప‌నిచేసే వ్య‌క్తుల‌యితే వాటిని మీ ఫోన్‌లో నుంచి తీసేయండి. ఎందుకంటే మీరు పీసీలో బ్రౌజ‌ర్ ద్వారా వాటిని వాడుకోవ‌చ్చు. ఒక‌వేళ ఫోన్‌లో కావాల‌న్నా బ్రౌజ‌ర్ ద్వారా యాక్సెస్ చేసుకోండి.

2. సిస్ట‌మ్ యాప్స్‌
మీ ఫోన్ ప‌క్కాగా ప‌నిచేయాలంటే దానిలో ఉండే సిస్ట‌మ్ యాప్స్ అన్నీ క‌రెక్ట్‌గా ప‌నిచేయాలి. మీ సిస్ట‌మ్ యాప్స్ అన్నీ ప‌నిచేస్తున్నాయా? ఏవైనా డిజేబుల్ అయి ఉన్నాయా గ‌మ‌నించండి.  డిజేబుల్ అయిన‌వి ఏవైనా ఉంటే అనేబుల్ చేయండి.

3. బ్యాట‌రీ లూజ్ అయిందేమో చూడండి
ఇప్పుడు వచ్చే స్మార్ట్‌ఫోన్ల‌న్నీ దాదాపు నాన్ రిమూవ‌బుల్ బ్యాట‌రీతోనే వ‌స్తున్నాయి. అయితే మీ స్మార్ట్‌ఫోన్ పాత‌ద‌యినా, లేక‌పోతే ఇప్పుడు బేసిక్ మోడ‌ల్‌లో రిమూవ‌బుల్ బ్యాట‌రీతో వ‌స్తున్న‌ద‌యినా అయితే బ్యాట‌రీ లూజ్ అయినా కూడా ఫోన్ రీబూట్ అవుతుంటుంది. బ్యాక్ క‌వ‌ర్ లూజ్ అయినా, లేదా ప‌గిలినా కూడా బ్యాట‌రీ స‌రిగ్గా ఉండ‌కుండా లూజ‌వుతుంది. అలాంటివేమన్నా ఉన్నాయేమో చెక్ చేయండి. బ్యాట‌రీ లూజ్‌గా ఉంటే దాన్ని టేప్‌తో టైట్ చేయండి. బ్యాక్ క‌వ‌ర్ ప‌గిలితే కొత్త‌ది వేయించండి.

4. ఓవ‌ర్ హీటింగ్‌
ఫోన్‌లో జీపీఎస్‌, వైఫై ఎక్కువసేపు వాడినా, బ్రైట్‌నెస్ ఫుల్‌గా ఉన్నాఫోన్ వేడెక్కుతోంది. అది మీ ఫోన్‌ను రీబూట్, ష‌ట్‌డౌన్ కూడా  చేసే అవ‌కాశం ఉంది. అందుకే ఫోన్‌లో బ్లూటూత్‌, జీపీఎస్‌, వైఫ్ కాసేపు ఆఫ్ చేయండి. కాసేప‌టికి కూల్ అయి ప్రాబ్ల‌మ్ సాల్వ్ కావ‌చ్చు.

5. సిస్టం సాఫ్ట్‌వేర్ క‌రెప్ట్ అయిందేమో చూడండి
సిస్టం సాఫ్ట్‌వేర్ క‌రెప్ట్ అయిందేమో చెక్ చేసుకోండి. అలాంటిదేమయినా అనిపిస్తే ఫ్యాక్ట‌రీ రీసెట్ కొట్టిచూడండి. మీ ఫోన్ రీబూటింగ్ స‌మ‌స్య తీరొచ్చు.

6. ప‌వ‌ర్ బ‌ట‌న్ స్ట‌క్ అయినా..
ఫోన్ ప‌వ‌ర్ బ‌ట‌న్‌లో వాట‌ర్ గానీ, డస్ట్‌గానీ ప‌డితే అది ఒక్కోసారి స్ట్ర‌క్ అవుతుంది. దీనివ‌ల్ల కూడా ఫోన్ త‌ర‌చూ రీబూట్ కావ‌చ్చు. అలాంటిదేమైనాఉందేమో చూసి క్లీన్ చేయండి.
ఇవేవీ వ‌ర్క‌వుట్ కాక‌పోతే అప్పుడు స‌ర్వీస్ సెంట‌ర్‌కు తీసుకెళ్లండి.

జన రంజకమైన వార్తలు