• తాజా వార్తలు

డిస్పోజ‌బుల్ ఈ మెయిల్స్‌కు అన్‌డిస్పోజ‌బుల్ గైడ్‌

డిస్పోజ‌బుల్ గ్లాస్‌, ప్లేట్ తెలుసు.. మ‌రి డిస్పోజ‌బుల్ మెయిల్ తెలుసా? ఏదైనా తాత్కాలిక అవ‌స‌రం కోసం మీ మెయిల్ అడ్ర‌స్ ఇవ్వాల్సి వ‌చ్చిన‌ప్పుడు త‌ర్వాత మ‌ళ్లీ ఎప్పుడూ ఆ స‌ర్వీస్‌తో మీకు ప‌ని లేద‌నుకున్న‌ప్పుడు మీరు రెగ్యుల‌ర్‌గా వాడే మెయిల్ ఐడీ ఇవ్వ‌డం ఎందుకు? అనే ప్ర‌శ్న నుంచి పుట్టిందే ఈ డిస్పోజ‌బుల్ మెయిల్ ఐడీ కాన్సెప్ట్‌?  దాని వివ‌రాలేంటి?  డిస్పోజ‌బుల్ మెయిల్ ఐడీ వాడుకోవ‌డం ఎలా?  తెలుసుకోవాలంటే ఈ ఆర్టిక‌ల్ చ‌ద‌వాల్సిందే.  


ఏంటి ఉప‌యోగం?
ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఏదో టూర్ వెళ‌తారు. అక్క‌డ ఏదో హోట‌ల్లో దిగుతారు. అక్క‌డ మిమ్మ‌ల్ని మెయిల్ ఐడీ రాయ‌మంటే మీ రెగ్యుల‌ర్ మెయిల్ ఐడీ ఇచ్చార‌నుకోండి. ఆ త‌ర్వాత ఆ  హోట‌ల్ వాళ్లు వాళ్ల ద‌గ్గ‌ర ఆఫ‌ర్స్ గురించి మీకు మెయిల్స్ పంపించి విసిగించే ప్ర‌మాదం ఉంది. మ‌ళ్లీ ఎప్పుడూ ఆ ప్రాంతానికి వెళ్లం.. ఆ హోట‌ల్‌లో దిగం అనుకున్న‌ప్పుడు అక్క‌డ మీ రెగ్యుల‌ర్ మెయిల్ ఐడీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏముంది?  దానిబ‌దులు తాత్కాలికంగా వాడి వ‌దిలేసే డిస్పోజ‌బుల్ మెయిల్ ఐడీ వాడుకోవ‌చ్చు. అది మ‌న రెగ్యుల‌ర్ మెయిల్ ఐడీ కాదు కాబ‌ట్టి దానికెన్ని మెయిల్స్ వ‌చ్చినా మ‌నం ప‌ట్టించుకోవాల్సిన ప‌ని ఉండ‌దు క‌దా.. 

స్లిప్ప‌రీ ఈమెయిల్ (Slippery Email)
డిస్పోజ‌బుల్ ఈమెయిల్ టూల్స్‌లో బెస్ట్ ఇది.  ఒక్క క్లిక్‌తో మిమ్మ‌ల్ని ఎలాంటి వివరాలు అడ‌క్కుండానే అకౌంట్ క్రియేట్ చేస్తుంది. ఈ స్లిప్ప‌రీ ఈమెయిల్‌లో కూడా ఇన్‌బాక్స్ ఉంటుంది. అయితే 8 రోజుల త‌ర్వాత అందులో మెసేజ్‌లు ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతాయి. ఈ టూల్ మీకు ఎలాంటి ఛార్జీలు వేయ‌దు. అంతేకాదు యాడ్స్ గోల కూడా లేదు. ఇంట‌ర్ ఫేస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. Slippery Email అని బ్రౌజ‌ర్‌లో టైప్ చేసి ఓపెన్ అయ్యాక Hook me up అని క‌నిపించే ఆప్ష‌న్ మీద క్లిక్ చేస్తే చాలు. మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది.

బ‌ర్న‌ర్ ఈమెయిల్స్ (Burner Emails)
ఇది కొద్దిగా అడ్వాన్స్‌డ్ ఫ్లాట్‌ఫాం టూల్‌. ఇది మీకు కావాల్సిన అన్ని వెబ్‌సైట్ల‌కు కొత్త  ఈమెయిల్ అడ్ర‌స్‌ల‌ను క్రియేట్ చేస్తుంది. అయితే ఏ వెబ్‌సైట్ నుంచి లేదా ఏ మెయిల్ ఐడీ నుంచి మీకు మెసేజ్‌లు అవ‌స‌రం లేద‌నుకుంటున్నారో స్పెసిఫై చేస్తే వాటిని బ్లాక్ చేసేస్తుంది. బ‌ర్న‌ర్ ఈమెయిల్స్ టూల్ క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్‌గానూ, ఫైర్‌ఫాక్స్ యాడ్ ఆన్‌గానూ అందుబాటులో ఉంది. 

జీమెయిల్‌లోనూ వాడొచ్చు
థ‌ర్డ్ పార్టీ యాప్స్ లేదా టూల్స్‌ను న‌మ్మ‌డం ఇష్టం లేక‌పోతే జీమెయిల్‌లో కూడా ఈ డిస్పోజ‌బుల్ మెయిల్ అడ్ర‌స్ ఫీచ‌ర్‌ను వాడుకోవ‌చ్చు.

1. ముందుగా ఒక అలియాస్‌ను పిక్ చేసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు మీ జీమెయిల్‌లో స్పామ్ ఫోల్డ‌ర్ మీద spam+......@gmail.comను క్రియేట్ చేసుకోవ‌చ్చు.

2. ఇప్పుడు మీరు జీమెయిల్ అకౌంట్‌లోనే ఫిల్ట‌ర్‌ను డెవ‌ల‌ప్ చేయాలి. ఇందుకోసం మీ జీమెయిల్ ఇన్‌బాక్స్‌లోకి వెళ్లండి. రైట్ సైడ్ టాప్‌లో ఉన్న సెట్టింగ్స్ ఐకాన్‌ను నొక్కండి. దానిలో settingsను క్లిక్ చేయండి.

3. త‌ర్వాత వ‌చ్చే ట్యాబ్‌లో Filters and Blocked Addresses అని టాప్‌లో ఒక ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.  దానిలో ఉన్న Create a new filter ఆప్ష‌న్ క్లిక్ చేయండి. 

4. మ‌రో విండో ఓపెన్ అవుతుంది. ఇందులో To అనే ఫీల్డ్‌లో spam+......@gmail.comను ఎంట‌ర్ చేసి create filter with this search ఆప్ష‌న్ నొక్కండి. అంటే మీరు డిస్పోజబుల్ మెయిల్ ఐడీగా క్రియేట్ చేసుకున్న spam+......@gmail.comలోకి వచ్చే మెయిల్స్ అన్నీ బైపాస్ చేస్తున్నారు.  మీరు వ‌ద్ద‌న్నా మెయిల్స్ పంపిస్తున్న సంస్థ మెయిల్ ఐడీ తెలిస్తే ఫ్ర‌మ్‌లో ఎంట‌ర్‌చేయండి. 

5. Skip the inbox అనే ఆప్ష‌న్ నొక్కితే ఎలాంటి మెయిల్స్ మీ ఇన్‌బాక్స్‌లోకి రావు. Delete it బాక్స్‌ను కూడా టిక్ చేసి Create filter ఆప్ష‌న్ క్లిక్ చేస్తే మీ డిస్పోజ‌బుల్ మెయిల్ ఐడీ జీమెయిల్‌లో క్రియేట్ అయిన‌ట్లే.


 

జన రంజకమైన వార్తలు