స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ఎంత మెగాపిక్సెల్ అయినా ఉండనివ్వండి. కానీ డిజిటల్ కెమెరాతోనో, డీఎస్ఎల్ఆర్‌తోనో వచ్చిన క్వాలిటీ రానేరావు. సోనీ లెన్స్‌లు పెట్టిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కెమెరాలు కూడా ఆ స్థాయి అవుట్‌పుట్ ఇవ్వలేవు. ఎందుకంటే ఫోన్ హార్డ్‌వేర్ దీనికి అంత సపోర్ట్ ఇవ్వదు. అలా అని అన్ని చోట్లకూ డిజిటల్ కెమెరానో, డీఎస్ఎల్ఆర్‌నో మోసుకెళ్లలేం. స్మార్ట్ ఫోన్‌తోనే ఫోటో తీసుకోవాలి.. డిజిటల్ కెమెరా స్థాయి క్వాలిటీ కావాలనుకుంటే స్మార్ట్‌ఫోన్ కెమెరా లెన్స్‌లు కొనుక్కోవడమే మార్గం. అసలు ఎలాంటి స్మార్ట్‌ఫోన్ కెమెరా లెన్స్‌లు కొనాలి? దేనికి ఏవి ఉపయోగపడతాయో చెప్పే గైడ్ మీకోసం..
స్మార్ట్‌ఫోన్ కెమెరాకు లిమిట్స్
మీ స్మార్ట్‌ఫోన్ కెమరాలో లెన్స్ చిన్నగా ఉంటాయి. దీంతో ఇమేజ్‌లు పెద్దగా రావు. ఇమేజ్ సైజ్ పెంచేకొద్దీ క్వాలిటీ తగ్గిపోతుంది. హెచ్‌డీఆర్, పనోరమా ఫొటోస్‌లో క్వాలిటీ కొంత బాగున్నా డిజిటల్ కెమెరా స్థాయికి సాటిరాదు. కొన్ని ఫోన్లలో కెమెరాకు డిజిటల్ జూమ్ ఫీచర్ ఇస్తున్నారు. అది ఇమేజ్ సైజ్‌ను పెంచగలదే తప్ప క్వాలిటీని మెరుగుపరచలేదు. ఇలాంటి పరిమితులన్నీ దాటాలంటే మీ ఫోన్ కెమెరాకు లెన్స్‌లు అమర్చుకోవచ్చు. అవి ఏమిటంటే..
టెలీఫోటో (Telephoto) లెన్స్
ఎక్కడో దూరంగా చెట్టుమీద ఉన్న పిట్టనో, కొండమీద ఉన్న చెట్టునో మీ ఫోన్ కెమెరాతో షూట్ చేయాలంటే టెలిఫోటో లెన్స్ వాడాలి. ఇది దూరాన ఉన్న వస్తువును ఫోటో తీసినా క్లియర్‌గా, క్రిస్ప్‌గా వచ్చేలా చేస్తుంది. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ చేసేవాళ్లు ఈ లెన్స్‌లు ఎక్కువగా వాడతారు.
వైడ్ యాంగిల్ (Wide Angle) లెన్స్
ల‌్యాండ్ స్కేప్ ఫోటో తీయాలన్నా, ఏదైనా వీధి లేదా ఓ పార్కు ఫోటో తీయాలన్నా ఈ వైడ్ యాంగిల్ లెన్స్ బాగా ఉపయోగపడతాయి. పేరుకు తగ్గట్లే ఇది ఎక్కువ ప్లేస్‌ను కవర్ చేసి ఫోటో తీస్తుంది. ఉదాహరణకు మీరు రెస్టారెంట్‌లో ఫుడ్ ఫోటో తీసి ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవాలనుకున్నారు. మీరు కూర్చుని మామూలు సెల్ కెమెరాతో ఫోటో తీస్తే టేబుల్ కొంత వరకే కవర్ అవుతుంది. వైడ్ యాంగిల్ లెన్స్‌తో మొత్తం కవర్ చేయొచ్చు.
మాక్రో (Macro) లెన్స్
మాక్రో లెన్స్ అంటే పెద్ద లెన్స్. ఎక్కువ దూరం నుంచి ఫొటో తీసినా ఫోటో పిక్సెల్స్ పగిలిపోకుండా మంచి డిటెయిల్స్, టెక్స్చర్స్ ఇస్తుంది. పెద్ద పెద్ద సభలు, ప్రోగ్రామ్స్ తీసేటప్పుడు ఈ లెన్స్ వాడతారు.
ఫిష్ ఐ (Fisheye) లెన్స్
ఇది కూడా పెద్ద ప్రోగ్రామ్స్ లేదా భారీ ఈవెంట్స్ కవర్ చేయడానికి వాడే లెన్స్. అయితే ఇది స్ట్రెయిట్‌గా కాకుండా చేప కన్ను ఆకారంలో ఫోటో తీస్తుంది.