• తాజా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్ ఐజీ టీవీకి ఏ టూ జెడ్ గైడ్‌

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఇన్‌స్టాగ్రామ్ ఐజీటీవీ (IGTV) పేరుతో ఇటీవ‌ల ఓ కొత్త యాప్‌ను రిలీజ్ చేసింది. ఇప్ప‌టికే ఇన్‌స్టాగ్రామ్ ఉండ‌గా మ‌ళ్లీ కొత్త‌గా ఈ ఐజీటీవీ యాప్ అవ‌స‌ర‌మేంటి? ఐజీటీవీ విశేషాలేంటి?  తెలుసుకుందాం ప‌దండి. 

గంట నిడివి గ‌ల వీడియోలు అప్‌లోడ్‌
ఇన్‌స్టాగ్రామ్ 2010లో లాంచ్ అయింది. ఇందులో వీడియో ఫీచ‌ర్ 2013లో ప్ర‌వేశ‌పెట్టింది.  మొద‌ట్లో 15 సెకండ్ల నిడివితో కూడిన వీడియో క్లిప్స్‌ను మాత్ర‌మే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయ‌డానికి అవ‌కాశం ఉండేది. త‌ర్వాత దాన్ని ఒక నిముషానికి పెంచారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన ఐజీటీవీ యాప్‌తో ఒక గంట నిడివి గ‌ల వీడియోల వ‌ర‌కు అప్‌లోడ్ చేసే అవ‌కాశం ఉండ‌డం విశేషంగా చెప్పుకోవాలి. అంటే ఇదివ‌ర‌కు ఏదైనా ఈవెంట్‌లో ముఖ్య‌మైన క్లిప్‌ను మాత్ర‌మే అప్‌లోడ్ చేయ‌గ‌లిగేవాళ్లం. ఇప్పుడు దాదాపు ఒక వీడియోను (గంట వ‌ర‌కు) అప్‌లోడ్ చేసి బంధుమిత్రుల‌తో పంచుకునే అవ‌కాశాన్ని ఇన్‌స్టాగ్రామ్ క‌ల్పించింది. 

ఎవ‌రికి ఉప‌యోగం? ఎవ‌రికి పోటీ?
ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ల్లో ఎక్కువ నిడివి గ‌ల వీడియోల‌ను అప్‌లోడ్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రొఫెష‌న‌ల్ బ్లాగ‌ర్స్‌, బిజినెస్ ప‌ర్ప‌స్‌లో వాడుకునేవాళ్లు వీటిని బాగా ఉప‌యోగించుకుంటున్నారు. ఈ విష‌యంలో ఇన్‌స్టాగ్రామ్ వెనుకబ‌డింది. అందుకే ఇప్పుడు ఐజీటీవీ యాప్‌ను తీసుకొచ్చింది. గంట నిడివితో వీడియోల‌ను అప్‌లోడ్ చేయ‌గ‌ల అవ‌కాశం ఉండ‌డంతో యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ల‌కు పోటీ ఇవ్వ‌గ‌ల‌ద‌ని భావిస్తున్నారు.

 ఎలా ప‌నిచేస్తుంది?
ప్ర‌స్తుతం ఐజీ టీవీ యాప్ మొబైల్ డివైస్‌ల్లో మాత్ర‌మే ప‌ని చేస్తుంది. ఆండ్రాయిడ్ , ఐవోఎస్‌ల్లో  IGTV app అందుబాటులో ఉంది.

*  మీరు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను వాడ‌నివారైతే  ఐజీటీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవ‌చ్చు. 

* ఇప్ప‌టికే మీరు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను మీ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే యాప్‌లో కుడివైపు టాప్‌లో ఉన్న టీవీలాంటి ఐకాన్‌ను  క్లిక్ చేస్తే నేరుగా ఐజీటీవీ యాప్‌లోకి వెళ‌తారు. 

* ఐజీటీవీ హోం పేజీలోకి వెళ్ల‌గానే వీడియోస్ ప్లే అవ‌డం ప్రారంభిస్తాయి.

* ఐజీటీవీలో వీడియోలో నాలుగు కేట‌గిరీలుగా ఉంటాయి. అవి For You, Following, Popular,  Continue Watching.

ఏ సెక్ష‌న్‌లో ఏ వీడియోలు? 
ఫ‌ర్ యూ ( For You) సెక్ష‌న్‌లో మీ రెగ్యుల‌ర్‌ యాక్టివిటీని బేస్ చేసుకుని ఉన్న వీడియోలు  క‌నిపిస్తాయి. ఫాలోయింగ్ (Following) సెక్ష‌న్‌లో మీరు ఫాలో అవుతున్న వ్య‌క్తులు పోస్ట్ చేసిన వీడియోలు ఉంటాయి. అదే విధంగా పాపుల‌ర్ (popular) సెక్ష‌న్‌లో వీడియోలు ఆ నెట్‌వ‌ర్క్‌లో ఉన్న పాపుల‌ర్ వీడియోల‌ను చూపిస్తాయి. ఇది ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌ప్లోర్ ఫీడ్‌లాంటిది అన్న‌మాట‌. కంటిన్యూ వాచింగ్ (Continue Watching) సెక్ష‌న్‌లో వీడియోల‌ను మీరు చూడ‌డం ప్రారంభించి మ‌ధ్య‌లో ఆపేస్తే త‌ర్వాత సారి ఓపెన్ చేసిన‌ప్పుడు ఎక్క‌డ ఆపేశారో అక్క‌డి నుంచి చూడ‌డానికి అవ‌కాశం ఉంటుంది.

ఇవీ స్పెష‌ల్స్‌
* కొత్త వీడియోల‌ను చూడ‌డానికి సెర్చ్ ఆప్ష‌న్ ఉంది.

* ఐజీటీవీ యాప్‌లో కొత్త వీడియోలు మీకు ఎవ‌రైనా షేర్ చేసి ఉంటే ఈ టీవీ సింబ‌ల్ రెడ్ క‌ల‌ర్‌లో క‌నిపిస్తుంది. కొత్త వీడియోలు ఏమీ లేక‌పోతే అది బ్లాక్ అండ్ వైట్‌లోనే ఉంటుంది.

* ఇక ఐజీటీవీ యాప్‌లో వీడియోల్లో ఉన్న పెద్ద ప్ల‌స్‌పాయింట్ ఏమిటంటే ఇవి నిలువుగా ఉంటాయి. సాధార‌ణంగా మ‌నకు యూట్యూబ్, ఫేస్‌బుక్‌ల్లో వ‌చ్చే వీడియోలు ల్యాండ్ స్కేప్స్ (అడ్డంగా) మోడ్‌లో ఉంటాయి. ఎందుకంటే అవి బేసిక‌ల్‌గా టీవీ, పీసీల్లో చూడ‌డానికి ఉద్దేశించిన‌వి కాబ‌ట్టి అలా ఉంటాయి. వాటిని మొబైల్‌లో చూడాలంటే మొబైల్‌ను అడ్డంగా తిప్పి చూస్తాం క‌దా.. కానీ ఐజీటీవీలో వీడియోలతో ఆ బాధ లేదు. మొబైల్స్ కోస‌మే క్రియేట్ చేసిన యాప్ కాబ‌ట్టి నిలువుగా (పోర్ట్ర‌యిట్ మోడ్‌లోనే) వీడియోలు పెడుతోంది. 

జన రంజకమైన వార్తలు