• తాజా వార్తలు

మీ టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ ఫోన్ పోయిందా?  అయితే ఈ గైడ్ మీకోస‌మే..

ఇప్పుడు దాదాపు అన్ని వెబ్‌సైట్స్‌, యాప్స్ కూడా టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ ఫీచ‌ర్ తీసుకొచ్చాయి. అంటే కేవ‌లం మీ పాస్‌వ‌ర్డ్ తెలిసినంత మాత్రాన మీ అకౌంట్‌ను ఎవ‌రూ ఓపెన్ చేయ‌లేరు. ఆ సైట్ నుంచి మీ రిజిస్ట‌ర్డ్ ఫోన్ నెంబ‌ర్‌కి వ‌చ్చే ఓటీపీని ఎంట‌ర్ చేస్తేనే గానీ యాక్సెస్ చేయ‌లేరు. సెక్యూరిటీప‌రంగా టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ మంచి ఏర్పాటు. అయితే ఇలా టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ పాస్‌వ‌ర్డ్ వ‌చ్చే నెంబ‌రున్న మొబైల్ ఫోన్ పోతే వాటిని యాక్సెస్ చేయ‌డం సాధ్యం కాదా?  అవుతుంది.. ఎలా సాధ్య‌మ‌వుతుందో చెప్పే ఈ గైడ్ మీకోసం..

1.మీ ఫోన్ నెంబ‌ర్ రిక‌వ‌ర్ చేసుకోండి
మీ మొబైల్ క‌నెక్ష‌న్ ఉన్న కంపెనీ అవుట్‌లెట్‌కి వెళ్లి  వెంట‌నే మీ ఫోన్ నెంబ‌ర్ రిక‌వ‌ర్ చేసుకోండి.  అవుట్‌లెట్ ద‌గ్గ‌ర‌లో లేకుంటే క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ సెంట‌ర్‌కు ఫోన్ చేస్తే ఏం చేయాలో వాళ్లు చెబుతారు.  కొత్త ఫోన్ కొన‌డానికి టైం ప‌డుతుంద‌నుకుంటే పాత ఫోన్ లేదా ఇంట్లోవాళ్ల ఫోన్ అయినా తీసుకుని ముందు మీ నెంబ‌ర్‌తో ఉన్న కొత్త సిమ్‌ను అందులో వేసుకోండి. 
 

2. మీ ఫోన్ నెంబ‌ర్‌ను వేరే నెంబ‌ర్‌కు ఫార్వార్డ్ చేయండి
మీరు ఫోన్ కొనేలోపు, లేదా మీకు పాత సిమ్ చేతికి అందేలోపు ఆ నెంబ‌ర్‌పై వ‌చ్చే కాల్‌్ఉను  మీ ఇంట్లోవాళ్ల నెంబ‌ర్‌కు ఫార్వార్డ్ చేయండి. ఇందుకోసం మీ సెల్యుల‌ర్ ఆప‌రేట‌ర్‌ను సంప్ర‌దించాలి. కాల్ ఫార్వార్డింగ్ ఆప్ష‌న్ వాళ్లు ఇవ్వ‌గానే మీరు పోగొట్టుకున్న నెంబ‌ర్‌కు వ‌చ్చే కాల్స్ అన్నీ మీరు తాత్కాలికంగా ఇచ్చిన నెంబ‌ర్‌కు ఫార్వార్డ్ అవుతాయి. అయితే ఇలా ఎస్ఎంఎస్‌లు ఫార్వార్డ్ చేసే అవ‌కాశం లేదు. మీకు టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ కోడ్స్ అన్నీ ఎస్ఎంఎస్‌ల రూపంలోనే వ‌స్తాయి కాబ‌ట్టి కాల్ ఫార్వ‌ర్డ్ చేసినా మీకు పెద్ద ఉప‌యోగం ఉండ‌క‌పోవ‌చ్చు. ల‌క్కీగా కొన్ని వెబ్‌సైట్లు కోడ్‌ను మీ నెంబ‌ర్‌కు కాల్ చేసి చెప్పే ఫీచ‌ర్‌ని కూడా క‌లిగి ఉంటాయి. అలాంటి ఆప్ష‌న్ ఉంటే మీకు కాల్ వ‌స్తుంది. ఆ కాల్ మీరు చెప్పిన నెంబ‌ర్‌కు ఫార్వ‌ర్డ్ అవుతుంది కాబట్టి మీకు తాత్కాలికంగా స‌మ‌స్య తీరిన‌ట్లే.

3.రిక‌వ‌రీ కోడ్స్‌ను వాడుకోండి
టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ సెట్ చేసుకునేట‌ప్పుడే చాలా వెబ్‌సైట్లు రిక‌వ‌రీ కోడ్స్‌ కూడా ఇస్తాయి. వీటిని ప్రింట్ తీసి ఎక్క‌డైనా సీక్రెట్‌గా దాచిపెట్టుకోమ‌ని కూడా చెబుతాయి. అంటే ఒక‌వేళ మీ ఫోన్ పోయినా ఈ రిక‌వ‌రీ కోడ్స్ ద్వారా ఆయా వెబ్‌సైట్ల‌లోని మీ అకౌంట్స్‌లోకి లాగిన్ అవ్వ‌చ్చు. అలాగే కొన్ని సైట్లు మీ ఫోన్ పోతే యాక్సెస్ కోసం రిక‌వ‌రీ ఫోన్ నెంబ‌ర్ కూడా అడుగుతాయి. సాధార‌ణంగా ఇలాంటి ఫోన్ నెంబ‌ర్ మీ డ్యూయ‌ల్ సిమ్ ఫోన్‌లో ఉన్న రెండో నెంబ‌ర్ ఇవ్వ‌డం కంటే భార్య‌దో, పిల్ల‌ల‌దో ఇవ్వ‌డం మేలు. ఎందుకంటే మీ ఫోన్ పోయినా దాని ద్వారా కోడ్ రిసీవ్ చేసుకుని తిరిగి యాక్సెస్ చేసుకోవ‌చ్చు.

4.ఈమెయిల్‌తో టూ ఫ్యాక్ట‌ర్ సెక్యూరిటీని తొల‌గించుకోండి
మీ రిజిస్ట‌ర్డ్ ఈ మెయిల్ నుంచి ఆ వెబ్‌సైట్‌కి మెయిల్ పంపి టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్‌ను తొల‌గించ‌మ‌ని కోర‌వచ్చు. అయితే ఇది సెక్యూరిటీ ప‌రంగా అంత మంచి ఛాయిస్ కాదు. ఎందుకంటే మీ ఈమెయిల్‌ను హ్యాక‌ర్లు యాక్సెస్ చేయ‌గ‌లిగితే ఇలా టూ ఫ్యాక్ట‌ర్ వెరిఫికేష‌న్‌ను రిమూవ్ చేయించే ప్ర‌మాదముంది. 

5.కంపెనీ క‌స్ట‌మ‌ర్ కేర్‌కు కాల్ చేసి అడ‌గండి

ఇవేవీ కాక‌పోతే ఆ కంపెనీ లాగిన్‌లోకి మీరు ఎంట‌ర‌వ‌డానికి కంపెనీ క‌స్ట‌మ‌ర్ కేర్‌కు కాల్ చేసి అడ‌గండి. ఉదాహ‌ర‌ణకు మీ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్‌లోకి లాగిన్ కావ‌డానికి టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ అవ‌స‌ర‌మ‌నుకోండి. ఆ ఫోన్ పోయింది.  సెక్యూరిటీ కోడ్ వ‌చ్చే అవ‌కాశం లేదు అలాంటి స‌మ‌యంలో ఏం చేయాలో బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ కేర్‌కు  ఫోన్ చేసి క‌నుక్కోండి.

6.పోయిన ఫోన్‌లో డేటాను తుడిచిపెట్టేయండి
మీరు పోగొట్టుకున్న ఫోన్‌లో ఉన్న డేటాను తుడిచిపెట్టేయండి లేక‌పోతే అది వేరేవాళ్ల చేతిలో ప‌డే ప్ర‌మాదం ఉంది. మీరు యాపిల్ ఫోన్ వాడుతుంటే Find My iPhone, ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే Find My Device స‌ర్వీసులోకి వెళ్లి మీ ఫోన్‌ను ట్రాక్ చేయొచ్చు. అంతేకాదు రిమోట్ యాక్సెస్ ప‌ద్ధ‌తిలో అందులోని డేటాను ఎరేజ్ చేసేయండి.

జన రంజకమైన వార్తలు