ఈ-కామర్స్ బ్రాండ్లు తమ సంవత్సరాంతపు మెగా సేల్స్ మేళాను ప్రారంభించే సమయం సమీపిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం వంటి ఈ-కామర్స్ వేదికలలో అత్యధికంగా అమ్ముడయ్యేవి స్మార్ట్ ఫోన్లే అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో అవి ఆకర్షణీయమైన డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్, బైబ్యాక్ వంటి పథకాలను ప్రకటించడం పరిపాటి. మరి మీరూ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే, దిగువ సూచించిన 10 అంశాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ విస్మరించకండి.
ధరల్లో వ్యత్యాసాన్ని గమనించండి
ఈ-కామర్స్ వేదిక, తయారీ కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం ఉంటే తప్ప ఒకే బ్రాండ్ స్మార్ట్ ఫోన్‌ను వేర్వేరు వెబ్‌సైట్లు రకరకాల ధరల్లో విక్రయిస్తుంటాయి. అందువల్ల మీరు కొనదలచిన ఫోన్ ధర ఆయా వెబ్‌సైట్లలో ఎలా ఉందో ముందుగా చూడండి.
విక్రేతలపై రివ్యూలు, రేటింగ్స్ చూడండి
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వేదికలపై అమ్ముతున్నాయి కాబట్టి విక్రయ సంస్థలన్నీ అధికారికమైనవేనని భావించకండి. ప్రధాన ఈ-కామర్స్ సంస్థలన్నీ చాలా థర్డ్ పార్టీ విక్రేతలను అనుమతిస్తుంటాయి. కాబట్టి ఆయా విక్రయ సంస్థలపై రివ్యూలను, వాటికిగల రేటింగ్‌ను తప్పనిసరిగా చూడండి.
మీరు కొనే ఫోన్ సరికొత్తదేనా, ముస్తాబు చేసిందా?
సరికొత్త స్మార్ట్ ఫోన్లతోపాటు వాడిన ఫోన్లలో లోపాలను సరిచేసి, కొత్తవాటిలాగా ముస్తాబు చేసి విక్రయించేందుకూ ఈ-కామర్స్ వేదికలు ఇప్పుడు అనుమతిస్తున్నాయి. ఇవి తక్కువ ధరలో లభించడం వల్ల కొనుగోలుదారులు ఆకర్షితులై ‘BUY ’ బటన్‌ను నొక్కేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఫోన్ కొత్తదో.. కాదో నిశితంగా గమనించండి.
వారంటీపై వాస్తవ వివరాలను తనిఖీ చేయండి
ఆన్‌లైన్‌లో స్మార్ట్ ఫోన్ కొనేముందు వారంటీ వివరాలు, హ్యాండ్‌సెట్‌తోపాటు యాక్సెసరీలపై వారంటీ గడువుసహా షరతులు-నిబంధనలను పూర్తిగా చదవండి.
అత్యుత్తమ ఆఫర్ల విషయంలో చురుగ్గా వ్యవహరించండి
వివిధ బ్యాంకులతో పేమెంట్ భాగస్వామ్యంవల్ల ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ఒకే రకం ఫోన్‌పై రకరకాల ఆఫర్లను ప్రకటించడం చూస్తూనే ఉంటాం. కనుక అన్ని ఆఫర్ లోని సమాచారాన్ని క్షుణ్నంగా పరిశీలించాకే కొనుగోలుపై నిర్ణయం తీసుకోండి.
ఫోన్ డెలివరీ సమయంపై నిశిత దృష్టి పెట్టండి
ఫోన్లకుగల డిమాండ్, లభ్యతనుబట్టి వేర్వేరు విక్రేతలు వేర్వేరు డెలివరీ వ్యవధిని అనుసరిస్తుంటారు. మరోవైపు రవాణా చార్జీలు చెల్లించడంద్వారా వేగంగా డెలివరీ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు కొనే స్మార్ట్ ఫోన్ డెలివరీకి ఏది సరైనదో ఒకసారి సరిచూసుకోండి. అంతేకాకుండా మీరు కోరిన సమయంలో డెలివరీ చేసే ఆప్షన్‌ను కూడా చాలా ఈ-కామర్స్ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి.
అధికారిక వెబ్‌సైట్లలో ఫోన్ స్పెసిఫికేషన్లను సరిచూసుకోండి
స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లలో ఫోన్ ప్రత్యేకతలను పూర్తిగా చెక్ చేసుకోండి. వివరాలను అందించడంలో ఈ-కామర్స్ వెబ్‌సైట్లకు లేదా విక్రేతలకు సంపూర్ణ సాధికారత ఉండకపోవచ్చు. అందుకే బ్రాండ్ వెబ్‌సైట్‌ను ఓసారి చూసుకోవడం మంచిది.
రిఫండ్/రిటన్ పాలసీని చూడండి
ఫోన్ కొనేముందుగానే... అది సరిగా లేనిపక్షంలో వాపసుకు, సొమ్ము తిరిగి పొందడానికి సంబంధించిన విధానంలోని షరతులు-నిబంధనలను పూర్తిగా చదవండి. దీనివల్ల తదనంతర చిక్కుల బాధ తప్పుతుంది.
ఎక్స్ఛేంజి ఆఫర్లు గిట్టుబాటయ్యే సందర్భాలు
మార్కెట్‌లోకి అడుగుపెట్టిన అత్యాధునిక స్మార్ట్ ఫోన్ల సత్వర అమ్మకం కోసం చాలా ఈ-కామర్స్ వెబ్‌సైట్లు కొన్నిసార్లు ఎక్స్ఛేంజి ఆఫర్లు పెడుతుంటాయి. అయితే, ఇవన్నీ ఆకర్షణీయమైనవేనని చెప్పలేంగానీ, కొన్ని సందర్భాల్లో మనకు గిట్టుబాటయ్యేలా ఉంటాయి. ఏదేమైనా ఇలాంటివాటి ఎక్స్ఛేంజి, రిటన్ పాలసీల షరతులు-నిబంధనలు క్షుణ్నంగా చదవడం మరవకండి.
విక్రయానంతర సేవలపై సమీక్షలు చూడండి
ఏదైనా ఫోన్‌ను కొనేముందే ఆ తర్వాత పొందగల సేవల గురించి ఇతర వినియోగదారుల సమీక్షలను పూర్తిగా చదవండి. దాంతోపాటు విక్రయానంతర సేవలపై కంపెనీ విధానాన్ని, ఆ సేవలందించే కేంద్రాల జాబితాను పరిశీలించండి. వారంటీలు కొన్నిసార్లు మొత్తం రిపేరు ఖర్చుకు హామీ ఇవ్వవు. అందుకే ఆ విధానం గురించి తెలుసుకోవడం ఒక ముందుజాగ్రత్త అన్నమాట!