ఈ ఏడాది అతిపెద్ద ఈ-కామర్స్ సేల్స్ హంగామా మొదలైపోయింది. ఫ్లిప్‌కార్ట్ నుంచి అమెజాన్‌దాకా; పేటీఎం మాల్ నుంచి స్నాప్‌డీల్‌దాకా దాదాపు అన్ని ఆన్‌లైన్ పోర్టళ్లు ఈ పండుగ సీజన్‌లో వరుసకట్టి జనం ముందుకు వచ్చాయి. ఆ మేరకు అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ డబ్బు ఆదా చేసుకోవచ్చు... అయితే, ఆ వేదికలపై వస్తువులు కొనబోయే ముందు అనుసరించాల్సిన కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ మీకోసం...
ధరలను సరిపోల్చడం
స్మార్ట్‌ఫోన్ నుంచి టెలివిజన్‌దాకా మీకిష్టమైన ఉత్పత్తులను సరసమైన ధరలకు అమ్మజూపుతున్నది ఏదో ఒక వెబ్‌సైట్ కాదు. అనేక ఉత్పత్తులు అనేకానేక వెబ్‌సైట్లలో అమ్మకానికి ఉన్నాయ్. అందువల్ల మీరు కొనదలచిన ఉత్పత్తి ధర ఏ సైట్‌లో ఎలా ఉన్నదీ పోల్చి చూడటం తెలివైన పని. ఇందుకోసం మీరేమీ శ్రమపడే అవసరం లేదు. ‘‘PRICEDEKHO, COMPARERAJA’’ వంటి వెబ్‌సైట్ ఉపకరణాలు మీ కోసం ఆ పని చేసిపెడతాయి.
బ్యాంకు ఆఫర్లు
అమెజాన్ ఈ సంవత్సరం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాతో జట్టుకట్టి తన ‘‘గ్రేట్ ఇండియన్ సేల్’’ కింద 10 శాతందాకా తక్షణ డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ కూడా HDFCతో జతగా తన ‘‘బిగ్ బిలియన్ డే సేల్’’ కింద 10 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. కాబట్టి ఆయా పోర్టళ్లలో మీ బ్యాంకుద్వారా చెల్లింపులకు వీలుందో లేదో చూసుకోండి. తద్వారా ధరల్లో, డిస్కౌంట్‌లో తేడాపాడాలు మీకు కలిసిరావచ్చు.
వాలెట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
పోర్టళ్లలో మీ బ్యాంకు లేకపోయినా పర్వాలేదు... మీకు తోడుగా వాలెట్లున్నాయి. వివిధ పోర్టళ్లలో చెల్లింపుల మీద అవి భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేలద్వారా ఆయా వాలెట్లతో మీరు చెల్లించే సొమ్ముపై తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఆ మేరకు పేటీఎం మాల్ తమ ‘పేటీఎం వాలెట్’ద్వారా, అమెజాన్ తమ ‘అమెజాన్ పే’ద్వారా, ఫ్లిప్‌కార్ట్ తమ ‘ఫోన్‌పే’ద్వారా స్నాప్‌డీల్ తమ ‘ఫ్రీచార్జ్’ద్వారా ఈ సదుపాయం కల్పిస్తున్నాయి.
ఎక్స్ఛేంజ్ ఆఫర్లు
మన పాత స్మార్ట్‌ఫోన్లు వగైరాలను మనం తరచూ ‘‘OLX or CASHIFY’’ వంటి పోర్టళ్లద్వారా అమ్మకానికి పెడుతుంటాం. అయితే, ఈ-కామర్స్ కంపెనీలు పండుగ సీజన్ సేల్ సందర్భంగా భారీ ఎక్స్ఛేంజి డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తుంటాయి. ఉదాహరణకు... అమెజాన్ ఇప్పుడు ‘Note 9’ మార్పిడికి అదనంగా రూ.5వేలు ఆఫర్ చేస్తోంది. అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్ కూడా ‘Asus Zenfone 5Z’ మార్పిడి చేసుకుంటే రూ.3వేలు అదనంగా పొందవచ్చునంటోంది. ఇలాంటి మంచి అవకాశాలు ఉంటాయిగనుక ఎక్స్ఛేంజి ఆఫర్లను ఓసారి చెక్ చేసుకోవడం మంచిది.
డీల్ టైమింగ్స్
ఈ-కామర్స్ సైట్లు వివిధ ఉత్పత్తులను, వివిధ డిస్కౌంట్ ధరల్లో రోజులో ఏదో ఒక సమయాన ఆఫర్ చేస్తుంటాయని గుర్తుంచుకోండి. వీలైతే మీకు ఇష్టమైన ఉత్పత్తి అమ్మకాన్ని ప్రకటించే సమయాన్ని గుర్తుచేసేలా రిమైండర్ సెట్ చేసుకోండి. ప్రస్తుత పండుగల సీజన్ ఫ్లాష్ సేల్స్‌లో విక్రయ సమయానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే... నిర్దిష్ట సమయంలో నిర్ణీత ఉత్పత్తిని పరిమిత సంఖ్యలో మాత్రమే అమ్మకానికి పెడతారని మరువకండి.
ఫ్లాష్ సేల్స్.. తక్షణ డిస్కౌంట్లు
బ్యాంక్ ఆఫర్లతో సంయుక్తంగా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లను పండుగల సీజన్‌లో సాపేక్షంగా తక్కువ ధరకు సొంతం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు... ఫ్లిప్‌కార్ట్‌లో ‘‘బిగ్ బిలియన్ డే సేల్’’ సందర్భంగా Realme 2 Pro లేదా Realme C1 ఇలా లభిస్తాయి. మీకు ప్రత్యేక డిస్కౌంట్ ఏదీ లభించకపోవచ్చుగానీ, వాటిని కొనుగోలు చేసినప్పుడు HDFC బ్యాంకు కార్డ్ లేదా PhonePe వంటి మార్గాల్లో చెల్లింపుద్వారా లభించే అదనపు డిస్కౌంట్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. అంటే... సాపేక్షంగా మీరు కోరుకున్న ఉత్పత్తి మీకు తక్కువ ధరకు లభించినట్టే కదా! అందుకే మీ పేమెంట్ వివరాలను సైట్లలో ముందుగానే సేవ్ చేసి ఉంచుకోండి. సేల్ ప్రారంభం కావటానికి 10 నిమిషాలు ముందుగానే లాగిన్ అయిపొండి. అటుపైన ప్రాడక్ట్ పేజ్‌లో చెల్లింపు చేయడానికి సంసిద్ధంగా ఉండండి.
చకచకా చెల్లింపు
చివరగా చెబుతున్న విషయమే అయినా... దీనికి చాలా ప్రాధాన్యముంది. ఎందుకంటే మీరు ఎంచుకున్న ఉత్పత్తికి ధర చెల్లించే ప్రక్రియ పూర్తికావడానికి ఎక్కువ సమయం పడితే సదరు ఉత్పత్తిని మరెవరో ఎగరేసుకుపోయే పరిస్థితి మీకు నిరాశ మిగులుస్తుంది. కాబట్టి ఇటువంటి ఫ్లాష్ సేల్ అవకాశాన్ని ఒడిసిపట్టుకునేందుకు చెల్లింపు మార్గం వివరాలను ముందస్తుగా సేవ్ చేసిపెట్టుకోవడంతోపాటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగవంతమైనదిగానూ ఉండటం కీలకం. లేకపోతే కేవలం 30 నుంచి 45 సెకన్ల వ్యవధిలో అంతా పూర్తిచేయడం దుర్లభమన్న వాస్తవాన్ని మరచిపోకండి!