అమెజాన్ ఆన్‌లైన్ వ్యాపార వేదిక తన మొబైల్ యాప్ వినియోగదారులకు ‘‘PAY EMI’’ పేరిట వస్తు కొనుగోలుపై కొత్త చెల్లింపు పద్ధతిని ప్రకటించింది. దీనికింద నమోదైనవారి ఖాతాలో అమెజాన్ తక్షణ రుణ పరిమితిని నిర్దేశిస్తుంది. ఆ తర్వాత ఖాతాదారులు డెబిట్ కార్డుద్వారా స్వల్ప వడ్డీతో ఆ రుణాన్ని నెలవారీ వాయిదాలలో తీర్చవచ్చు. ఇదెలా పనిచేస్తుందంటే:-
• అమెజాన్‌లో కనీసం రూ.8000కు మించిన ధరగల వస్తువు కొంటే పే ఈఎంఐ సౌకర్యాన్ని వాడుకోవచ్చు.
• నిర్ణీత రుణ పరిమితి అర్హతగల ఎంపిక చేసిన వినియోగదారులకు ఈ పద్ధతిని అనుమతిస్తుంది. కొద్ది రోజుల్లో మరింతమంది ఖాతాదారులకు విస్తరిస్తామని అమెజాన్ ప్రకటించింది.
• ప్రస్తుతానికి ఈ పద్ధతి మొబైల్‌ద్వారా నిర్వహించే లావాదేవీలకు మాత్రమే పరిమితం.
వినియోగదారులు తమ డెబిట్ కార్డు అనుసంధానం ద్వారా ఆటోమేటిక్‌గా ఈ సదుపాయం వాడుకోవడానికి వీలుగా Capital Float సంస్థతో అమెజాన్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి అమెజాన్ యాప్‌లో HDFC, ICICI, Canara, Citi, Kotak Mahindra బ్యాంకుల ఖాతాదారులు రుణ సదుపాయానికి అర్హులని ప్రకటించింది. రుణ సౌకర్యాన్ని వినియోగించుకున్న వారు 3 నుంచి 12 నెలల కాలంలో నెలవారీగా వాయిదాల కింద తిరిగి చెల్లించవచ్చు.
షరతులు.. నిబంధనలు ఇవే
‘అమెజాన్ పే ఈఎంఐ’ కింద ఎంపికైన వినియోగదారులు సులభమైన రెండంచెల ప్రక్రియలో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా వారు పొందగల రుణ పరిమితిని నిర్దేశిస్తారు. అధిక ధరగల వస్తువుల కొనుగోలు కోసం వారు అమెజాన్ విక్రయవేదికలో ఈ రుణాన్ని వినియోగించుకోవచ్చు. ‘పే ఈఎంఐ’ కింద నమోదుకోసం పాన్, ఆధార్ కార్డులద్వారా వినియోగదారులు తమ గుర్తింపును నిర్ధారించుకోవాలి. ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్ నంబర్‌కు వచ్చే ఒన్‌టైమ్ పాస్‌వర్డ్ (OTP)తో గుర్తింపును నిర్ధారించుకోవచ్చు. ఇది పూర్తయ్యాక వారికి తక్షణం రూ.60,000 రుణ పరిమితి మంజూరవుతుంది. అమెజాన్‌లో రూ.8వేల కన్నా ఎక్కువ, రూ.60వేల కన్నా తక్కువ ధరగల పలు రకాల వస్తువుల కొనుగోలుకు ఈ రుణ పరిమితిని వాడుకోవచ్చు. నెలవారీ వాయిదా సౌకర్యం ఆధారంగా దీనిపై వడ్డీ నిర్ణయిస్తారు. వాయిదాలను ఆటోమేటిక్‌గా చెల్లించేలా తమ బ్యాంకు ఖాతా/డెబిట్ కార్డు లేదా నెట్‌బ్యాంకింగ్ ఖాతాను తమ అమెజాన్ రుణఖాతాకు వినియోగదారులు అనుసంధానించాలి. కొనుగోలు చేసిన వస్తువు ధరనుబట్టి నెలవారీ వాయిదా మొత్తం నిర్ణయించబడుతుంది. అయితే, వస్తుమార్పిడి ఆఫర్లపై కొనుగోలుకు Amazon Pay EMI వర్తించదు. కొనుగోలు చేసిన వస్తువు ధరకు తగిన మొత్తం ఖాతాదారు అనుసంధానించిన బ్యాంకు ఖాతాలో ఉండి తీరాలి. ‘పే ఈఎంఐ’ద్వారా చెల్లింపు చేసేటపుడు పేమెంట్ సెక్షన్‌లో Amazon Pay balance ఆప్షన్‌ను ఎంచుకోకూడదు. తమ ‘ఈఎంఐ’ ఆర్డర్, చెల్లింపులు-బకాయిల హిస్టరీని ఖాతాదారులు ‘అమెజాన్ పే’ హోమ్‌పేజీలో చూసుకోవచ్చు.
రుణ పరిమితిని ఎలా నిర్ణయిస్తారు?
వినియోగదారుల క్రెడిట్ బ్యూరో హిస్టరీసహా ఇతర మార్గాల్లో లభ్యమయ్యే సమాచారం, తమతో లావాదేవీల వివరాలు ఆధారంగా వారి రుణ పరిమితిని అమెజాన్ నిర్ణయిస్తుంది. అయితే, వాయిదాల పద్ధతిపై రుణమిచ్చే తమ భాగస్వామి (Capital Float) ఈ పరిమితిని నిర్ణయిస్తుందని అమెజాన్ చెబుతోంది. ఇక ఆభరణాలు, గిఫ్ట్‌కార్డ్, అమెజాన్ పే బ్యాలన్స్ టాపప్‌ల కోసం లేదా అమెజాన్ గ్లోబల్ స్టోర్ నుంచి ఉత్పత్తుల కొనుగోలుకు Pay EMI పద్ధతిని అనుమతించరు. ‘‘ఆన్‌లైన్ షాపింగ్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవడంపై మేం దృష్టి సారించాం. ప్రతి అమెజాన్ కస్టమర్‌కూ రుణ లభ్యత లక్ష్యంగా ఎలాంటి చిక్కులూ లేని Amazon Pay EMIని ప్రవేశపెట్టాం. ఇది కేంద్ర ప్రభుత్వ డిజిటల్ చెల్లింపుల విధానానికి అనుగుణంగా ఉంటుంది’’ అని వికాస్ బన్సల్ (ఎమర్జింగ్ పేమెంట్స్ డైరెక్టర్) ఈ సందర్భంగా తెలిపారు.