దేశంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రజాదరణ పెరుగుతోంది. జనాదరణగల వస్తువులపై భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల వంటివి ప్రకటిస్తూ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు కూడా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు వస్తువు నేరుగా ఇంటికే చేరుతున్నందువల్ల షోరూమ్‌లకు వెళ్లి కాళ్లు పడిపోయేలా తిరిగి... వస్తువు నాణ్యత వివరాలను పరిశీలించి... ఎంపిక చేసుకోవడానికి పట్టే సమయం ఆదా అవుతోంది. అందుకే ఆన్‌లైన్ షాపింగ్ ఊపందుకుంటోంది. అయితే, ఈ సందర్భంగా మనం ఆయా వస్తువుల ధరలు, ఆఫర్లు, డిస్కౌంట్లు తదితరాలను పోల్చి చూడటం సర్వసాధారణం. ఇందుకు కాస్త సమయం వెచ్చించడంతోపాటు వివరాలు తెలుసుకోవడానికి ఇంకాస్త శ్రమపడాలి. ఈ బాధ లేకుండా పోలికలు, వ్యత్యాసాలను చక్కగా మనముందుంచే వెబ్‌సైట్లు ఇవాళ మన ముందున్నాయి. ఇవి ప్రసిద్ధ ఈ-కామర్స్ వేదికలైన ‘‘అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, పేటీఎం’’వంటి వెబ్‌సైట్ల నుంచి వివరాలు సేకరించి వాటిలో లభించే వస్తువుల ధరలు, ఆఫర్లు తదితరాలను నివేదిస్తాయి... ఆ సైట్లు ఏమిటో చూద్దామా:-
MYSMART PRICE
ధరలను కంపేర్ చేసి చూపే వెబ్‌సైట్ల జాబితాలో తొలి, అత్యుత్తమ సైట్ ‘MySmart Price.’ ఇందులో మొబైల్స్, ల్యాప్‌టాప్స్, టీవీలు, ఫ్యాషన్ వస్తువుల ధరలను వినియోగదారులు ఎక్కువగా పోల్చి చూస్తుంటారు. ఆయా వస్తువుల తయారీ సంస్థలవారీగా ఈ వెబ్‌సైట్‌లో ఉత్పత్తుల ధరలు మనకు కనిపిస్తాయి. మీరు ఏ కేటగిరీలో.. ఏ బ్రాండ్ వస్తువును, ఏ ధరలో కొనాలనుకుంటున్నారో అందులోని ఆప్షన్లద్వారా ఎంపిక చేస్తే చాలు. మీరు కోరుకున్న అంశాల మేరకు... కావాల్సిన ఉత్పత్తిని కచ్చితంగా మీ కళ్లముందు ఉంచుతుంది. అప్పుడు మీరు వేర్వేరు వెబ్‌సైట్లలో దాని ధరలను పోల్చి చూసుకోవచ్చు. పైగా వస్తువుల ధర తగ్గినపుడు మనను అప్రమత్తం చేసే ఫీచర్ ఈ వెబ్‌సైట్‌లోగల మరో అద్భుత సౌలభ్యం. అలాగే ఆకర్షణీయ ఆఫర్ల సమాచారం కోసం ఇందులో ప్రత్యేక పేజీ కూడా ఉంటుంది.
COMPARERAJA.IN
ఉత్పత్తుల కోసం సులభంగా సెర్చ్ చేయడానికి అమోఘమైన యూజర్ ఇంటర్‌ఫేస్ ఉండటం ‘Compare Raja.in’ వెబ్‌సైట్ ప్రత్యేకత. సెర్చ్ బార్‌లో మీరు ఉత్పత్తి పేరును ఎంటర్ చేస్తే చాలు.. అది అతి తక్కువ ధరకు లభించే ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఏ స్టోర్‌లో ఎంత ధర ఉన్నదో కూడా చూపుతుంది. ప్రాడక్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను వీడియో సమీక్షద్వారా చూడగల సదుపాయం కూడా కంపేర్ రాజాలో ఉంది. అప్పటికప్పుడే ఆ ఉత్పత్తిని మీరు కొనాలనుకుంటే ప్రైస్ ట్యాగ్‌తోపాటు మీకో డిస్కౌంట్ కూపన్ కూడా అందిస్తుందీ వెబ్‌సైట్. అలాగే మీరు నిర్దిష్ట వస్తువును ఏ ధరకు కొనాలని భావిస్తున్నారో ఒక మెయిల్‌ద్వారా కంపేర్ రాజాకు సమాచారమిస్తే ఆ వస్తువు మీరు సూచించిన ధరకు దిగిరాగానే మీకు మెయిల్ వస్తుంది.
PRICE RAJA
దేశంలో ఎక్కడెక్కడ మొబైల్ ఫోన్లు, యాక్సెసరీలు లభించే ఈ-కామర్స్ వేదికలున్నాయో Price Raja విడమరచి చూపుతుంది. టాప్ బ్రాండ్లు, ఫీచర్లు, కనెక్టివిటీ, డిస్‌ప్లే సైజ్, ప్రాసెసర్ టైప్, సిరీస్-ప్రైస్ రేంజ్ పరంగా సమాచారం ఇస్తుందీ వెబ్‌సైట్.
MAKKHICHOOSE (PLUGIN)
ఇది క్రోమ్ బ్రౌజర్ ప్లగ్ఇన్. ఏదైనా వెబ్‌సైట్ ఆన్‌లైన్ షాపింగ్ పేజ్‌లోకి వెళ్లినపుడు నిర్దిష్ట ఉత్పత్తి వివరాలతోపాటు ఏ స్టోర్‌లో తక్కువ ధరకు లభిస్తుందో MakkhiChoose ప్లగ్ఇన్ మనకు చూపుతుంది. భారత షాపర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ప్లగ్ఇన్ దేశంలోని 8 ఆన్‌లైన్ స్టోర్లలో ధరలను పోల్చి చూపుతుంది. ఈ స్టోర్లలో ‘‘హోమ్‌షాప్18, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, నాప్‌టాల్, ఇండియాప్లాజా’’లతోపాటు మరో మూడు సైట్లున్నాయి.
JUNGLEE
ఉత్పత్తుల ధరలను పోల్చి చూపడంలో మంచి పేరున్న మరో వెబ్‌సైట్ Junglee. ఇందులో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, షూస్, వాచీలు, సినిమాలు, పుస్తకాలు, బొమ్మలు, క్రీడా పరికరాలు వంటి ఎన్నో ఉత్పత్తుల ధరలను పోల్చి చూసుకునే వీలుంది. అమెజాన్ రూపొందించిన ఈ వెబ్‌సైట్ భారత వినియోగదారులకు ఉత్పత్తుల ధరలను పోల్చి చూపుతుంది. ఇదెంత విస్తృతమైనదంటే ఇందులో 14000 బ్రాండ్లకు చెందిన 1.2 కోట్ల ఉత్పత్తులను చూసుకోవచ్చు. ముఖ్యంగా మొబైళ్ల ధరలను కంపేర్ చేయడంలో అత్యుత్తమైనదిగా పేరున్న ఏ వెబ్‌సైట్‌కూ ఇది తీసిపోదు.
SMARTPRIX
మొబైల్ ఫోన్ల ఎంపికలో ఉపయోగపడే చక్కటి ఉపకరణం Smartprix. ఈ టూల్ తోడ్పాటుతో ఐదు మొబైల్స్‌ను ఒకేసారి ఎంపిక చేసుకుని ధరలను సరిపోల్చి చూసుకోవచ్చు.
PRICEBABA
ఇదొక ఇంటెలిజెంట్ షాపింగ్ ఇంజిన్. మీ నగరంలో లభించే అత్యుత్తమ మొబైల్స్ ధరలను మీకు అందిస్తుంది. దాంతోపాటు వాటి స్పెసిఫికేషన్లను, ఫీచర్లను Pricebaba చూపుతుంది. ఇందులో ప్రస్తుతం ముంబై, థానె, పుణె, గుర్‌గావ్, ఢిల్లీ, నోయిడా నగరాలకు సంబంధించిన షాప్‌ల వివరాలు మాత్రమే లభ్యమవుతుండగా త్వరలో మిగిలిన నగరాలకూ విస్తరిస్తామని యాజమాన్యం చెబుతోంది.
BUYHATKE.COM
ఇది Bidon Services Pvt. Ltd సంస్థ శాఖలలో ఒకటి. భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు సహాయపడటానికే Buyhatke.com పరిమితం. ఇందులో ముందుగా మనం నమోదు కావాల్సి ఉంటుంది. రిజిస్టర్ కాకపోయినా సెర్చ్ చేయవచ్చుగానీ, రిజిస్టర్ కావడం మంచి పని. ఈ సెర్చింజన్ వస్తువు ధరతోపాటు రిటెయిలర్ దుకాణం పేరును సూచించడమేగాక మీ బడ్జెట్‌కు తగిన వస్తువును ఎంచుకునేలా సహాయపడుతుంది.
PLUS 91 MOBILES.COM
మొబైల్ ఫోన్Lకు సంబంధించి సకల విధాల సమాచారాన్ని మన ముందుంచగలదు ‘‘+ 91 mobiles.com’’ వెబ్‌సైట్. తయారీ కంపెనీ ఏదైనా సరే... ఆయా మొబైల్ ఫోన్ల స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సమీక్షలు, వీడియోలు, ఫొటోలు, ధరల పోలిక తదితరాలను క్షుణ్నంగా అందిస్తుంది. అలాగే అందులో కనిపించేవి కాకుండా విభిన్న వెబ్‌సైట్ నుంచి మొబైల్ ఫోన్ కొనుగోలు లింక్‌ను కూడా అందిస్తుంది.